బైల్స్ పై గెలవడమే లక్ష్యంగా..
కోల్కతా: రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తదుపరి లక్ష్యం వరల్డ్ నంబర్వన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ను ఓడించడమేనట. అమెరికాకు చెందిన బైల్స్పై గెలవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు దీపా తాజాగా పేర్కొంది. రియోలో వాల్ట్ జిమ్నాస్టిక్స్లో పసిడి సాధించిన బైల్సే తాను చూసిన మహిళా జిమ్నాస్ట్ల్లో అత్యుత్తమం అంటూ దీపా కితాబిచ్చింది.
'ఆమె కంటే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కాకపోతే బైల్స్ను ఓడించడానికి ఇప్పట్నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఆమెను ఓడించడమే నా తదుపరి లక్ష్యం' అని దీపా పేర్కొంది. నగరంలో స్థానికంగా జరిగిన దుర్గా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దీప.. తన రియో ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రియోలో పతకం సాధించకపోవడంతో యావత్ భారతావనిని నిరాశకు లోనైన విషయం తనకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తాను పతకం గెలిచి ఉంటే దాన్ని దేశానికి అంకింత ఇచ్చేదానని దీప పేర్కొంది.