ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఏటికి ఎదురీదుతున్న వర్తమానంలో అందరూ కొత్త అవకాశాల కోసం, సరికొత్త సాన్నిహిత్యాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని నెలల్లో జరగబోయే జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు రావాల్సిందిగా మన దేశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. కరోనా వైరస్ విరుచుకుపడిన తర్వాత సంపన్న రాజ్యాలు కూడా సమస్యల్లో చిక్కుకున్నాయి. అన్ని దేశాలూ ఈ ఏడాది తెరిపినపడే అవకాశం వున్నదని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. అలాగని కరోనా ముందున్నప్పటి స్థితి ఇప్పట్లో అసాధ్యమని కూడా వివరించింది.
అందుకు సుదీర్ఘకాలం పడుతుంది. నిర్దిష్టంగా దాన్ని అంచనా వేయటం కుదర దని ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 5.2 శాతం వృద్ధి నమోదవు కావొచ్చన్నది ఒక అంచనా. ఆ వృద్ధిలో ఎవరికి వారు తాము కూడా భాగస్వాములం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే బోరిస్ జాన్సన్ జీ–7 శిఖరాగ్ర సదస్సు కోసం ఉత్సాహపడుతున్నారు. సదస్సులో ఆయనే అధ్యక్షుడవుతారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ ఇటీవలే తప్పుకుంది. ఈ ఒంటరి ప్రస్థానం నేపథ్యంలో అంతర్జాతీయంగా చురుకైన పాత్ర నిర్వహించాలని, సాధ్యమైనంత త్వరగా స్వీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఆ దేశం ఆత్రంగా వుంది.
జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో నేరుగా దేశాధినేతలు పాల్గొని రెండేళ్లవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి బెడద లేకపోతే నిరుడు అమెరికాలో అధినేతలంతా కలిసేవారే. 2019లో ఫ్రాన్స్‌లో జరిగిన సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో బ్రిటన్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు భాగస్వాములు కాగా... దక్షిణ కొరియా, ఆస్ట్రే లియాతోపాటు మనల్ని కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పిలవాలని అటు అమెరికా, ఇటు బ్రిటన్ నిరుడు నిర్ణయించాయి. 45 ఏళ్లనాటి ఈ సంస్థలో సోవియెట్ యూనియన్ పతనానంతరం రష్యాకు కూడా సభ్యత్వం లభించింది.
అయితే 2013లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్నాక ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యాలు సంస్థ నుంచి దాన్ని బహిష్కరించాయి. 2019నాటి సదస్సులో ఆ దేశాన్ని మళ్లీ జీ–7లో చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన వాదనను ఇతర దేశాలు ససేమిరా అంగీకరించలేదు. యూరప్ దేశాలకు ముప్పు కలిగిం చేలా వ్యవహరిస్తున్న రష్యా పోకడలు మారకుండా ఎలా చేర్చుకుంటామని అందరికందరూ ఎదురు తిరిగారు. దాంతో ట్రంప్ ఏకాకయ్యారు. వాస్తవానికి అమెరికాలో సదస్సు నిర్వహించి, ఆ సంస్థ సారథ్యాన్ని స్వీకరించి ఎలాగైనా రష్యాకు చోటీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా సదస్సు నిర్వహణ అసాధ్యమైంది. ఇప్పుడు జీ–7 ముందు చాలా సమస్యలే వున్నాయి. వర్థమాన దేశాలు చెల్లించాల్సిన రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేయటం అందులో ఒకటి. సమీప భవిష్యత్తులో ఏ దేశమూ తీసుకున్న అప్పును చెల్లించే స్థితిలో లేదు. పైగా కోలుకోవటం కోసం వాటికి కొత్తగా భారీ రుణాలు అవసరమవుతాయి.
ఆదాయాలు దారుణంగా పడిపోయి, వ్యయం అపారంగా పెరిగిన వర్తమానంలో అన్ని దేశాలూ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నాయి. మొన్న డిసెంబర్ మధ్యకు ప్రపంచ దేశాల రుణం 20 లక్షల కోట్ల డాలర్లుంది. ఇది వున్నకొద్దీ మరింతగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్లు ఇవ్వటం మొదలుకాగా, మరోపక్క అది కొత్త రూపంతో కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా తర్వాత విమాన రాకపోకల్ని నిలిపేసిన అనేక దేశాలు ఇప్పుడిప్పుడే వాటిని పునరుద్ధరిస్తుండగా తాజాగా పుట్టుకొ చ్చిన వైరస్ కారణంగా మళ్లీ వెనకడుగేస్తున్నాయి. నిషేధాలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా మారి, ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు ముమ్మరంగా పెరిగితే తప్ప ఆర్థిక వ్యవస్థలు గాడినపడటం సాధ్యంకాదు.
ఇదిగాక రష్యాకు సభ్యత్వమిచ్చే సమస్య సరేసరి. సదస్సు నాటికి ఎటూ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వస్తారు గనుక ఆ విషయంలో ఆ దేశం వైఖరి మారుతుంది. జీ–7 దేశాల మధ్య ఆర్థిక రంగంతోపాటు పర్యావరణం, ఆరోగ్యం, వాణిజ్యం, సాంకే తికాభివృద్ధి వగైరా రంగాల్లో సైతం దృఢమైన సహకారం ఏర్పడాలని బోరిస్ జాన్సన్ ప్రతిపాది స్తున్నారు. సభ్య దేశాలతోపాటు సదస్సులో పాల్గొనే మూడు దేశాలనూ కలుపుకొంటే ప్రజాస్వామ్య దేశాల్లోని 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుందని, దీన్ని మరింత మెరుగ్గా వినియో గించుకుంటే అందరూ ఎదగటానికి అవకాశం వుంటుందని బ్రిటన్ విశ్వసిస్తోంది.
సంక్షోభంలోనే జీ–7 పుట్టింది. 1975లో ఒపెక్ దేశాల నిర్ణయం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం నుంచి గట్టెక్కటానికి అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు దీన్ని స్థాపించాయి. అన్ని రంగా ల్లోనూ కలిసి కదలాలని, ప్రపంచ దేశాలన్నిటినీ కలుపుకొని తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించాలని భావించాయి. దాంతో పోలిస్తే ఈనాటి సంక్షోభం అనేక రెట్లు పెద్దది. ఒక అంచనా ప్రకారం కరోనా తర్వాత ఉపాధి కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికోట్ల మంది తీవ్ర దారిద్య్రంలో కూరుకు పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు సైతం తీవ్ర నష్టాలను చవిచూశాయి.
జీ–7 దేశాల్లోనే తీసుకుంటే ఒక్క జర్మనీ మినహా అన్నిచోట్లా నిరుద్యోగం ఉగ్రరూపం దాల్చింది. ప్రజల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఈ గడ్డు పరిస్థితుల్లో భారీ మొత్తంలో నిధులు పారించి, ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే తప్ప కోలుకోవటం అసాధ్యం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దాదాపు సున్నా శాతానికి తీసుకొచ్చింది. దాన్ని ఇప్పట్లో పెంచబోమని చెబుతోంది. అటు యూరొపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా భిన్న మార్గాల్లో భారీగా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇవన్నీ శిఖ రాగ్ర సదస్సునాటికి సత్ఫలితాలిస్తే సంపన్న దేశాలు ఉత్సాహంగా అడుగులేయటం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment