శ్రీశ్రీ చెప్పిన జోక్... | Sri Sri's joke ... | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ చెప్పిన జోక్...

Published Mon, Jan 27 2014 11:16 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Sri Sri's joke ...

శ్రీశ్రీ చెప్పిన జోక్...
ప్రముఖుల హాస్యం

 శ్రీశ్రీ అనగానే పోటెత్తిన ఆవేశం గుర్తుకు వస్తుంది. పిడికిలి బిగిసిన చప్పుడు వినిపిస్తుంది. కవిత్వం త్రినేత్రమైన సందర్భాలు గుర్తుకు వస్తాయి.
 కవిత్వంలో సరే, వ్యక్తిగతంగా శ్రీశ్రీ ఎలా ఉండేవారు?
 రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండేవారు! అని అనిపిస్తుంది గానీ ఆయనలో చల్లని చమత్కారం ఎక్కువ. సందర్భానుసారంగా హాస్యాన్ని పుట్టించడంలో శ్రీశ్రీ దిట్ట.
 ఒక ప్రసంగంలో శ్రీశ్రీ చెప్పిన జోక్...
 ‘‘ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారనుకుంటాను. డాక్టర్ల మీద ఒక జోక్ ఉంది. ఇది నా జోక్ కూడా కాదు. కృష్ణశాస్త్రిగారిది. జోక్స్ అంటే నిజానికి హర్ట్ కాకూడదు. న్యాయంగా తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి. కాబట్టి..ఐ వుడ్ జస్ట్ లైక్ టు రీ టెల్ ఏ జోక్. ఆయన ఏమన్నారంటే -
 ‘ఏవండీ ఈమధ్య మీరు వైద్యం మానేసి కవిత్వం మొదలుపెట్టారట నిజమేనా?’ అని ఒక డాక్టర్‌ని అడిగితే-
 ‘అవునండీ నిజమే. వైద్యం మానేశాను. కవిత్వం రాస్తున్నాను’ అన్నాడట. ఆయన ‘సరే ఏదైతేనేంలెండి మనుషులను చంపడానికి’ అన్నాడట!’’

మంత్రతంత్రాలపై నియంత్రణ
కొత్త చట్టం
 
మంత్రాలకు చింతకాయలు రాలతాయనే ఆశావహులు ప్రతి దేశంలోనూ  ఉంటారు. బహ్రెయిన్‌లో మాత్రం వారి సంఖ్య ఎక్కువ. మంత్రాలకు చింతకాయలేమి ఖర్మ... ఆకాశంలో చుక్కలు కూడా రాలతాయనేది వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకమే ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రాజ్యంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ఒకావిడ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి ‘‘నేనంటే నా భర్త గడగడ వణికి పోవాలి. నా మాటకు ఎదురు చెప్పకూడదు’’ అంది.
 
‘‘భర్తకు పెట్టే భోజనంలో నీ రక్తాన్ని కలుపు’’ అని టెర్రిఫిక్ సలహా ఇచ్చాడు మాంత్రికుడు. ఆమె అలాగే చేసింది.  ఆ తరువాత ఏమైంది? ఆమె పిచ్చాసుపత్రిలో ఉంది. మాంత్రికుడు జైల్లో ఉన్నాడు! ‘‘మూఢనమ్మకాల గురించి అవగాహన కలిగించంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది’’ అని నిప్పులు చెరుగుతున్నాడు పార్లమెంట్ సభ్యుడు బుకైస్. నష్టనివారణ చర్యల్లో భాగంగా చేతబడులపై ఉక్కుపాదం మోపడానికి ఇటీవల కఠినచట్టం అమల్లోకి తెచ్చింది బహ్రెయిన్ ప్రభుత్వం.
 
 ఫ్రైడ్ ఫుడ్‌ను ముట్టను
 ఫుడ్ ఫిలాసఫీ
 
తిండి కలిగితే కండ కలదోయ్... అంటారు. మరి కండలవీరుడు హృతిక్‌రోషన్‌కు ‘తిండి’ గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఆయన ‘ఫుడ్ ఫిలాసఫీ’ ఆయన మాటల్లోనే...
     
ఏం తింటున్నాను... అనేదాని మీద స్పష్టమైన అవగాహన పెంచుకుంటాను. వాటిలో ఉండే పోషకాలను గురించి తెలుసుకుంటాను.
     
ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాకుండా ‘టైమ్ టేబుల్’ను అనుసరిస్తాను.
     
{ఫైడ్ ఫుడ్‌ను ముట్టను.
     
ఎన్నో దేశాల్లో ఎన్నోరకాల వంటకాలు తిన్నా... భారతీయ వంటకాలు అంటేనే ఇష్టం. ఇండియన్ స్టయిల్‌లో తయారు చేసిన దాల్, చావల్, మటన్, చికెన్, కూరగాయలతో చేసిన వంటకాలు అంటే ఇష్టం. ఇండియన్ కాకుండా నేను ఇష్టపడే ఇతర దేశాల వంటకాలు... ఇటాలియన్, మెక్సికన్, చైనీస్.
     
రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్లను.
     
మనకు బాగా ఇష్టమైన వంటకాల్లో ఆరోగ్యానికి సరిపడనివి ఉండవచ్చు. వాటిని వదులు కోవడం అంటే త్యాగం చేసినట్లు కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు.
 
 బుజ బుజ నెల్లూరు
 ఊరు-పేరు
 
పూర్వం ఉదయగిరిని రాజధానిగా చేసుకుని నెల్లూరు జిల్లాను ఆర్కాట్ నవాబు పరిపాలించేవారు.  ఆ సమయంలో నెల్లూరుకు చెందిన ఓ పండితుడు దివాణానికి చేరుకుని తన పాండిత్యంతో నవాబును మెప్పిస్తాడు. ‘ఏం వరం కావాలో కోరుకో’ అనడంతో ఆ పండితుడు నెల్లూరును రాసివ్వమని  కోరుకుంటాడు. సరే అంటాడు నవాబు.  ఆ సమయంలో మహామంత్రి దేశపర్యటన నిమిత్తం వెళ్లి ఉంటారు. తిరిగి వచ్చిన మహామంత్రికి విషయం తెలుస్తుంది. అత్యంత ఆదాయం వచ్చే నెల్లూరును పండితుడికి రాసిస్తే ఖజానాకు గండిపడుతుందని చెప్తాడు. మంత్రి ఆలోచనతో నెల్లూరుకు కూత వేటు దూరంలో ఓ పది గుడిసెలు నిర్మించి ఆ ప్రాంతానికి ‘బుజ్జి నెల్లూరు’ అని పేరు పెట్టి పండితుడికి రాసిస్తాడు. కాలక్రమేణా బుజ్జినెల్లూరు బుజబుజనెల్లూరుగా మారిందని చెబుతారు.
  - కారణి మురళీకృష్ణ , నెల్లూరు
 
 గమనిక: కొన్ని ఊర్ల పేర్లు, వాడల పేర్లు విచిత్రంగా ఉంటాయి. అయితే వాటి వెనుక ఏదో ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. మీకు తెలిసిన అలాంటి ఊరు వాడల పేరు వెనక కథలను రాసి పంపండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement