దీపా కర్మాకర్ కొత్త చరిత్ర
రియో డీ జనీరో: భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ప్రొడునోవా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించడమే కాకుండా, ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్ అంచనాలను అందుకోవడం పతకంపై ఆశలను పెంచుతుంది.