యూఏఈలోని అబుదాబిలో నిర్మితమైన మొదటి హిందూ దేవాలయం బుధవారం (ఫిబ్రవరి 14)నాడు ప్రారంభమయ్యింది. బీఏపీఎస్ నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పుడు అబుదాబి తర్వాత మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మితం కాబోతోంది. ఇందుకోసం ఆ దేశ రాజు నుంచి భూమిని విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
యూఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రెయిన్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని బోచాసన్ నివాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) నిర్మించబోతోంది. ఈ నేపధ్యంలో బీఏపీఎస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ పాలకునితో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి.
బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు. దీనికి ముందు స్వామి అక్షరతి దాస్, డాక్టర్ ప్రఫుల్ల వైద్య, రమేష్ పాటిదార్, మహేష్ దేవ్‌జీ తదితరులు ఆలయ నిర్మాణం విషయమై చర్చించేందుకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌ను కలిశారు. అన్ని మతాల ప్రజలను స్వాగతించడం, వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని బీఏపీఎస్ పేర్కొంది.
బహ్రెయిన్‌లోని హిందూ ఆలయ నిర్మాణానికి భూమిని ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీ.. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment