దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు | South Korean President Yoon Suk Yeol declares emergency martial law | Sakshi
Sakshi News home page

సంచలన ప్రకటన చేసిన యూన్ సుక్ యోల్.. దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు

Published Tue, Dec 3 2024 7:58 PM | Last Updated on Tue, Dec 3 2024 8:19 PM

South Korean President Yoon Suk Yeol declares emergency martial law

సియోల్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. టీవీ చానెల్‌ ద్వారా ఈ ప్రకటన చేసిన యూన్‌.. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. ఆ దేశం కోసమే  పని చేస్తున్నాయవి.  గత కొంతకాలంగా పార్లమెంట్‌ను విపక్షాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తమ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం’’ అని యూన్‌ సుక్‌ యోల్‌ ప్రకటించారు.

అయితే యూన్‌ ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్‌ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించుకుంది. 

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత
సైనిక పాలన విధింపు ప్రకటనను వ్యతిరేకిస్తూ చట్ట సభ్యులు, భారీ ఎత్తున జనం పార్లమెంట్‌ వద్ద గుమిగూడారు. వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి.

2022లో పీపుల్‌ పవర్‌ పార్టీ తరఫున యూన్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాల వైఖరితో ఆయన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది కోసం బడ్జెట్‌ రూపకల్పన విషయంలో ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్‌ పార్టీని ఏకతాటిపైకి తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకోవైపు.. అధ్యక్షుడి భార్య, ఆయన పేషీలో ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణకు ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement