మనామా: ఓ దశాబ్దం తరువాత బహ్రెయిన్ లో ఉంటున్న ఓ భారతీయ యువకుడు తండ్రి వద్దకు చేరుకోబోతున్నాడు. బాల్యంలోనే తల్లి దండ్రులకు దూరమైన రవి ప్రసాద్ (18) అనే యువకుడు తాజాగా తిరిగి తండ్రి ఆత్మీయ స్వర్శకు దగ్గర కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ కు చెందిన థానే ప్రసాద్ శ్రీలంలకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని బహ్రెయిన్ లో స్థిరపడ్డాడు. వారికి రవి అనే కొడుకు జన్మించాడు. అయితే ఆ యువకునికి సరిగ్గా రెండేళ్లప్పుడు కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగా అతని తల్లి దండ్రులు వేరుపడ్డారు. అనంతరం 2006లో ధానే ప్రసాద్ బహ్రెయిన్ నుంచి తిరిగి భారత్ కు వచ్చేశాడు.
కాగా, ఆ తదుపరి తల్లికి కూడా దూరమైన ఆ యువకుడు వలస కార్మికుల రక్షణ సొసైటీలో ఉంటూ లాండ్రీ కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి.. కుమారుని కోసం తిరిగి వేట ప్రారంభించాడు. అందులో భాగంగా తండ్రి మళ్లీ బహ్రెయిన్ కు చేరుకున్నాడు. తన కుమారుని గుర్తింపుకు సంబంధించిన తగిన ఆధారాలను సంపాదించాడు.
ప్రస్తుతం లాండ్రీ కార్మికునిగా పని చేస్తూనే కొంతమంది సాయంతో బహ్రెయిన్ లో తన చదువు కుంటున్న ఆ యువకునికి భారత అంబాసీ నుంచి క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే అతను సంతోషంగా తండ్రి స్వస్థలం భారత్ కు వెళుతున్నాడని సోషల్ వర్కర్ మెహ్రూ వేశువాలా తెలిపాడు.