దక్షిణకొరియాలోని సియోల్‌లో మంత్రి పొంగులేటి నేతృత్వంలో పర్యటన
5 రోజులపాటు ప్రాజెక్టులను పరిశీలించనున్న బృందం
హాన్ నది తరహాలో మూసీని అభివృద్ధి చేయాలనే ప్రణాళిక
మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్‌లో ప్రత్యేక పరిశీలన
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి): ‘మూసీ’ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ కొరియాలోని సియోల్‌లో నదులను అభివృద్ధి చేసిన తీరుపై రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. అక్కడి హాన్, చియోంగ్‌చియాన్ నదుల పునరుజ్జీవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. హాన్, చియోంగ్‌చియాన్ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, పాటించిన పద్ధతులు, విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని.. అదే తరహాలో రాష్ట్రంలో మూసీ నదికి ప్రాణం పోయాలని భావిస్తోంది.
ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల నేతృత్వంలోని రాష్ట్ర బృందం.. సోమవారం సియోల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రులు తొలుత చియోంగ్‌చియాన్ నది వెంట కలియదిరుగుతూ.. పునరుద్ధరణ ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ‘మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్’ను సందర్శించారు. ఐదు రోజుల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన ఈ బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
రోజూ వెయ్యి టన్నులు రీసైక్లింగ్
మాపో రిసోర్స్ రికవరీ ప్లాంటులో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’ సాంకేతికత వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర బృందానికి సియోల్ నగరపాలక సంస్థ అధికారులు వివరించారు. పర్యవరణంపై ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మరో పదేళ్లలో భూఉపరితలం నుంచి ఈ ప్లాంటును తొలగించి, భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. సియోల్ నగరానికి పశి్చమాన ఉన్న ఈ ప్లాంట్‌ను 2005లో ప్రారంభించారు. ఇందులో ఏటా 2 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
మూసీ అభివృద్ధి కోసం..
సియోల్‌లో నదులకు పునరుజ్జీవం కల్పించినట్టే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సియోల్‌లోని చియోంగ్‌చియాన్ నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హన్ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర బృందంతో కలిసి పరిశీలించానని తెలిపారు. అక్కడ ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో జీవించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నూతన కళను సంతరించుకుందని చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు టూరిస్టు హబ్‌గా మారాయని.. వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment