
బహ్రెయిన్ రాజు తలుచుకుంటే..
దుబాయ్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న తమ పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తోన్న వారిపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ అల్ ఖలీఫా ఉక్కుపాదం మోపాడు. సాధారణ పౌరులను సైతం మిలటరీ కోర్టుల్లో విచారించేలా కొత్తగా రూపొందించిన కఠిన చట్టానికి రాజముద్ర వేశాడు. ఈ విషయాన్ని బహ్రెయిన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది.
ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం సైతం పొందిన ఈ చట్టం ద్వారా ఆందోళనకారులను తీవ్రంగా దండించే వీలుంటుంది. చిన్నపాటి నిరసనలకు సైతం పెద్దపెద్ద శిక్షలు అమలయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పనితీరును విమర్శింస్తూ, దేశంలో సంస్కరణలు తీసుకరావాలని డిమాండ్‌తో మూడేళ్లుగా జనం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బెహ్రెయిన్‌లో ప్రధాన ప్రతిపక్షమైన అల్‌వెఫాక్ నేషనల్ ఇస్లామిక్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న నిరసన కార్యక్రమాల్లో సాధారణ ప్రజలు సైతం విశేషంగా భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామని ప్రభు వర్గాలు పేర్కొన్నప్పటికీ, ఇలాంటి చట్టాలు ముమ్మాటికీ పౌరహక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అటు ఐక్యరాజ్యసమితి కూడా బెహ్రెయిన్ పాలకుడి కఠిన విధానాలను తప్పుపడుతూనేఉంది. నిరసన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతిపక్ష నాయకుడు షేక్ అలీ సల్మాన్‌కు బహ్రెయిన్ కోర్టు గత ఏడాది తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కొత్తగా అమలయ్యే చట్టంలో శిక్షలు ఇంకా తీవ్రంగా ఉండనున్నాయి.