పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ | South Korean Olympian Gymnast Son Yeon Jae Embraces Gives BirthTo A Son | Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ

Published Tue, Feb 20 2024 3:53 PM | Last Updated on Tue, Feb 20 2024 5:20 PM

South Korean Olympian Gymnast Son Yeon Jae Embraces Gives BirthTo A Son - Sakshi

దక్షిణ కొరియా ఒలింపియన్ జిమ్నాస్ట్ సన్‌ యోన్ జే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ హాస్పిటల్ ప్రసూతి విభాగానికి  భారీ ఎత్తున (సుమారు 62 లక్షల రూపాయలు) విరాళాన్ని కూడా ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అభినందనలు వెల్లువెత్తాయి.

ప్రసూతి, గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని భావించానని, అందుకే ఈ విరాళమని సన్‌ యోన్ జే ప్రకటించింది.హై-రిస్క్ మెటర్నల్ అండ్ ఫీటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్‌మెంట్ సెంటర్ కోసం  ఈ విరాళాన్ని  ఉపయోగిస్తామని  ఆసుపత్రి  ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి  కాదు. గతంలో తమ పెళ్లి సందర్బంగా  37,400డాలర్లను  సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి విరాళంగా  అందించిన సంగతి తెలిసిందే. 

29 ఏళ్ల జిమ్నాస్ట్  ప్రీ-టీనేజ్‌లోనే బరిలోకి దిగి సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడలలో ఆల్ రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.  2010 ఆసియా గేమ్స్ ఆల్‌రౌండ్ కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడంతోపాటు, వరుసగా మూడుసార్లు ఆసియా గేమ్స్ ఆల్ రౌండర్ ట్రోఫీ దక్కించుకుంది.  అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్‌గా  నిలిచింది.

2022, ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది సన్‌ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement