తీవ్రత తగ్గుతున్న ‘లెహర్’ | cyclone lehar turns towards machilipatnam | Sakshi
Sakshi News home page

తీవ్రత తగ్గుతున్న ‘లెహర్’

Published Thu, Nov 28 2013 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

తీవ్రత తగ్గుతున్న ‘లెహర్’

తీవ్రత తగ్గుతున్న ‘లెహర్’

అతి తీవ్రస్థాయి నుంచి తీవ్ర తుపానుగా మార్పు
నేడు మచిలీపట్నం వద్ద తీరం దాటనున్న లెహర్
సాక్షి, విశాఖపట్నం:
రాష్ట్రానికి టెన్షన్ పుట్టించిన లెహర్ తుపాను తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కాకినాడ నుంచి మచిలీపట్నం వైపు దిశమార్చుకుని అతి తీవ్ర స్థాయి నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడుతోంది. తీరం దాటే సమయంలో మరింత బలహీనపడి తుపానుగానే మారొచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయవ్య దిశగా మచిలీపట్నానికి 450 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 470 కి.మీ. దూరంలో కదులుతోంది. లెహర్ ప్రభావంతో కోస్తాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం మినహా కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 29వ తేదీ వరకు ప్రభావం ఉంటుందని, ప్రకాశం జిల్లాతోపాటు తెలంగాణలోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల 80 కి.మీ. నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో వీటి తీవ్రత మరింత ఉంటుందన్నారు. మచిలీపట్నంలో ఏడో నంబర్, ఓడరేవు, కాకినాడలో ఆరో నంబర్, నిజాంపట్నంలో 5వ నంబర్, మిగతా అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఒక మీటరు ఎత్తు వరకు ఎగిసి పడొచ్చని, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 మచిలీపట్నం తీరంలోనే ఎందుకు: తుపాన్లు మచిలీపట్నంలోనే ఎందుకు తీరం దాటుతున్నాయన్న అంశంపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చల్లగాలులు వీస్తున్న కొద్దీ తుపాను బలహీనపడుతుంది. తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్నది గాలి దిశపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వాయవ్యం నుంచి గాలులు వీస్తుండడంతో మచిలీపట్నం వైపు తుపాను దూసుకొస్తోంది. తుపాన్లు సముద్రంలో ఉన్నప్పుడు చాలా శక్తి కావాలి. కావాల్సిన ఉష్ణోగ్రతలుంటేనే అవి బలపడతాయని, నదీ ముఖ ద్వారాలవైపే పయణిస్తాయని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు.
 కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన: రాష్ర్టంలో బుధవారం అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం సాయంత్రంలోపు తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
 తగినంత సాయం చేస్తాం: కేంద్రం
 న్యూఢిల్లీ: లెహర్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తగిన సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై తుపానుపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement