gymnast
-
రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌కు దీపా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది."జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ నా కెరీర్‌కు విడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. జిమ్నాస్టిక్స్ నా జీవితంలో ఒక భాగం. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశాను. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు నా ఫ్లాట్ ఫుట్ కారణంగా జిమ్నాస్ట్ కాలేనని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు నా విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం నాకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్‌ను ప్రదర్శించడం నా కెరీర్లో మరపురాని క్షణాల్లో ఒకటి" అని తన రిటైర్మెంట్ నోట్లో దీపా పేర్కొంది. కాగా 2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించడంతో కర్మాకర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత ఆసియన్ గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా నిలిచింది. రియో ఒలిపింక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని ఆమె చేజార్చుకుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే పారిస్ ఒలిపింక్స్ ఆర్హత సాధించడంలో 31 ఏళ్ల దీపా విఫలమైంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ -
ఏరియల్ ఆర్ట్ : ఆకాశమే హద్దుకళ
అథ్లెటిసిజం కలగలసి వైమానిక విన్యాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చూడటానికి జిమ్నాస్ట్‌గా అనిపిస్తూనే ఆకాశంలో హరివిల్లులా మారే నృత్యప్రదర్శన ఓ అద్భుత ప్రకియగా అందరి మనసులను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డును గెలుచుకున్న తర్వాత, అదితి దేశ్‌పాండే ప్రజలకు వైమానిక విన్యాసాలలో శిక్షణ ఇస్తోంది. ముంబైలోని తన అకాడమీ ఫ్లై హై ఏరియల్ ఆర్ట్ గురించి దేశ్‌పాండే మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లినట్లుగానే, చాలామంది ఏరియల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని.. ఆఫీసులు, స్కూళ్ల టైమ్ తర్వాత శిక్షణ కోసం క్లాసులకు రావాలని కోరుకుంటున్నారని’ చెబుతోంది. శరీర బరువులో సమతుల్యతసిల్క్ ఫ్యాబ్రిక్, హూప్స్, తాళ్లు లేదా ట్రాపెజెస్ని ఉపయోగించి గాలిలో నృత్యం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్యాన్స్ సంగీతంతో సెట్ చేసి ఉంటుంది. ప్రదర్శనలు చేయడానికి వ్యక్తుల బలం, సౌలభ్యాన్ని మిళితం చేసి దృశ్యంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక సాధారణ వ్యక్తి ఈ విన్యాసాలను చాలావరకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయడానికి తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తాడు. వైమానిక స్కిల్స్ ప్రదర్శించే సమయంలో వెనుక కండరాలను ఉపయోగిస్తాడు. దీనికి శరీర బరువులో ఒక సమతుల్యతను తీసుకురావాల్సి ఉంటుంది’అని వివరిస్తుంది దేశ్‌పాండే ఎలా చేస్తారంటే...ఈ వైమానిక ప్రదర్శనలో డ్రాప్స్, రోజులు, స్పిన్‌లను అమలు చేయడానికి ముందు వ్యక్తులు తమను తాము ఫాబ్రిక్లో చుట్టుకుంటారు. ఏరియల్ రోప్ అనేది లైక్రాతో తయారు చేయబడిన వృత్తాకార ఉపకరణం. దీనిని కళాకారులు విన్యాసాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ట్రాపెజ్ అనేది తాళ్లు, తీగలతో చేసేది. ఇక్కడ ప్రదర్శనకారులు గాలిలో ఊగుతూ విన్యాసాలు చేస్తారు. స్ట్రాప్స్లో కళాకారులు సీలింగ్‌కు జోడించిన పట్టీలపై ప్రదర్శనలు చేస్తారు. అక్టోబర్‌లో ఢిల్లీలోని స్విస్ దగ్గర ప్రదర్శనస్విస్ కళాకారుడు జాసన్ బ్రూగర్, భారతీయ హులా హూప్ ప్రాక్టీషనర్ ఎష్నా కుట్టి అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయంలో రెండు దేశాలు 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. వైమానిక కళలకు ‘ఉన్నత స్థాయి సాంకేతికత అవసరం కాబట్టి ఇది కచ్చితంగా జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలతో పోల్చవచ్చు. కానీ కదలిక, సంగీతం, కోర్సు సాంకేతికత ద్వారా కళ సృష్టించడం‘ అని బ్రూగర్ చెప్పారు. ‘వేదికపై ఉన్నప్పుడు నా వ్యక్తిగత లక్ష్యం నా శరీరం ఏమి చేయగలదో చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం‘ అంటారు. వైమానిక కళ అందరికీ అందుబాటులో ఉందా?అహ్మదాబాద్‌లోని ఏరియల్ ఆర్ట్స్ ఇండియా అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ ట్రైనర్ అయిన జీల్ సోనీ– ‘మా దగ్గర 55 ఏళ్ల వ్యక్తి నుండి 12 ఏళ్ల అమ్మాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఏరియల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కొంచెం సాహసం చేయాలని చూస్తున్నందున జిమ్‌కి వెళ్లకుండా ఏరియల్ ఆర్ట్‌లను ఎంచుకుంటారు. పరికరాలు, మౌలిక సదు΄ాయాల విషయానికొస్తే క్రాష్ మ్యాట్లు, ప్రథమ చికిత్స, సేఫ్టీ గ్రిప్ ఎయిడ్ నుండి అన్నింటినీ అందిస్తాం’ అని చెబుతోంది.ఖర్చు ఎంతంటే..! సోని ఎనిమిది వైమానిక కళల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. ఒకటి నుండి నాలుగు స్థాయిలు వైమానిక కళలను పరిచయం చేస్తాయి. ఐదు నుండి ఎనిమిది ఋత్తిపరమైన స్థాయి లు. ప్రతి పరిచయ స్థాయి శిక్షణకు ఒకటిన్నర నెలలకు సుమారు రూ. 6,500, ప్రతి ఉన్నత స్థాయికి మూడు నెలలకు రూ. 13,500 ఖర్చు అవుతుంది. సృజనాత్మకత, శిక్షణ, కఠినమైన మనస్తత్వం కూడా ఈ కళకు చాలా ముఖ్యమైనవి. మంచి కోచ్‌తో పని చేస్తే సరైన శిక్షణ లభిస్తుంది. సర్కస్‌లు, డ్యాన్స్ షోలు లేదా థియేటర్లలో ప్రదర్శించే ఏరియల్ ఆర్టిస్టులకు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణేలోని స్టూడియోలు సెషన్ల సంఖ్య ఆధారంగా తరచుగా ప్యాకేజీలుగా ఉండే తరగతులను అందిస్తాయి. ప్లేస్, శిక్షణ రకం, కోచ్, కోర్సు వ్యవధి ఆధారంగా ట్రెయినింగ్ ఫీజు ఉంటుంది. -
ఒలింపిక్ స్వర్ణాల విజేతకు భారీ నజరానా
మనీలా: విశ్వక్రీడల పతకాలకు ఉన్న ప్రతిష్టకు ఇదొక మచ్చుతునక. ఫిలిప్పీన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ యులో పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ‘రిసార్ట్ హోమ్’ను బహుకరించాలని నిర్ణయించింది. సాధారణంగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, క్రీడా అవార్డులు, స్థానిక ప్రభుత్వాలైతే విలువైన ఇంటి స్థలాల్ని ఇవ్వడం పరిపాటి! కానీ ఫిలిప్పీన్స్ మాత్రం కార్లోస్‌కు అద్వితీయ కానుకను సిద్ధం చేస్తోంది. అంతేనా... తమ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికింది. పారిస్ నుంచి మంగళవారం స్వదేశం చేరుకున్న 24 ఏళ్ల చాంపియన్‌కు అసాధారణ ఏర్పాట్లతో వెల్కమ్ చెప్పిన ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ 10 లక్షల అమెరికా డాలర్లు (రూ. 8.39 కోట్లు) చెక్ ఇవ్వడంతోపాటు ఒక రిసార్ట్ హోమ్‌నే బహుమతి ఇస్తామని ఆ రిసార్టులో జీవితకాలం ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని ప్రకటించారు. కార్లోస్ రెండు స్వర్ణాలతో పారిస్ గేమ్స్ పతకాల పట్టికలో ఫిలిప్పీన్స్ 37వ స్థానంలో నిలిచింది. -
భళా బైల్స్...
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గలేకపోయిన అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ ‘పారిస్’లో మాత్రం పసిడి మెరుపులు మెరిపిస్తోంది. ఇప్పటి వరకు పోటీపడ్డ మూడు ఈవెంట్లలోనూ ఆమె స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 27 ఏళ్ల బైల్స్ మహిళల టీమ్ విభాగంలో, ఆల్ అరౌండ్ విభాగంలో పసిడి పతకాలు నెగ్గగా... తాజాగా శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్లోనూ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది మధ్య జరిగిన ఫైనల్లో బైల్స్ 15.300 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. రెబెకా అండ్రాడె (బ్రెజిల్; 14.966 పాయింట్లు) రజతం, జేడ్ కేరీ (అమెరికా; 14.466 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ క్రీడల్లో బైల్స్కిది పదో పతకంకాగా, ఇందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం నెగ్గింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బైల్స్‌కు ఒక రజతం, ఒక కాంస్యం దక్కింది.ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో మహిళల వాల్ట్ ఈవెంట్లో రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో జిమ్నాస్ట్‌గా బైల్స్ గుర్తింపు పొందింది. గతంలో వెరా కసాలావ్స్కా (చెకోస్లొవేకియా; 1964, 1968 ఒలింపిక్స్) రెండు సార్లు వాల్ట్ ఈవెంట్లో పసిడి పతకాలు గెలిచింది. ‘పారిస్’లో బైల్స్ ఖాతాలో నాలుగో స్వర్ణం కూడా చేరే అవకాశం ఉంది. నేడు జరిగే అన్ఈవెన్ బార్స్ ఫైనల్లో బైల్స్ పోటీపడనుంది. -
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్‌గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్‌కు సరికొత్త పాఠాలు నేర్పింది. 2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్‌రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్‌ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్‌లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్‌గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్‌లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. (చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!) -
పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ
దక్షిణ కొరియా ఒలింపియన్ జిమ్నాస్ట్ సన్ యోన్ జే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ హాస్పిటల్ ప్రసూతి విభాగానికి భారీ ఎత్తున (సుమారు 62 లక్షల రూపాయలు) విరాళాన్ని కూడా ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రసూతి, గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని భావించానని, అందుకే ఈ విరాళమని సన్ యోన్ జే ప్రకటించింది.హై-రిస్క్ మెటర్నల్ అండ్ ఫీటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్ కోసం ఈ విరాళాన్ని ఉపయోగిస్తామని ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమ పెళ్లి సందర్బంగా 37,400డాలర్లను సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రీ-టీనేజ్లోనే బరిలోకి దిగి సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడలలో ఆల్ రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2010 ఆసియా గేమ్స్ ఆల్‌రౌండ్ కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడంతోపాటు, వరుసగా మూడుసార్లు ఆసియా గేమ్స్ ఆల్ రౌండర్ ట్రోఫీ దక్కించుకుంది. అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్‌గా నిలిచింది. 2022, ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది సన్ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
జిమ్నాస్ట్ అరుణ ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణకు ఆదేశించింది. మార్చిలో జిమ్నాస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తుండగా... తన అనుమతి లేకుండా కోచ్ రోహిత్ జైస్వాల్ వీడియో తీయడంపై అరుణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ) సదరు కోచ్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. జీఎఫ్ఐ తేలిగ్గా తీసుకోవడంపై నిరాశ చెందిన అరుణ చట్టపరమైన చర్య లకు ఉపక్రమించడంతో ‘సాయ్’ రంగంలోకి దిగింది. ‘సాయ్’లోని టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. -
జిమ్నాస్ట్ అరుణా రెడ్డికి 5 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ఈజిప్ట్‌లో జరిగిన ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. -
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ మహిళకు రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెరిసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఈ టోర్నీలో 25 ఏళ్ల అరుణా రెడ్డి టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో అరుణ 13.800 స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో అరుణ 13.487 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈజిప్ట్, పోలాండ్ జిమ్నాస్ట్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫయింగ్‌లో అరుణ 11.35 పాయింట్లు స్కోరు చేయగా... ఫైనల్లో 12.37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో అరుణా రెడ్డి కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. చదవండి: ‘బీడబ్ల్యూఎఫ్’ అథ్లెటిక్స్ కమిషన్‌లో సింధు -
జిమ్నాస్టిక్ చేయాలంటే కాళ్లు అవసరం లేదు!
న్యూఢిల్లీ: అన్ని సక్రమంగా ఉన్న ఏదో ఒక కారణాలతో ఏమి చేయకుండా కూర్చొండిపోతారు. పైగా అన్ని అవయవాలు బాగా ఉన్నా ఏవో చిన్న చిన్న సాకులతో కష్టపడటానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఒక పదేళ్ల బాలికకు కాళ్లు లేకపోయిన జిమ్నాస్టిక్ నైపుణ్యంతో అందరీ మనసులను గెలుచుకుంది. (చదవండి: అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!) వివరాల్లోకెళ్లితే...ఒహియోకు చెందిన పైజ్ క్యాలెండైన్కు కాళ్లు లేవు. అయినా తన జిమ్నాస్టిక్ నైపుణ్యాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శిసిస్తోంది. ఈ మేరకు ఆమె తన జిమ్నాస్టిక్ సాధనలో భాగంగా తాను చేసే రోజువారి ప్రాక్టీస్‌లకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు ఆమె నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఆమె పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) 10-year-old Paige Calendine of Ohio is a force!🌟🏅🏆. (🎥:heidi.calendine)💪😃💪 pic.twitter.com/DI23hHRO4r — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 25, 2021 -
వరుసగా 8 ఒలింపిక్స్‌లు; అందుకే ఘనమైన వీడ్కోలు
టోక్యో: ప్రపంచంలోని ప్రతి అథ్లెట్ కనీసం ఒక్క ఒలింపిక్స్ అయినా ఆడాలని కలగనడం సహజం. ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇలా వేటిలో పతకాలు సాధించినా.. ఒలింపిక్స్‌లో సాధించే పతకానికి క్రేజ్ వేరే ఉంటుంది. పతకం గెలిచినా గెలవకపోయినా.. తాము ఆడుతున్న దేశం తరపున కనీసం ఒక్క ఒలింపిక్స్‌లో అయినా పాల్గొనాలని అనుకుంటారు. అయితే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా వరుసగా 8 ఒలింపిక్స్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా పాల్గొనడం విశేషం. అంతేగాక మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌లో ఆడిన రెండో జిమ్నాస్ట్ మహిళగా చుసోవిటినా రికార్డు సాధించింది. 8 ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. తాజాగా అత్యధిక ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒక్సానాకు స్టాండింగ్ ఒవేషన్(ఘనమైన వీడ్కోలు) లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తనకు ఇవే చివరి ఒలింపిక్స్ అని ఒక్సానా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే చెప్పింది. ఈసారి ఒలింపిక్స్‌లో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో రెండు వాల్ట్స్ పూర్తి చేసి 14.166 స్కోరు నమోదు చేశాడు. అయితే ఆమె చేసిన స్కోరు సరిపోకపోవడంతో క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే వెనుదిరిగింది. -
మరో రెండు ఈవెంట్స్ నుంచి వైదొలిగిన సిమోన్ బైల్స్
మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ టోక్యో ఒలింపిక్స్‌లో తన మెరుపు విన్యాసాన్ని పరిమిత ఈవెంట్లలోనే ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. వాల్ట్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె... ఆ ఈవెంట్‌తో పాటు అన్ఈవెన్ బార్స్ నుంచి కూడా తప్పుకుంది. ఆదివారం ఈ రెండు ఈవెంట్లకు సంబంధించిన ఫైనల్ పోటీలు జరుగుతాయి. అయితే బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశముంది. ఈ రెండు ఈవెంట్లకు మరింత సమయం ఉండటంతో ఆలోపు మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆమె భావిస్తోంది. మంగళవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్స్ నుంచి ఈ 24 ఏళ్ల ఒలింపిక్ చాంపియన్ బైల్స్ అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే! -
టీవీలో అథ్లెటిక్స్ను చూసి రంగంలోకి దిగిన పిల్లి, ఫన్నీ వీడియో
ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ జాతర కొనసాగుతోంది. ఎవరు నెగ్గుతున్నారు, ఏ దేశానికి పతకాలు ఎక్కువస్తున్నాయనేదే హాట్ టాపిక్‌గా మారింది. క్రీడలు మహారంజుగానే సాగుతున్నా.. స్టేడియాల్లో ప్రేక్షకులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ టీవీల ముందుకు చేరి తమకు నచ్చిన ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు. అయితే ఈ ఒలింపిక్స్ ఆటలు జనాలతో పాటు జంతువులను కూడా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో టీవీ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తోంది. టీవీలోని జిమాస్ట్ కదలికలకు అనుగుణంగా పిల్లి తన తలను కూడా మార్చుతుంది. అంతేగాక పిల్లి తన చేతులతో జిమ్నాస్ట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. రెండు చేతులను టీవీ మీదకు పెట్టి జిమ్నాస్ట్‌తోపాటు అటు ఇటు తిరుగుతుంది. 54 సెకన్ల నిడివిగల ఈ వీడియోను హ్యూమర్ అండ్ ఎనిమల్స్ అనే ట్విటర్ పేజ్ బుధవారం షేర్ చేసింది. ‘జిమ్నాస్టిక్‌ను చూస్తున్న పిల్లి. ఇప్పుడు ఇదే నా ఫేవరెట్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూవ్స్‌ను సంపాదించింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘పిల్లి జిమ్నాస్ట్ తన బ్యాలెన్స్ కోల్పోకుండా తనకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది.’ అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. cats watching gymnastics is my new favorite (teenybellinitheprettypittie IG) pic.twitter.com/aZjQBoqJBB — Humor And Animals (@humorandanimals) July 28, 2021 -
దీపా కర్మాకర్‌కు గాయం
బాకు (అజర్బైజాన్ ): వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అర్హత పొందే అవకాశాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లలో భాగమైన ప్రపంచకప్‌లో దీపా వాల్ట్ విభాగం ఫైనల్లో విఫలమైంది. మోకాలి గాయం తిరగబెట్టడంతో ఆమె ఫైనల్లో నిర్ణీత రెండు అవకాశాలను పూర్తి చేయలేకపోయింది. తొలి అవకాశంలో దీపా 13.133 పాయింట్లు స్కోరు చేసింది. అదే సమయంలో ఆమెకు గాయం కావడంతో రెండో రొటేషన్‌ను ప్రయత్నించలేదు. ఫలితంగా ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గాయం తీవ్రత దృష్ట్యా వచ్చే వారం దోహాలో జరిగే ప్రపంచకప్ టోర్నీ నుంచి దీపా వైదొలిగింది. ‘ఫైనల్‌కు ముందే దీపా మోకాలి నొప్పితో బాధపడింది. ఫిజియో సాయంతో ఆమె ఫైనల్లో పాల్గొన్నా తొలి ప్రయత్నంలో ఆమె మ్యాట్‌పై సరిగ్గా ల్యాండ్ కాలేదు. దాంతో గాయం తిరగబెట్టింది. గాయం నుంచి కోలుకున్నాక దీపా జూన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో, అక్టోబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది’ అని భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు రియాజ్ భాటి తెలిపారు. -
దీపా కర్మాకర్ ఐదుతో సరి...
జిమ్నాస్టిక్స్‌లో భారత కథ ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా 12.500 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె 12.750 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. చెన్ యైల్ (చైనా, 14.600 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమ్ జాంగ్ (ఉత్తర కొరియా, 13.400), జాంగ్ జిన్ (చైనా, 13.325) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకోగా... పురుషుల జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
► జిమ్నాస్టిక్స్: దీపా కర్మాకర్, ప్రణతి దాస్, అరుణా రెడ్డి, మందిర, ప్రణతి నాయక్ (క్వాలిఫయింగ్; మ.గం. 2.30 నుంచి). ►కబడ్డీ (మహిళల విభాగం): భారత్(vs) శ్రీలంక, (ఉ.గం. 8 నుంచి); భారత్(vs)ఇండోనేసియా, (ఉ.గం. 11.20 నుంచి); పురుషుల విభాగం: భారత్(vs)థాయ్‌లాండ్ (సా.గం. 4 నుంచి). ►షూటింగ్: అభిషేక్ శర్మ, సౌరభ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి; ఫైనల్స్ 9.45 నుంచి). లక్షయ్, శ్రేయసి సింగ్ (ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8.30 నుంచి; ఫైనల్స్ మ.గం. 3 నుంచి). ► రెజ్లింగ్: పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ (జ్ఞానేందర్–60 కేజీలు; మనీశ్–67 కేజీలు); మహిళల ఫ్రీస్టయిల్ (దివ్య కక్రాన్–68 కేజీలు; కిరణ్–72 కేజీలు; మ.గం. 12 నుంచి రాత్రి 7 వరకు). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
భారత జిమ్నాస్టిక్స్ జట్టులో అరుణా రెడ్డి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే జిమ్నాస్టిక్ బృందంలో తెలుగు తేజం బుద్దా అరుణా రెడ్డికి చోటు దక్కింది. ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం 10 మందితో కూడిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ పురుషుల, మహిళల జట్లను బుధవారం ప్రకటించారు. మహిళల బృందంలో తెలంగాణ జిమ్నాస్ట్ అరుణారెడ్డితో పాటు రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్, ప్రణతి దాస్, మందిరా చౌదరి, ప్రణతి నాయక్‌లు ఉన్నారు. పురుషుల జట్టులో రాకేశ్ పాత్రా, యోగేశ్వర్ సింగ్, గౌరవ్ కుమార్, ఆశిష్ కుమార్, సిద్ధార్థ్ వర్మలకు చోటు దక్కింది. ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన రెండు రోజుల ట్రయల్స్ అనంతరం జట్లను ఎంపిక చేశారు. -
ఒక్క పతకం మార్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ ఇది బాగా పాపులర్ అయిన టెలికామ్ యాడ్. ఇప్పుడు ఈ యాడ్‌కు సరిగ్గా సరిపోయేలా... ఒక్క పతకం ఓ జిమ్నాస్ట్‌ను ఆకాశానికి ఎత్తేసింది. కోటీశ్వరురాలిని చేసేసింది. ఆ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి కాగా... ఆ పతకం మెల్బోర్న్లో నెగ్గిన కాంస్యం. ఆమె సాధించిన కాంస్యంతో కాసులు... రాశులు కురుస్తున్నాయి. 14 ఏళ్లుగా ఆమె పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలాలు లభిస్తున్నాయి. తెలంగాణకు చెందిన యువ జిమ్నాస్ట్ అరుణ రెడ్డి ఇటీవలే ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో కాంస్య పతకం గెలిచింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఆమె గుర్తింపు పొందింది. కాంస్యంతో కొత్త చరిత్ర సృష్టించిన ఆమెను శనివారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) లాల్‌బహదూర్ స్టేడియంలో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ‘శాట్స్’ తరఫున ప్రోత్సాహకంగా అరుణకు రూ. 20 లక్షల చెక్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైదరాబాద్ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, సువర్ణ అవనిస్ కంపెనీ యజమాని సురేందర్ ఆమెకు రూ. 50 లక్షల విలువైన విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. శనివారం జరిగిన మరో కార్యక్రమంలో కొన్నాళ్లుగా అరుణకు చేయూతనిస్తోన్న ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తమ వంతుగా రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని అందజేసింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఊహించనిరీతిలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆదివారం ఆమె తన తల్లి సుభద్ర, సోదరి పావని రెడ్డిలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ ఘనతను కొనియాడిన ఆయన రూ. 2 కోట్ల నజరానా ప్రకటించారు. ఆమె కోచ్ బ్రిజ్ కిశోర్‌కు కూడా ఆర్థిక సాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి పద్మారావు, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైల్స్ పై గెలవడమే లక్ష్యంగా..
కోల్‌కతా: రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తదుపరి లక్ష్యం వరల్డ్ నంబర్‌వన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఓడించడమేనట. అమెరికాకు చెందిన బైల్స్‌పై గెలవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు దీపా తాజాగా పేర్కొంది. రియోలో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో పసిడి సాధించిన బైల్సే తాను చూసిన మహిళా జిమ్నాస్ట్ల్లో అత్యుత్తమం అంటూ దీపా కితాబిచ్చింది. 'ఆమె కంటే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కాకపోతే బైల్స్‌ను ఓడించడానికి ఇప్పట్నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఆమెను ఓడించడమే నా తదుపరి లక్ష్యం' అని దీపా పేర్కొంది. నగరంలో స్థానికంగా జరిగిన దుర్గా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దీప.. తన రియో ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రియోలో పతకం సాధించకపోవడంతో యావత్ భారతావనిని నిరాశకు లోనైన విషయం తనకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తాను పతకం గెలిచి ఉంటే దాన్ని దేశానికి అంకింత ఇచ్చేదానని దీప పేర్కొంది. -
పరీక్షలు రాస్తోంది
అగర్తలా: ఆట, చదువు రెండూ ఒకే చోట పొసగవని చాలామందిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఇది తప్పని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నిరూపిస్తోంది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన రెండో రోజే ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ పరీక్ష రాసేసింది. త్రిపుర యూనివ ర్శిటీలో దీప పీజీ చదువుతోంది. చాలా సన్మాన కార్యక్రమాలు ఉన్నా వాటిని వదిలేసి పరీక్షలకు చదువుకోవడం గొప్ప విషయమని త్రిపుర యూనివర్శిటీ అధికారులు ఆమెను ప్రశంసించారు. తోటి విద్యార్థినిలు కూడా ఆమె అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!
ఒలింపిక్స్‌లో అసమాన పోరాటపటిమను చాటిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఘనస్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి స్థానిక మైదానం వరకు వేలమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కోచ్ బిశ్వేష్వర్ నందితో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఆమె స్వాగతోత్సవం దాదాపు 12 కిలోమీటర్లు సాగింది. దాదాపు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆమెకు జయజయధ్వానాలు చేశారు. మైదానంలో ఆమెకు త్రిపుర ప్రభుత్వం ఘనసత్కారం నిర్వహించింది. ఆమె విజయోత్సవ ర్యాలీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో కలిసి తనకు స్వాగతం పలుకుతున్న అక్కను చూడగానే దీప హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే ఓపెన్ జీపులో నుంచి అమాంతం కిందకు దూకేసింది. ఎంతైనా టాప్ క్లాస్ జిమ్నాస్ట్ కదా! ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోకగా జీపులోంచి దిగి.. పరిగెత్తుకెళ్లి తన సోదరిని ఆమె హత్తుకుంది. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ ఘటన చాటింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా విభాగంలో అద్భుత ప్రతిభాపాటవాలు చాటి ఆమె ఫైనల్‌కు వెళ్లింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో పతకం కోల్పోయిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో దీప పతకం గెలువకపోయినా.. తన పోరాటస్ఫూర్తితో 120 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. -
దీప అదృష్టం అక్కడే తారుమారు..
రియో డీ జనీరో: దీపా కర్మాకర్.. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్. అంతేకాకుండా రియోలో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో తుది పోరుకు అర్హత సాధించి సరికొత్త చరిత్రను కూడా లిఖించింది. అయితే భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో దీపా నాల్గో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. కాగా, దీపను పాయింట్ల పరంగా వెనుక్క నెట్టింది మాత్రం సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు), మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు)లు మాత్రమే. ఫైనల్ పోరులో భాగంగా వరల్డ్ టాప్ జిమ్నాస్ట్లైన బైల్స్, పాసెకాలు చివర్లో బరిలోకి దిగి దీప ఆశలను నీరుగార్చారు. క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్-8కు అర్హత సాధించిన వారు ఫైనల్ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో దీపా ఆరో స్థానంలో బరిలోకి దిగింది. తొలి ప్రయత్నంలో14.866 పాయింట్లుసాధించిన దీప... రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సంపాదించింది. దీంతో ఓవరాల్ సగటు 15.066 పాయింట్లగా నమోదైంది. దీంతో దీప తన రౌండ్ ను ముగించిన తరువాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. కాగా, చివర్లో పాసికా, బైల్స్‌లు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో దీపా అనూహ్యంగా వెనక్కిపడిపోయింది. అయినప్పటికీ యావత్ భారతావని మనసును మాత్రం గెలుచుకుంది. కష్టసాధ్యమైన ప్రొడునోవాలో ముందుకు వెళ్లడమే తలకు మించిన భారం. మరి అటువంటింది 'టాప్' జిమ్నాస్ట్‌ల చేతిలో ఓడిపోయిన దీపది కచ్చితంగా అత్యుత్తమ ప్రదర్శనే కదా.ప్రస్తుతం భారత్ లో దీప ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురవడమే ఆమె పోరాట స్ఫూర్తికి నిదర్శనం. -
గుండె గుబైల్స్
అమెరికా అమ్మాయి వీర విన్యాసాలు రికార్డులు కొల్లగొడుతున్న 19 ఏళ్ల జిమ్నాస్ట్ తల్లిదండ్రుల ఆలనాపాలనా సరిగా లేక తాతయ్య వద్ద పెరిగిన ఆ అమ్మాయి జీవితంలో చేసిన ‘జంప్’ చాలా పెద్దది. టీనేజ్ దాటక ముందే ఆమె వరల్డ్ ‘ఫ్లోర్’పై తన విన్యాసాలతో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతోంది. ఘనత వహించిన జిమ్నాస్ట్‌లు కూడా ఒక్క ఈవెంట్లోనే తమ శక్తియుక్తులతో రికార్డులు సృష్టిస్తే... అదీ, ఇదీ అని తేడా లేకుండా ఆల్‌రౌండర్‌గా జిమ్నాస్టిక్స్‌లో అగ్రస్థానం సాధిస్తున్న ఘనత ఒక్క సిమోన్ బైల్స్దే. నల్లజాతి అమెరికన్లంతా బైల్స్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని స్వయంగా అధ్యక్షుడు ఒబామా ఒక వైపు ప్రశంసలు కురిపిస్తుంటే... ప్రపంచం యావత్తూ ఆమె వైపే చూస్తోంది. ఒలింపిక్స్‌లో ఆమె ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ఇంటర్నెట్లో కొద్ది రోజుల్లోనే కోటికి పైగా మంది వీక్షిస్తే... గూగుల్‌లో సెర్చ్, ఆమె గురించి వస్తున్న ట్వీట్ల సంఖ్యకు లెక్కే లేదు. మరి బైల్స్ ఇంతగా ఏం ఘనత సాధించింది. ఒక్క సారిగా ఆమె పాపులర్ జాబితాలో ఎందుకు చేరిపోయింది? ఒలింపిక్స్‌లో బరిలోకి దిగక ముందే బైల్స్ సూపర్ స్టార్. వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో గత మూడేళ్ల కాలంలో ఆమె ఏకంగా పది స్వర్ణాలు కొల్లగొట్టింది. మరో 2 రజతాలు, 2 కాంస్యాలు చేరిస్తే మొత్తం పతకాలు 14. ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లలో చెలరేగిపోతున్న ఆమె, ఆల్‌రౌండర్‌గా కూడా ప్రతీ సారి మరో స్వర్ణంపై గురి పెట్టడం అలవాటుగా మార్చుకుంది. ఆరేళ్ల క్రితం 13 సంవత్సరాల వయసులో తొలి సారి జూనియర్ స్థాయిలో బరిలోకి దిగిన బైల్స్, ఆరేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడం విశేషం. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న బైల్స్, శరీరాన్ని విల్లులా వంచే తన ‘ట్విస్టింగ్’తో క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఒకే సమయంలో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఆల్‌రౌండ్ స్వర్ణాలు కలిగి ఉన్న రెండో అథ్లెట్‌గా బైల్స్ గుర్తింపు సాధించింది. అలా అలవోకగా... గురువారం జరిగిన ఆల్‌రౌండర్ పోటీల్లో ఆమె ఒక దశలో రష్యా జిమ్నాస్ట్ ఆలియాకంటే 0.034 పాయింట్లు వెనుకబడింది. గత మూడేళ్లలో ఆమె ఏ ఈవెంట్లోనైనా వెనుకబడటం కూడా ఇదే తొలిసారి! బైల్స్ ప్రత్యర్థులంతా కొద్ది క్షణాల పాటు ఆశతో చూసిన క్షణమది. కానీ ఆమె వారికి మరింత అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఇలా జరగదు అన్నట్లుగా తన అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగిపోయింది. ఆమె దృష్టిలో నాలుగు అంగుళాల బీమ్ అతి పెద్ద వేదికగా మారిపోయింది. ఏరియల్ సోమర్సాల్ట్తో మొదలు పెట్టి ఆత్మవిశ్వాసంతో ఒక్కో ఈవెంట్లో గాల్లో ఎగురుతుంటే చూసేవాళ్లు కన్నార్పలేక పోయారు. శరీరాన్ని ఇన్ని రకాలుగా వంచడం ఇంత సులువా అనిపించేంతగా బైల్స్ విన్యాసాలు ప్రదర్శించింది. చివరకు ఆలియా స్కోరు (13.866)తో పోలిస్తే ఎంతో మెరుగ్గా (15.433) స్వర్ణం ఈ అమెరికా చిన్నారి చెంతకు చేరింది. ఆల్‌టైమ్ గ్రేట్ చంద్రునిపై మొదట కాలు మోపిన ఇద్దరిలో ఒకరైన ఎడ్విన్ ఆల్డ్రిన్... రియోలో ప్రత్యక్షంగా బైల్స్ పోటీలను తిలకించారు. తాను కూడా ఆమె గురుత్వాకర్షణ శక్తికి ఆశ్చర్యపోయినట్లు చెప్పడం ఈ యువ జిమ్నాస్ట్‌కు లభించిన ప్రశంసల్లో ప్రత్యేకమైంది. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ మహిళలు ఉన్నారు. మరి బైల్స్ స్థానం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. అమెరికన్లు మాత్రం ఆమె ఎప్పుడో ‘ది బెస్ట్’ అని చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు ఒలింపిక్ పతకం గెలిస్తే తప్ప గ్రేట్ కాదు... అంటూ వినిపించిన వ్యాఖ్యలకు కూడా ఇప్పుడు బ్రేక్ పడిపోయినట్లే. వాల్ట్‌లో ‘అమనార్’ను అంత కచ్చితత్వంతో చేయడం ఆమెకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. ఇక ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఆమె పేరుతోనే ‘ది బైల్స్’ అనే సిగ్నేచర్ స్టైల్ విన్యాసం నిజంగా అద్భుతం అనిపిస్తుంది. కష్టాల నుంచి కోలుకొని కెరీర్ ఆరంభంలో ఆమె రనప్ మగాడిలా ఉంటుందన్నారు. వాల్ట్ ఈవెంట్లో ఒక సారి రెండు సార్లు సున్నా స్కోరు చేసింది. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె ఒక దశలో ఇంటినుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే తనను దత్తత తీసుకున్న తాతయ్య, అమ్మమ్మల వల్లే ఈ స్థాయికి వచ్చానని బైల్స్ చెబుతుంది. అందుకే అమ్మమ్మను కూడా బైల్స్ అమ్మా అనే పిలుస్తుంది. నైకీ, అమెరికన్ ఎయిర్‌లైన్స్ తదితర సంస్థలు ఈ నల్లజాతి వజ్రంతో ఒప్పందాలకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఆమె ఏడాది ఆదాయం కనీసం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. 2013లో ప్రతీ ఈవెంట్లో వరుసగా ఓడిపోతున్నప్పుడు కోచ్ ఐమీ బూర్మన్ ఆమెకు కొత్త దిశను చూపించాడు. అప్పటినుంచి ఆమెకు పరాజయం అనేదే లేదు. టీనేజ్ వయసులోనే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన బైల్స్ జీవితం అందరికీ స్ఫూర్తినిస్తోంది. -
దీపా కర్మాకర్ కొత్త చరిత్ర
రియో డీ జనీరో: భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ప్రొడునోవా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్‌లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించడమే కాకుండా, ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్ అంచనాలను అందుకోవడం పతకంపై ఆశలను పెంచుతుంది. -
చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్
న్యూఢిల్లీ: భారత జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించింది.