మంత్రి శ్రీధర్‌బాబుతో దక్షిణ కొరియా షూ కంపెనీ చైర్మన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 750 ఎకరాలు కేటాయిస్తే రూ. 300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పిందన్నారు. దక్షిణ కొరియా నుంచి వచి్చన షూఆల్స్ చైర్మన్ చెవోంగ్ లీ, ఆ సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో తనను కలిసినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగల గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారన్నారు.
మెడికల్ చిప్‌తో కూడిన బూట్ల సోల్స్, జీపీఎస్ అమర్చిన బూట్లు, 10 వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బూట్లతోపాటు మధుమేహం, కీళ్ల నొప్పుల బాధితులకు నడకలో ఉపశమనం కలిగించే పలు రకాల ఉత్పత్తులను తాము తయారు చేస్తామని చెవోంగ్ లీ పేర్కొన్నట్లు శ్రీధర్‌బాబు వివరించారు. అలాగే 5 వేల ఎకరాలు కేటాయిస్తే ఆసియాలో ఎక్కడాలేని విధంగా స్మార్ట్ హెల్త్సిటీని నెలకొల్పే ప్రతిపాదనను కొరియా బృందం చేసిందన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్ ఆసక్తి
రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీ దేశంలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రైన్లాండ్ రాష్ట్ర ఆర్థిక, రవాణా, వ్యవసాయ మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూష్లెర్, హైదరాబాద్ కాన్సుల్ అమితా దేశాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, బయో టెక్నాలజీ, వ్యా క్సిన్‌లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment