ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ట్విటర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ట్విటర్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాణ్ని కాదేమోన’ని అన్నారు. మీడియా అసత్యపు ప్రచారాలను దాటి ప్రజల్లోకి వెళ్లడానికి సామాజిక మాధ్యమం ట్విటర్ తనకు ఉపయోగపడుతోందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
‘నాకు ఒక నకిలీ, నిజాయితీ లేని మీడియా లభించింది’అని అమెరికాలో మూడు ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, సీబీఎస్, ఎన్‌బీసీలను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మూడు మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. ఫాక్స్ న్యూస్ మాత్రం తనకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు.
అలాగే ఎన్నికలకు ముందు ట్రంప్ టవర్స్‌లోని తన ఫోన్లను నాటి అధ్యక్షుడు ఒబామా ట్యాప్ చేశారని ట్రంప్ మార్చి 4న ట్విటర్ ద్వారా ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఏ ఆధారాలూ లభించలేదని పేర్కొనగా, ఆధారాలను కమిటీకి త్వరలోనే సమర్పిస్తామని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు.