అరుణకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్. చిత్రంలో క్రీడల మంత్రి పద్మారావు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ ఇది బాగా పాపులర్ అయిన టెలికామ్ యాడ్. ఇప్పుడు ఈ యాడ్‌కు సరిగ్గా సరిపోయేలా... ఒక్క పతకం ఓ జిమ్నాస్ట్‌ను ఆకాశానికి ఎత్తేసింది. కోటీశ్వరురాలిని చేసేసింది. ఆ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి కాగా... ఆ పతకం మెల్‌బోర్న్‌లో నెగ్గిన కాంస్యం. ఆమె సాధించిన కాంస్యంతో కాసులు... రాశులు కురుస్తున్నాయి. 14 ఏళ్లుగా ఆమె పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలాలు లభిస్తున్నాయి. తెలంగాణకు చెందిన యువ జిమ్నాస్ట్ అరుణ రెడ్డి ఇటీవలే ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం గెలిచింది.
ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఆమె గుర్తింపు పొందింది. కాంస్యంతో కొత్త చరిత్ర సృష్టించిన ఆమెను శనివారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) లాల్‌బహదూర్ స్టేడియంలో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ‘శాట్స్’ తరఫున ప్రోత్సాహకంగా అరుణకు రూ. 20 లక్షల చెక్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైదరాబాద్ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, సువర్ణ అవనిస్ కంపెనీ యజమాని సురేందర్ ఆమెకు రూ. 50 లక్షల విలువైన విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారు.
తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. శనివారం జరిగిన మరో కార్యక్రమంలో కొన్నాళ్లుగా అరుణకు చేయూతనిస్తోన్న ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తమ వంతుగా రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని అందజేసింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఊహించనిరీతిలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆదివారం ఆమె తన తల్లి సుభద్ర, సోదరి పావని రెడ్డిలతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ ఘనతను కొనియాడిన ఆయన రూ. 2 కోట్ల నజరానా ప్రకటించారు. ఆమె కోచ్ బ్రిజ్ కిశోర్‌కు కూడా ఆర్థిక సాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి పద్మారావు, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment