ఖతార్‌కు దిమ్మతిరిగే షాక్
గల్ఫ్ అరబ్ దేశాలతో పూర్తిగా సంబంధాలు కట్
రియాద్: ఖతార్‌కు సహచర అరబ్ దేశాలు దిమ్మతిరిగే షాక్‌నిచ్చాయి. ఖతార్ ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఈజిప్ట్, బ్రహెయిన్ ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాయి. దౌత్యసంబంధాలతోపాటు భూ, గగనతల, సముద్ర సంబంధాలను సైతం కట్ చేసుకుంటున్నట్టు తేల్చిచెప్పాయి.
ఖతార్ ఉగ్రవాదాన్ని, అతివాదానికి మద్దతుగా నిలుస్తున్నదని సౌదీ ఆరోపిస్తుండగా.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని బ్రహెయిన్ మండిపడుతోంది. ఉగ్రవాదం నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ తెలిపింది. రానున్న 48 గంటల్లో దోహాలోని తమ దౌత్యకార్యాలయాన్ని ఉపసంహరించుకుంటామని, అదే గడువులోగా తమ దేశంలో ఉన్న ఖతార్ దౌత్యవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లాలని హుకుం జారీచేసింది. తమ దేశంలోని ఖతార్ పౌరులు కూడా రెండువారాల్లోగా దేశాన్ని విడిచివెళ్లాలని ఆదేశించింది.