భళా బైల్స్‌... | American star gymnast who won seventh gold in Olympics | Sakshi
Sakshi News home page

భళా బైల్స్‌...

Published Sun, Aug 4 2024 4:28 AM | Last Updated on Sun, Aug 4 2024 4:28 AM

American star gymnast who won seventh gold in Olympics

ఒలింపిక్స్‌లో ఏడో స్వర్ణం గెలిచిన అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌  

పారిస్‌: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గలేకపోయిన అమెరికా మహిళా స్టార్‌ జిమ్నాస్ట్‌ ‘పారిస్‌’లో మాత్రం పసిడి మెరుపులు మెరిపిస్తోంది. ఇప్పటి వరకు పోటీపడ్డ మూడు ఈవెంట్లలోనూ ఆమె స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 27 ఏళ్ల బైల్స్‌ మహిళల టీమ్‌ విభాగంలో, ఆల్‌ అరౌండ్‌ విభాగంలో పసిడి పతకాలు నెగ్గగా... తాజాగా శనివారం జరిగిన వాల్ట్‌ ఈవెంట్‌లోనూ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది మధ్య జరిగిన ఫైనల్లో బైల్స్‌ 15.300 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. 

రెబెకా అండ్రాడె (బ్రెజిల్‌; 14.966 పాయింట్లు) రజతం, జేడ్‌ కేరీ (అమెరికా; 14.466 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్‌ క్రీడల్లో బైల్స్‌కిది పదో పతకంకాగా, ఇందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం నెగ్గింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బైల్స్‌కు ఒక రజతం, ఒక కాంస్యం దక్కింది.

ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌లో మహిళల వాల్ట్‌ ఈవెంట్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో జిమ్నాస్ట్‌గా బైల్స్‌ గుర్తింపు పొందింది. గతంలో వెరా కసాలావ్‌స్కా (చెకోస్లొవేకియా; 1964, 1968 ఒలింపిక్స్‌) రెండు సార్లు వాల్ట్‌ ఈవెంట్‌లో పసిడి పతకాలు గెలిచింది. ‘పారిస్‌’లో బైల్స్‌ ఖాతాలో నాలుగో స్వర్ణం కూడా చేరే అవకాశం ఉంది. నేడు జరిగే అన్‌ఈవెన్‌ బార్స్‌ ఫైనల్లో బైల్స్‌ పోటీపడనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement