భాగ్యనగర మురికి నీటితో నిర్భాగ్యురాలైంది మూసీ, ప్రవాహం దెబ్బతిని పక్షవాత రోగయింది. అసలు మూసీ ఒకప్పటి ముచుకుంద కృష్ణా ఉపనది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ మహా నగరంలో దాదాపు 50 కి మీ ప్రవహిస్తూ వెళ్తుంది. సిటీ మురికి నీటికి తోడు పారిశ్రామిక వ్యర్థాలు కూడా కలిసి దీన్ని మురికి నదిగా మార్చాయి. లంగర్ హౌస్ బాపూ ఘాట్ నుండి నాగోల్ బ్రిడ్జ్ వరకు 14 కి.మీ వరకు గల మూసీని సుందరీకరణ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ‘ నందనవనం ’ సాధించింది శూన్యం. ‘మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ‘ ఉత్త హడావిడి మాత్రమేనని తేలిపోయింది. నేను అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు సాన్ అంటోనియా నగరంలోని ‘ రివర్ వాక్ ’ చూసినప్పుడు నా మనసులో మెదిలింది మూసీనే.
దేవతల్ని ఆదుకోడానికి హాలాహలం మింగిన శివుడిలా భాగ్యనగర కాలుష్యాన్నంతా భరిస్తున్నది మన మూసీ నదినే. సాన్ అంటోనియా అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటి. ఆస్టిన్ నుంచి కేవలం గంటన్నర డ్రైవ్‌లో ఇక్కడకు చేరుకోవచ్చు. దీని జనాభా రెండు మిలియన్ల ( 2011 ) పైనే, వీరిలో హిస్పానిక్స్ ఎక్కువ . ఇది పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, ఇందులో ముఖ్యమైనవి సీ వరల్డ్ , రివర్ వాక్లు. ఈ నగర డౌన్ టౌన్ నుండి మెలికలు తిరుగుతూ సాగే రివర్ వాక్ , దీనికి అటు ఇటు ఎన్నో సందర్శనీయ స్థలాలు, షాప్ లు, బోలెడన్ని రెస్టారెంట్లు ముఖ్యంగా మెక్సికన్ ఫుడ్ కు సంబంధించినవి. సాన్ అంటోనియా నది వరదల వల్ల 1921లో జరిగిన అపార జన, ఆస్తి నష్టాలను దృష్టిలో పెట్టుకొని వాటి నివారణకు గాను 1926 లో ఓల్మాస్ డ్యామ్, బైపాస్ చానల్లు నిర్మించారట.
1938లో ‘సాన్ అంటోనియా రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్’ ఏర్పాటు చేసి డౌన్ టౌన్ నుంచి దాదాపు 15 కి మీ వరకు నిర్మించిందే ఈ రివర్ వాక్. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్శించడంలో విజయవంతమైన ఈ రివర్ వాక్ ప్రభావంతో యూ ఎస్ లోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు రావడం విశేషం. సాన్ ఫెర్నాండో కాథడ్రిల్ చర్చి, మార్కెట్ స్ట్రీట్‌ను కలుపుతూ డౌన్‌టౌన్ ఏరియాకు దారి తీసే రోడ్లు రద్దీగా ఉంటాయి. సాన్ అంటోనియా రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన అనుభవం. నదికి ఇరువైపులా ఉండే ఫుట్‌పాత్‌పై సాయంకాలం నడవడం ఎప్పటికీ మరిచిపోలేం. ఓ పక్క నది, మరో పక్క ఫుడ్ సెంటర్లు, రెస్టరెంట్లు, మధ్య మధ్యన నదిలోంచి వెళ్లే బోట్లు... నాలుగు కిలోమీటర్ల దూరం ఎంతో బాగుంటుంది. ఇక రివర్‌వే పక్కన ఎన్నో అట్రాక్షన్లను ఏర్పాటు చేశారు.
229 మీటర్ల ఎత్తుతో కట్టిన టవర్ ఆఫ్ అమెరికాస్‌ను తప్పకు చూడాల్సిందే. లిఫ్ట్‌లో పైకి వెళ్లి చూస్తే.. ఇళ్లు, కార్లు అగ్గిపెట్టెల్లా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న మ్యూజియంలు, ఎనిమల్ థీమ్ హోటళ్లు, అద్భుతమైన హోటళ్లు టూరిస్టులకు మరింత మజా ఇస్తాయి. అలాగే వందల ఏళ్ల కింద కట్టిన ఇళ్లు, పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. యూరోపియన్లు రాకముందే శాన్ అంటోనియాలో లోకల్ అమెరికన్‌ల జన జీవనం సాగింది. దక్షిణాదిన ఉండే ఈ ప్రాంతం ఉత్తరాదితో ఎన్నో యుద్ధాలు చేసింది. గన్ కల్చర్ ఎక్కువ. కొన్నాళ్ల పాటు మెక్సికో పాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేందుకు 1836లో ఇక్కడ యుద్ధం జరిగింది.
ఇప్పటికీ ఇక్కడ మొత్తం మెక్సికన్ కల్చరే కనిపిస్తుంది. ఎక్కువ భాగం షాపులు, మాల్స్ కూడా మెక్సికన్లవే. ఈ నగరంలో ఓ పక్కన పురాతన భవనాలు, పాడుబడిన వారసత్వ సంపద కనిపిస్తుంది. అతి పెద్ద కౌబాయ్ బూట్లను ఓ రోడ్డు కూడలిలో పెట్టారు. వాటికి గిన్నీస్ బుక్‌లో చోటు దొరికింది. ది గేట్ వే ( 1962 ), క్లాక్ & డాగర్ ( 1984 ), సెలెనా ( 1997 ) వంటి హాలీవుడ్ మూవీస్ లకు కూడా ఎక్కడంతో సాన్ అంటోనియా రివర్ వాక్ కుమరింత ప్రచారం లభించింది. హైదరాబాద్ మూసీ కూడా సాన్ అంటోనియా, లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టుల స్థాయిలో అభివృద్ధి చెందితే మనం కూడా మూసీ లో బోటు షికార్లు చేయవచ్చు !
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment