పార్టీ గేట్ వ్యవహారంలో ఇంట్లో ఈగల మోత మోగుతున్న వేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌లో అడుగుపెట్టారు. తనకు లభించిన స్వాగత సత్కారాల సంరంభం చూసి పరమానందభరితుడయ్యారని ఆయన వ్యాఖ్యానాలే చెబుతున్నాయి. ‘ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి అతిథి మర్యాదలు లభించే అవకాశం లేద’న్నది ఆయన అభిప్రాయం. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ఆయన భారత్ రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడక తప్పలేదు.
నిరుడు రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఆ తర్వాత నిరుడు ఏప్రిల్‌లో అనుకున్నారు. అప్పుడు రెండో దశ కరోనా విజృంభణ మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలైన దగ్గరనుంచి రష్యాతో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు విరమించుకోవాలని అమెరికా మనపై ఒత్తిడి తెస్తోంది. బ్రిటన్ అభిప్రాయమూ అదే అయినా, దాని వైఖరి భిన్నం. ఈ నెల మొదట్లో మన దేశం వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ స్వరమే అందుకు సాక్ష్యం. సంక్షోభ కాలాల్లో ఎలా వ్యవహరించాలో భారత్‌కు ఉపన్యాసం ఇవ్వదల్చుకోలేదని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు ముగిశాక జరిగిన విలేకరుల సమావేశంలో కూడా జాన్సన్ ఆ బాణీలోనే మాట్లాడారు. ఉక్రెయిన్ అంశంలో ఇప్పటికే పలుమార్లు మోదీ పుతిన్‌తో మాట్లాడారనీ, రష్యా విధానాలు సరికాదని చెప్పారనీ జాన్సన్ ప్రశంసించారు. బ్రిటన్ ఎంత ఆచితూచి వ్యవహరిస్తున్నదో చెప్పడానికి ఇది చాలు.
కారణాలు మనకు తెలియనివేమీ కాదు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికొచ్చాక బ్రిటన్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచ దేశాలన్నిటితో, మరీ ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని తహతహలాడుతోంది. కారణాలు ఏమైనా గత దశాబ్దంగా ఇరు దేశాల వాణిజ్యంలో స్తబ్దత ఏర్పడింది. రెండు దేశాల వాణిజ్యం 2020లో మొత్తంగా 2,400 కోట్ల డాలర్లుంది. ఇదే కాలంలో మనకంటే చిన్న దేశమైన బెల్జియంతో బ్రిటన్ వాణిజ్యం ఇంతకన్నా రెట్టింపుంది. ఈ నేపథ్యంలో మనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ఖరారుకు సంబంధించిన చర్చలు నిరుడు జనవరిలో మొదలయ్యాయి. ఇప్పటికి రెండు దఫాలు పూర్తయ్యాయి. ఈ వారం ఆఖరులో మూడో రౌండ్ చర్చలు పూర్తయితే ఎఫ్‌టీఏ ఒక కొలిక్కి వస్తుంది. జాన్సన్ ఆశిస్తున్నట్టు దీపావళి నాటికి ఇరు దేశాల మధ్యా ఆ ఒప్పందం ఖరారైతే 2035 కల్లా బ్రిటన్ నుంచి మన దేశానికి ఏటా 2,145 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు పెరుగుతాయని అంచనా. వాణిజ్య వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన విధివిధానాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో జాన్సన్ పర్యటన ప్రస్తుతం ఉపాధి అవకాశాలు, వీసాల మంజూరు తదితర అంశాలపైనే దృష్టి కేంద్రీకరించింది. అదనపు వీసాలు మంజూరు చేస్తేనే వాణిజ్య ప్రతిబంధకాలను సడలిస్తామని మన దేశం చెబుతోంది. స్థానికులను కాదని వెలుపలివారికి అవకాశాలివ్వడమేమిటన్నది జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇప్పుడు అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా సమస్యలెదురవుతాయని ఆయన భయం.
రష్యా రక్షణ ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడిన భారత్‌ను ఇప్పటికిప్పుడు ఆ దేశంతో తెగతెంపులు చేసుకోమని ఒత్తిడి చేయడం సరికాదని బ్రిటన్ భావిస్తున్నది. తన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిని క్రమేపీ పెంచుతూ రష్యాపై ఆధారపడే స్థితిని తప్పించాలనుకుంటోంది. వాస్తవానికి ఒకప్పుడు బ్రిటన్ మన రక్షణ అవసరాలకు ప్రధాన వనరుగా ఉండేది. కానీ కాలం గడిచేకొద్దీ అది క్షీణించి, ప్రస్తుతం మన రక్షణ దిగుమతుల్లో ఆ దేశం వాటా 3 శాతానికి పరిమితమైంది. ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరితే పూర్వవైభవం ఖాయమని బ్రిటన్ ఆలోచన. కానీ అందుకు ప్రతిబంధకాలున్నాయి. బ్రిటన్ పార్లమెంటులో కశ్మీర్‌పై చర్చ జరగడం, అక్కడ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమాలు పెరగడం మన దేశానికి నచ్చలేదు. అలాగే మైనారిటీలపై దాడులు, అసమ్మతిని అణిచేయడం వంటి అంశాలు ఆ దేశంలో ప్రధానంగా చర్చకు రావడం సైతం అయిష్టంగానే ఉంది. భారత్ వచ్చేవారికి ఈ–వీసాల మంజూరు నిబంధనలు సరళం చేయాలని బ్రిటన్ కోరుతోంది.
అదే సమయంలో భారత్‌నుంచి వచ్చేవారిపై బ్రిటన్ అమలు చేస్తున్న నిబంధలపై మన దేశం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాల కూటమిలో మనతోపాటు బ్రిటన్ కూడా భాగస్వామి గనుక భారత్‌లో తనకు పుష్కలంగా అవకాశాలుంటాయని ఆ దేశం విశ్వసిస్తోంది. నిరుడు మే నెలలో జరిగిన ఆన్‌లైన్ శిఖరాగ్ర సదస్సులో ఆరోగ్యం, వాతావరణ మార్పులు, రక్షణ, భద్రత వగైరా అంశాలు చర్చకొచ్చాయి. లాక్‌డౌన్ కాలంలో నిబంధనలు బేఖాతరు చేసి మిత్రులు, పార్టీ నేతలతో మూడుసార్లు విందులు వినోదాల్లో మునిగి తేలారన్నది జాన్సన్‌పై అభియోగం. అది నిజం కాదని అబద్ధమాడి పార్లమెంటును పక్కదోవ పట్టించారన్న ఆరోపణపై గురువారం హౌస్ కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ జాన్సన్‌ను దోషిగా నిర్ధారిస్తే నిబంధనల ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. ఈలోగా భారత్‌తో చరిత్రాత్మకమైన ఎఫ్‌టీఏ సాకారం కావాలనీ, తన పేరు చిరస్థాయిగా నిలవాలనీ జాన్సన్ కోరుకుంటున్నారు. అదెంతవరకూ సాధ్యమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment