గుండె గుబైల్స్ | Rio Olympics 2016: Why Simone Biles is the best at the Games | Sakshi
Sakshi News home page

గుండె గుబైల్స్

Published Sat, Aug 13 2016 2:51 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

గుండె గుబైల్స్

గుండె గుబైల్స్

అమెరికా అమ్మాయి వీర విన్యాసాలు
రికార్డులు కొల్లగొడుతున్న 19 ఏళ్ల జిమ్నాస్ట్

 

తల్లిదండ్రుల ఆలనాపాలనా సరిగా లేక తాతయ్య వద్ద పెరిగిన ఆ అమ్మాయి జీవితంలో చేసిన ‘జంప్’ చాలా పెద్దది. టీనేజ్ దాటక ముందే ఆమె వరల్డ్ ‘ఫ్లోర్’పై తన విన్యాసాలతో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతోంది. ఘనత వహించిన జిమ్నాస్ట్‌లు కూడా ఒక్క ఈవెంట్‌లోనే తమ శక్తియుక్తులతో రికార్డులు సృష్టిస్తే... అదీ, ఇదీ అని తేడా లేకుండా ఆల్‌రౌండర్‌గా జిమ్నాస్టిక్స్‌లో అగ్రస్థానం సాధిస్తున్న ఘనత ఒక్క సిమోన్ బైల్స్‌దే.


నల్లజాతి అమెరికన్లంతా బైల్స్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని స్వయంగా అధ్యక్షుడు ఒబామా ఒక వైపు ప్రశంసలు కురిపిస్తుంటే... ప్రపంచం యావత్తూ ఆమె వైపే చూస్తోంది. ఒలింపిక్స్‌లో ఆమె ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ఇంటర్‌నెట్‌లో కొద్ది రోజుల్లోనే కోటికి పైగా మంది వీక్షిస్తే... గూగుల్‌లో సెర్చ్, ఆమె గురించి వస్తున్న ట్వీట్ల సంఖ్యకు లెక్కే లేదు. మరి బైల్స్ ఇంతగా ఏం ఘనత సాధించింది. ఒక్క సారిగా ఆమె పాపులర్ జాబితాలో ఎందుకు చేరిపోయింది?


ఒలింపిక్స్‌లో బరిలోకి దిగక ముందే బైల్స్ సూపర్ స్టార్. వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో గత మూడేళ్ల కాలంలో ఆమె ఏకంగా పది స్వర్ణాలు కొల్లగొట్టింది. మరో 2 రజతాలు, 2 కాంస్యాలు చేరిస్తే మొత్తం పతకాలు 14. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లలో చెలరేగిపోతున్న ఆమె, ఆల్‌రౌండర్‌గా కూడా ప్రతీ సారి మరో స్వర్ణంపై గురి పెట్టడం అలవాటుగా మార్చుకుంది. ఆరేళ్ల క్రితం 13 సంవత్సరాల వయసులో తొలి సారి జూనియర్ స్థాయిలో బరిలోకి దిగిన బైల్స్, ఆరేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడం విశేషం. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న బైల్స్, శరీరాన్ని విల్లులా వంచే తన ‘ట్విస్టింగ్’తో క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఒకే సమయంలో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఆల్‌రౌండ్ స్వర్ణాలు కలిగి ఉన్న రెండో అథ్లెట్‌గా బైల్స్ గుర్తింపు సాధించింది.

 
అలా అలవోకగా..
.
గురువారం జరిగిన ఆల్‌రౌండర్ పోటీల్లో ఆమె ఒక దశలో రష్యా జిమ్నాస్ట్ ఆలియాకంటే 0.034 పాయింట్లు వెనుకబడింది. గత మూడేళ్లలో ఆమె ఏ ఈవెంట్‌లోనైనా వెనుకబడటం కూడా ఇదే తొలిసారి! బైల్స్ ప్రత్యర్థులంతా కొద్ది క్షణాల పాటు ఆశతో చూసిన క్షణమది. కానీ ఆమె వారికి మరింత అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఇలా జరగదు అన్నట్లుగా తన అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగిపోయింది. ఆమె దృష్టిలో నాలుగు అంగుళాల బీమ్ అతి పెద్ద వేదికగా మారిపోయింది. ఏరియల్ సోమర్‌సాల్ట్‌తో మొదలు పెట్టి ఆత్మవిశ్వాసంతో ఒక్కో ఈవెంట్‌లో గాల్లో ఎగురుతుంటే చూసేవాళ్లు కన్నార్పలేక పోయారు. శరీరాన్ని ఇన్ని రకాలుగా వంచడం ఇంత సులువా అనిపించేంతగా బైల్స్ విన్యాసాలు ప్రదర్శించింది. చివరకు ఆలియా స్కోరు (13.866)తో పోలిస్తే ఎంతో మెరుగ్గా (15.433) స్వర్ణం ఈ అమెరికా చిన్నారి చెంతకు చేరింది.

 

ఆల్‌టైమ్ గ్రేట్
చంద్రునిపై మొదట కాలు మోపిన ఇద్దరిలో ఒకరైన ఎడ్విన్ ఆల్డ్రిన్... రియోలో ప్రత్యక్షంగా బైల్స్ పోటీలను తిలకించారు. తాను కూడా ఆమె గురుత్వాకర్షణ శక్తికి ఆశ్చర్యపోయినట్లు చెప్పడం ఈ యువ జిమ్నాస్ట్‌కు లభించిన ప్రశంసల్లో ప్రత్యేకమైంది. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ మహిళలు ఉన్నారు. మరి బైల్స్ స్థానం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. అమెరికన్లు మాత్రం ఆమె ఎప్పుడో ‘ది బెస్ట్’ అని చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు ఒలింపిక్ పతకం గెలిస్తే తప్ప గ్రేట్ కాదు... అంటూ వినిపించిన వ్యాఖ్యలకు కూడా ఇప్పుడు బ్రేక్ పడిపోయినట్లే. వాల్ట్‌లో ‘అమనార్’ను అంత కచ్చితత్వంతో చేయడం ఆమెకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది. ఇక ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో ఆమె పేరుతోనే ‘ది బైల్స్’ అనే సిగ్నేచర్ స్టైల్ విన్యాసం నిజంగా అద్భుతం అనిపిస్తుంది.

 

కష్టాల నుంచి కోలుకొని
కెరీర్ ఆరంభంలో ఆమె రనప్ మగాడిలా ఉంటుందన్నారు. వాల్ట్ ఈవెంట్‌లో ఒక సారి రెండు సార్లు సున్నా స్కోరు చేసింది. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె ఒక దశలో ఇంటినుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే తనను దత్తత తీసుకున్న తాతయ్య, అమ్మమ్మల వల్లే ఈ స్థాయికి వచ్చానని బైల్స్ చెబుతుంది. అందుకే అమ్మమ్మను కూడా బైల్స్ అమ్మా అనే పిలుస్తుంది.  నైకీ, అమెరికన్ ఎయిర్‌లైన్స్ తదితర సంస్థలు ఈ నల్లజాతి వజ్రంతో ఒప్పందాలకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఆమె ఏడాది ఆదాయం కనీసం 2 మిలియన్ డాలర్లుగా ఉంది.  2013లో ప్రతీ ఈవెంట్‌లో వరుసగా ఓడిపోతున్నప్పుడు కోచ్ ఐమీ బూర్మన్ ఆమెకు కొత్త దిశను చూపించాడు. అప్పటినుంచి ఆమెకు పరాజయం అనేదే లేదు. టీనేజ్ వయసులోనే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన బైల్స్ జీవితం  అందరికీ స్ఫూర్తినిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement