moosi rivar
-
‘చియోంగ్‌చియాన్’పై అధ్యయనం
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి): ‘మూసీ’ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ కొరియాలోని సియోల్‌లో నదులను అభివృద్ధి చేసిన తీరుపై రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. అక్కడి హాన్, చియోంగ్‌చియాన్ నదుల పునరుజ్జీవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. హాన్, చియోంగ్‌చియాన్ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, పాటించిన పద్ధతులు, విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని.. అదే తరహాలో రాష్ట్రంలో మూసీ నదికి ప్రాణం పోయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల నేతృత్వంలోని రాష్ట్ర బృందం.. సోమవారం సియోల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రులు తొలుత చియోంగ్‌చియాన్ నది వెంట కలియదిరుగుతూ.. పునరుద్ధరణ ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ‘మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్’ను సందర్శించారు. ఐదు రోజుల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన ఈ బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. రోజూ వెయ్యి టన్నులు రీసైక్లింగ్ మాపో రిసోర్స్ రికవరీ ప్లాంటులో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’ సాంకేతికత వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర బృందానికి సియోల్ నగరపాలక సంస్థ అధికారులు వివరించారు. పర్యవరణంపై ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మరో పదేళ్లలో భూఉపరితలం నుంచి ఈ ప్లాంటును తొలగించి, భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. సియోల్ నగరానికి పశి్చమాన ఉన్న ఈ ప్లాంట్‌ను 2005లో ప్రారంభించారు. ఇందులో ఏటా 2 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మూసీ అభివృద్ధి కోసం.. సియోల్‌లో నదులకు పునరుజ్జీవం కల్పించినట్టే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సియోల్‌లోని చియోంగ్‌చియాన్ నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హన్ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర బృందంతో కలిసి పరిశీలించానని తెలిపారు. అక్కడ ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో జీవించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నూతన కళను సంతరించుకుందని చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు టూరిస్టు హబ్‌గా మారాయని.. వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు. -
టెక్సాస్‌లోని రివర్ వాక్‌లా మూసీ ఉంటే.. బోటుతో చుట్టేయ్యొచ్చు!
భాగ్యనగర మురికి నీటితో నిర్భాగ్యురాలైంది మూసీ, ప్రవాహం దెబ్బతిని పక్షవాత రోగయింది. అసలు మూసీ ఒకప్పటి ముచుకుంద కృష్ణా ఉపనది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ మహా నగరంలో దాదాపు 50 కి మీ ప్రవహిస్తూ వెళ్తుంది. సిటీ మురికి నీటికి తోడు పారిశ్రామిక వ్యర్థాలు కూడా కలిసి దీన్ని మురికి నదిగా మార్చాయి. లంగర్ హౌస్ బాపూ ఘాట్ నుండి నాగోల్ బ్రిడ్జ్ వరకు 14 కి.మీ వరకు గల మూసీని సుందరీకరణ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ‘ నందనవనం ’ సాధించింది శూన్యం. ‘మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘ ఉత్త హడావిడి మాత్రమేనని తేలిపోయింది. నేను అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు సాన్ అంటోనియా నగరంలోని ‘ రివర్ వాక్ ’ చూసినప్పుడు నా మనసులో మెదిలింది మూసీనే. దేవతల్ని ఆదుకోడానికి హాలాహలం మింగిన శివుడిలా భాగ్యనగర కాలుష్యాన్నంతా భరిస్తున్నది మన మూసీ నదినే. సాన్ అంటోనియా అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటి. ఆస్టిన్ నుంచి కేవలం గంటన్నర డ్రైవ్‌లో ఇక్కడకు చేరుకోవచ్చు. దీని జనాభా రెండు మిలియన్ల ( 2011 ) పైనే, వీరిలో హిస్పానిక్స్ ఎక్కువ . ఇది పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, ఇందులో ముఖ్యమైనవి సీ వరల్డ్ , రివర్ వాక్‌లు. ఈ నగర డౌన్ టౌన్ నుండి మెలికలు తిరుగుతూ సాగే రివర్ వాక్ , దీనికి అటు ఇటు ఎన్నో సందర్శనీయ స్థలాలు, షాప్ లు, బోలెడన్ని రెస్టారెంట్లు ముఖ్యంగా మెక్సికన్ ఫుడ్ కు సంబంధించినవి. సాన్ అంటోనియా నది వరదల వల్ల 1921లో జరిగిన అపార జన, ఆస్తి నష్టాలను దృష్టిలో పెట్టుకొని వాటి నివారణకు గాను 1926 లో ఓల్మాస్ డ్యామ్, బైపాస్ చానల్లు నిర్మించారట. 1938లో ‘సాన్ అంటోనియా రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్’ ఏర్పాటు చేసి డౌన్ టౌన్ నుంచి దాదాపు 15 కి మీ వరకు నిర్మించిందే ఈ రివర్ వాక్. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్శించడంలో విజయవంతమైన ఈ రివర్ వాక్ ప్రభావంతో యూ ఎస్ లోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు రావడం విశేషం. సాన్ ఫెర్నాండో కాథడ్రిల్ చర్చి, మార్కెట్ స్ట్రీట్‌ను కలుపుతూ డౌన్‌టౌన్ ఏరియాకు దారి తీసే రోడ్లు రద్దీగా ఉంటాయి. సాన్ అంటోనియా రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన అనుభవం. నదికి ఇరువైపులా ఉండే ఫుట్‌పాత్‌పై సాయంకాలం నడవడం ఎప్పటికీ మరిచిపోలేం. ఓ పక్క నది, మరో పక్క ఫుడ్ సెంటర్లు, రెస్టరెంట్లు, మధ్య మధ్యన నదిలోంచి వెళ్లే బోట్లు... నాలుగు కిలోమీటర్ల దూరం ఎంతో బాగుంటుంది. ఇక రివర్‌వే పక్కన ఎన్నో అట్రాక్షన్లను ఏర్పాటు చేశారు. 229 మీటర్ల ఎత్తుతో కట్టిన టవర్ ఆఫ్ అమెరికాస్‌ను తప్పకు చూడాల్సిందే. లిఫ్ట్‌లో పైకి వెళ్లి చూస్తే.. ఇళ్లు, కార్లు అగ్గిపెట్టెల్లా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న మ్యూజియంలు, ఎనిమల్ థీమ్ హోటళ్లు, అద్భుతమైన హోటళ్లు టూరిస్టులకు మరింత మజా ఇస్తాయి. అలాగే వందల ఏళ్ల కింద కట్టిన ఇళ్లు, పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. యూరోపియన్లు రాకముందే శాన్ అంటోనియాలో లోకల్ అమెరికన్ల జన జీవనం సాగింది. దక్షిణాదిన ఉండే ఈ ప్రాంతం ఉత్తరాదితో ఎన్నో యుద్ధాలు చేసింది. గన్ కల్చర్ ఎక్కువ. కొన్నాళ్ల పాటు మెక్సికో పాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేందుకు 1836లో ఇక్కడ యుద్ధం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ మొత్తం మెక్సికన్ కల్చరే కనిపిస్తుంది. ఎక్కువ భాగం షాపులు, మాల్స్ కూడా మెక్సికన్లవే. ఈ నగరంలో ఓ పక్కన పురాతన భవనాలు, పాడుబడిన వారసత్వ సంపద కనిపిస్తుంది. అతి పెద్ద కౌబాయ్ బూట్లను ఓ రోడ్డు కూడలిలో పెట్టారు. వాటికి గిన్నీస్ బుక్‌లో చోటు దొరికింది. ది గేట్ వే ( 1962 ), క్లాక్ & డాగర్ ( 1984 ), సెలెనా ( 1997 ) వంటి హాలీవుడ్ మూవీస్ లకు కూడా ఎక్కడంతో సాన్ అంటోనియా రివర్ వాక్ కుమరింత ప్రచారం లభించింది. హైదరాబాద్ మూసీ కూడా సాన్ అంటోనియా, లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టుల స్థాయిలో అభివృద్ధి చెందితే మనం కూడా మూసీ లో బోటు షికార్లు చేయవచ్చు ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
ఉప్పల్ మెట్రో ఓసీసీకి చుక్కలుచూపిస్తున్న మూసీ కాలుష్యం, ఇలాగైతే ఎలా?
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రోపై మూసీ కాలుష్యం పంజా విసురుతోంది. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మూడు మార్గాల్లో పరుగులు తీసే మెట్రో రైళ్లను నియంత్రించే ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)కు మూసీ కాలుష్యం పొగబెడుతోంది. బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీల వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న మూసీ నది నుంచి తరచూ వెలువడుతున్న ఘాటైన వాసనలు ఈ కేంద్రంలోని సున్నితమైన ఎల్రక్టానిక్, హార్డ్‌వేర్, కంప్యూటర్ ఆధారిత సేవలను దెబ్బతీస్తున్నాయి. ఈ కాలుష్యం కారణంగా ఓసీసీ కేంద్రంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామంతో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతింటోంది. దీంతో పట్టాలపై ఉన్నపళంగా మెట్రో రైళ్లు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెట్రో అధికారులు సైతం తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో హతాశులవుతున్నారు. ఉప్పల్‌లో సుమారు 104 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మెట్రో డిపోను, ఓసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ ప్రాంగణంలో రైళ్లను నిత్యం శుభ్రపరచడం, రైళ్ల గమనాన్ని నియంత్రించడం, తరచూ తలెత్తే సమస్యలు, ఇతర నిర్వహణ, మరమ్మతులు చేపడుతున్నారు. దీనిపై మెట్రో నిర్మాణ,నిర్వహణ సంస్థ ఎల్అండ్టీతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఈ అంశంపై మాట్లాడేందుకు వారు నిరాకరించడం గమనార్హం. పరిష్కారమిదే.. నగరంలో బాపూఘాట్– ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ నదిలో బల్క్‌డ్రగ్, ఫార్మా వ్యర్థాలు అత్యధికంగా చేరుతున్నాయి. ప్రధానంగా కూకట్పల్లి నాలా నుంచి నిత్యం సుమారు 400 మిలియన్ లీటర్ల మేర హానికారక రసాయనాలు కలిసిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుండడంతో తరచూ ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జలమండలి వ్యర్థజలాల్లోని మురుగు,ప్లాస్టిక్ ఇతర ఘన వ్యర్థాలను పలు ఎస్టీపీల్లో తొలగిస్తోంది. కానీ రసాయనాలను తొలగించేందుకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసీ ప్రవాహ మార్గంలో నిర్మించాల్సి ఉంది. ఈటీపీల్లో శుద్ధి చేసిన తరవాతనే నాలా నీరు మూసీలోకి చేరే ఏర్పాట్లు చేస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మెట్రో రైళ్ల గమనానికి వినియోగిస్తున్న కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్‌కంట్రోల్ వ్యవస్థను మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో అధికారులు మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని స్పష్టంచేస్తున్నారు. చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు.. -
మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత
హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.