లెహర్ వర్రీ
Published Thu, Nov 28 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
అమలాపురం, న్యూస్‌లైన్ :జిల్లావాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ‘లెహర్’ గండం తప్పించమని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. బుధవారం ఎక్కడ చూసినా తాజా తుపాను హెచ్చరికలపైనే చర్చించుకోవడం కనిపించింది. బుధవారం ఉదయం ఎండ కాయగా, మధ్యాహ్నం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యమధ్యలో గాలులు వీస్తుండడం, సముద్రం 30 నుంచి 40 మీటర్లు వెనక్కు వెళ్లిపోవడం లెహర్ రాకకు సంకేతాలుగా భావిస్తున్నారు. తుపాను దిశమార్చుకుందని, ముందుగా చెప్పినట్టు కాకినాడ వద్ద కాక మచిలీపట్నం సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. అయితే జిల్లాపై తీవ్రత ఉంటుందని, పెనుగాలుల ప్రభావం తప్పదని చెప్పడంతో జిల్లావాసులను భయం వీడడం లేదు. కోనసీమవాసుల్లో ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. హెలెన్ తుపాను వల్ల ఇప్పటికే చావుదెబ్బ తిన్న ఈ ప్రాంత వాసులు.. లెహర్ తీరం దాటే సమయంలో గంటలకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందన్న అంచనా ఈ ప్రాంత వాసులను మరింత కలవరానికి గురి చేస్తోంది.
పునరావాస కేంద్రాల్లో కొరవడ్డ సదుపాయాలు
తీరంలోని మత్స్యకార గ్రామాల్లో కర్ఫ్యూవాతావరణం నెలకొని.. ‘తుపాను ముందరి ప్రశాంతత’ రాజ్యమేలుతోంది. వందలాది కుటుంబాలు పెట్టేబేడా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండడంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. 1996 తుపానును దృష్టిలో పెట్టుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు మత్స్యకారులను పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తొలుత ఇళ్లు విడిచేందుకు వీరు నిరాకరించినా జేసీ ఎం.ముత్యాలరాజుతోపాటు పలువురు అధికారులు పట్టుబట్టి తరలిస్తున్నారు. తీరంలోని 15 మండలాల్లోని 57 గ్రామాలపై లెహర్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాతో ఇంత వరకు 29,865 మందిని తరలించారు. వీరి కోసం 73 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా సముద్రతీరాన్ని ఆనుకుని ఉండే వలస మత్స్యకారులను ముందుగా తరలించారు. కోనసీమలో అత్యధికంగా కాట్రేనికోన మండలంలోని మగసానితిప్ప, నీళ్లరేవు, చిర్రయానానికి చెందిన సుమారు ఐదు వేల మందిని కాట్రేనికోన తరలించారు. పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ, బలుసుతిప్పకు చెందిన మరికొంతమంది మత్స్యకారులను రాత్రి సమయంలో తరలించనున్నారు. ఐ.పోలవరం మండలంలో భైరవపాలెం నుంచి 3000 మందిని గాడిమొగలోని రిలయన్స్ సంస్థ భవనానికి తరలించారు.
గోగుల్లంక, భైరవలంక, జి.మూలపొలం గ్రామాలకు చెందిన సుమారు 1,500 మందిని, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలానికి చెందిన 200 మందిని, తాళ్లరేవు పిల్లలంక పంచాయతీ పరిధిలో కొత్తలంకకు చెందిన 150 మందిని, హోప్ ఐలాండ్‌కు చెందిన 200 మందిని, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన 500 మందిని, సఖినేటిపల్లి మండలం పల్లిపాలానికి చెందిన 150 మందిని, మలికిపురం మండలంలో తీరప్రాంత గ్రామాల నుంచి 500 మందిని, యానాంలో ఫ్రాన్స్‌తిప్పకు చెందిన 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే పునరావాస కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక, సరిపడా భోజనం కూడా పెట్టక బాధితులు అవస్థలు పడాల్సి వస్తోంది. యానానికి చెందిన వేటబోట్లు సముద్రంలో చిక్కుకున్నట్టు సమాచారం అందడం అధికారులను పరుగులు పెట్టించింది. అయితే ఈ బోట్లు కోల్‌కతాకు చేరుకున్నట్టు సమాచారం అందడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
లెహర్ తుపానును ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తమవుతున్నారు. లెహర్ ప్రభావం తీవ్రంగా ఉండగలదని భావిస్తున్న ప్రాంతాలకు జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన పదవ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్‌బెహరా నేతృత్వంలో 16 బృందాలు, ఆర్మీకి చెందిన మరో రెండు బృందాలు చేరుకున్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి తుపానును ఎలా ఎదుర్కొనాలో సూచలు చేస్తున్నారు. తీరంలో పదుల సంఖ్యలో తుపాను షెల్టర్లు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండడంతో వాటికి బదులు ఆయా ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వందలాదిగా తరలిరావడంతో అవి కూడా కిక్కిరిసిపోతున్నారు. బాధితులకు కిరోసిన్ లాంతర్లు పంపిణీ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. ఆమెతో పాటు జిల్లా ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుంటే రక్షించేందుకు ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలని వారు స్థానికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏటీఎంల వద్ద క్యూలు
లెహర్ తీవ్రత 1996 నాటి తుపానును మించి ఉండగలదన్న హెచ్చరికల నేపథ్యంలో కోనసీమ ప్రజలు నిత్యావసర వస్తువులను ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. వారానికి సరిపడా బియ్యం, పప్పు, ఉప్పులు, కిరోసిన్, కూరగాయలు, తాగునీరు నిల్వ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుపాను అనివార్యమైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉండడంతో ఏటీఎంలు పనిచేయకపోవచ్చన్న ఆలోచనతో బ్యాంకుల ఖాతాదారులందరూ ముందస్తుగానే కొంత సొమ్మును డ్రా చేసుకుంటున్నారు. కోనసీమలో బుధవారం ఏ ఏటీఎం వద్ద చూసినా జనం క్యూ కట్టి కనిపించారు. పెట్రోల్ బంక్‌లు మూతపడే అవకాశం ఉండడంతో తమ వాహనాల్లో వారానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నింపుకొంటున్నారు. పాల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పాలపొడి ప్యాకెట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
Advertisement
Advertisement