అద్దె గదులన్నింటికీ కాషన్ డిపాజిట్ రద్దు
తిరుమల భక్తులకు ఈనెల 24 నుండి అమలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిదర్శనం కోసం వచ్చే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గదుల కాషన్ డిపాజిట్‌ను ఈ నెల 24 తేదీనుంచి టీటీడీ రద్దు చేయనుంది. రూ. 50 నుంచి ఆపై అద్దె గల అన్ని రకాల అద్దె గదులకు ఇది వర్తిస్తుంది. భక్తులపై పూర్తి విశ్వాసంతో అన్ని రకాల అద్దె గదులకు కాషన్ డిపాజిట్ పద్ధతిని రద్దు చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు త్వరలో బ్యాటరీ ద్వారా నడిచే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో వెల్లడించారు. కాగా, శ్రీవారి దర్శనాన్ని ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక సుపథం ద్వారా కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.
30న దీపావళి ఆస్థానం: శ్రీవారి ఆలయంలో 30న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఏటా అమావాస్య (దీపావళి) రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 మధ్య బంగారు వాకిలి ఘంటామండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.