సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతోపాటు, అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ఉత్తరకొరియా పాలకుడు కిమ్ తరచూ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలపై దక్షిణ కొరియా దీటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగానికి ప్రయత్నిస్తే అందుకు తగురీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డేను పురస్కరించుకుని మంగళవారం సియోల్‌లో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి హ్యున్‌మూ–5 సహా అధునాతన 340 రకాల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది.
పరేడ్‌కు హాజరైన ప్రముఖులు, వేలాదిమంది జవాన్లను ఉద్దేశించి ఈ సందర్భంగా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మాట్లాడారు. ‘మాపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్రయత్నించిన పక్షంలో మా సైన్యం, ఊహించని రీతిలో దీటైన జవాబిస్తుంది. ఉత్తరకొరియా పాలకులకు అదే చివరి రోజవుతుంది. తమను కాపాడేది అణ్వాయుధాలేనన్న భ్రమలను ఉత్తరకొరియా పాలకులు వదిలేయాలి’అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
చదవండి: ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధం
బంకర్లను సైతం తుత్తునియలు చేసేలా..
హ్యున్‌మూ–5 క్షిపణి 8 టన్నుల భారీ సంప్రదాయ వార్‌హెడ్ కలిగి ఉంటుంది. భూమి లోపలి అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం తుత్తునియలు చేసే సత్తా దీని సొంతం. ఈ క్షిపణిని మొట్టమొదటిసారిగా దక్షిణ కొరియా ప్రదర్శించింది. పరేడ్ సమయంలో అమెరికా లాంగ్ రేంజ్ బి–1బీ బాంబర్‌తోపాటు దక్షిణకొరియా అత్యాధునిక ఫైటర్ జట్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. దక్షిణ కొరియా వద్ద అణ్వాయుధాలు లేవు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ కమాండ్’ సెంటర్‌ను కూడా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment