దక్షిణ కొరియా అధ్యక్షుల వివాదాస్పద చరిత్ర
దక్షిణ కొరియాలో తాజాగా ఎమర్జెన్సీ విధింపు తీవ్ర దుమారానికే దారితీసింది. విపక్షాల్లోని ఉత్తర కొరియా అనుకూల దేశద్రోహ శక్తుల ఏరివేత కోసమంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న నిర్ణయం దేశమంతటా అలజడి రేపింది. విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచీ దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
విపక్షాలన్నీ కలిసి కొన్ని గంటల్లోనే పార్లమెంటు ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తేశాయి. దేశంపై సైనిక పాలనను రుద్దజూశారంటూ విపక్ష డెమొక్రటిక్ పార్టీ యూన్‌పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టింది. దాంతో దేశం పెను రాజకీయ సంక్షోభంలో పడింది. అభిశంసనలు, జైలు, హత్యల వంటి మరకలు దక్షిణ కొరియా అధ్యక్ష చరిత్రలో పరిపాటే. నిజానికి ఆ దేశ రాజకీయ చరిత్రంతా తిరుగుబాట్లమయమే!
విద్యార్థుల తిరుగుబాటు
దక్షిణ కొరియా తొలి అధ్యక్షుడు సింగ్మన్ రీ 1960లో విద్యార్థుల భారీ తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటంతో యువతలో ఆయనపై ఆగ్రహం పెల్లుబుకింది. దిగిపోవ్సాఇందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. రాజీనామా అనంతరం రీ దేశ బహిష్కరణకు గురయ్యారు. హవాయికి వెళ్లిపోయి 1965లో మరణించేదాకా అక్కడే గడిపాల్సి వచి్చంది.
సైనిక తిరుగుబాటు
మరో అధ్యక్షుడు యున్ పో సన్ 1961లో సైనికాధికారి పార్క్ చుంగ్ హీ సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యాడు. అయినా యున్‌కు కొంతకాలం పదవిలో కొనసాగేందుకు పార్క్ అనుమతించినా నెమ్మదిగా ప్రభుత్వాన్ని తన అ«దీనంలోకి తెచ్చుకున్నారు. తరవాత 1963 ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని యున్ స్థానంలో అధ్యక్షుడయ్యారు.
రాజద్రోహం, జైలు
గ్వాంగ్జు తిరుగుబాటును క్రూరంగా అణచివేసిన చున్ డూ హ్వాన్ 1987లో పదవి నుంచి వైదొలిగారు. భారీ నిరసనల ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. కొరియా యుద్ధ సమయంలో తన అనుచరుడు రోహ్ టే వూకు అధికారం అప్పగించారు. అనంతరం అవినీతి, హింసతో దేశం కుదేలైంది. దాంతో తిరుగుబాటు ఇతర నేరాల కింద చున్, రోహ్ రాజద్రోహం అభియోగాలను ఎదుర్కొన్నారు. చున్‌కు మరణశిక్ష విధించానా తరవాత జీవిత ఖైదుగా మార్చారు. రోహ్‌కు ఇరవై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. రెండేళ్ల జైలు శిక్ష నంతరం ఇద్దరికీ 1998లో క్షమాభిక్ష లభించింది.
అవినీతి, ఆత్మహత్య
2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్న రో మూ హ్యూన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2009లో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంపన్న షూ తయారీదారు కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు విచారణలో ఉండగానే జీవితాన్ని అంతం చేసుకున్నారు.
15 ఏళ్ల జైలు శిక్ష
2008 నుంచి 2013 దాకా అధ్యక్షునిగా ఉన్న లీ మ్యూంగ్ బాక్‌కు అవినీతి కేసులో జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత కేసులో దోషిగా తేలిన సామ్‌సంగ్ సంస్థ చైర్మన్ నుంచి లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. దాంతో 2018లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 2022 డిసెంబర్‌లో ప్రస్తుత అధ్యక్షుడు యూన్ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు!
అధ్యక్షురాలికి అభిశంసన, జైలు
దక్షిణ కొరియా తొలి అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై 2016లో అభిశంసన ఎదుర్కొన్నారు. తరవాత జైలు శిక్ష అనుభవించారు. ఆమె మాజీ నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె. 2013 నుంచి పదవిలో ఉన్నారు. సామ్‌సంగ్ వంటి సంస్థల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రహస్య పత్రాలను లీకేజీ, తనను విమర్శించే కళాకారులను బ్లాక్‌లిస్టులో పెట్టడం, వ్యతిరేకించిన అధికారులను తొలగించడం వంటి ఆరోపణలూ ఉన్నాయి. దాంతో 2017లో పార్క్ అభిశంసనకు గురయ్యారు. అభియోగాలు నిర్ధారణవడంతో 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడ్డాయి. కానీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆమెకు క్షమాభిక్ష పెట్టారు. ఆ సమయంలో సియోల్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నది ప్రస్తుత అధ్యక్షుడు యూన్ కావడం విశేషం. పార్క్ తొలగింపు, జైలు శిక్ష విధింపులో ఆయనదే కీలక పాత్ర.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment