నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఆశ్రయం పొందే సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు, వార్డెన్లకు అవి అదనపు ఆదాయం సమకూర్చుకునే వనరులుగా మారాయి. వసూల్ రాజాలుగా మారిన అధికారులు విద్యార్థులకు భోజన మెనూ అమలును గాలికొదిలేశారు. కొందరు వార్డెన్లయితే విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి సర్కారు ఖజానాకు కన్నం పెడుతున్నారు. వసతిగృహాల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు పలువురు ఆమ్యామ్యాలకు అలవాటు పడటంతో విద్యార్థులు అర్థాకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 253 సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్లు) ఉన్నాయి.
ఇందులో ఎస్సీ విద్యార్థులకు 143, ఎస్టీలకు 25, బీసీలకు 86 హాస్టళ్లు. వీటిలో 25 వేల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్ల పర్యవేక్షణకు 10 మంది, బీసీ హాస్టళ్లకు 8 మంది, ఎస్టీ హాస్టళ్లకు ముగ్గురు ఏఎస్‌డబ్ల్యూఓలు ఉన్నారు. ఇందరు అధికారులు పనిచేస్తున్నా ఏడాదిగా కొత్త భోజన మెనూ అమలుకు నోచుకోవడం లేదు. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు వారంలో ఐదు సార్లు కోడిగుడ్లు అందించాలి. అనేక చోట్ల కోడిగుడ్డు రెండు రోజులకే పరిమితమవుతోంది. రోజూ అరటి పండు ఇవ్వాల్సి ఉన్నా వారంలో ఒక రోజే ఇస్తున్నారు. ఇక పాలు అయితే రికార్డులకే పరిమితమవుతున్నాయి. శనివారం స్వీటుకు బదులు రవ్వతో చేసిన కేసరితో సరిపెడుతున్నారు.
ఉదయం అల్పాహారంగా వారంలో మూడు రోజులు ఇడ్లీలు ఇవ్వాల్సి ఉన్నా అదీ లేదు.ప్రతి ఆదివారం ఎగ్‌బిర్యానీ బదులు కిచిడీ వడ్డిస్తున్నారు. మెనూ అమలు కోసం ప్రభుత్వం మూడు నుంచి ఏడు తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 (నెలకు), ఎనిమిది నుంచి పదో తరగతుల విద్యార్థుల కోసం రూ.850 కేటాయిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు.
తనిఖీలు గాలికి..
సహాయ సంక్షేమ శాఖ అధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని పలువురు అధికారులు విస్మరించడంతో కొందరు వార్డెన్లకు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండాల్సిన వార్డెన్లు, ఎక్కడో కాపురముంటూ హాస్టళ్లకు అతిథులుగా మారారు. చాలా చోట్ల వంటమనుషులే హాస్టల్ నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
అక్రమాలకు అడ్డాగా..
జిల్లాలోని పలు హాస్టళ్లు అక్రమాలకు అడ్డాగా మారాయి. చాలా హాస్టళ్లలో లేని విద్యార్థుల పేర్లను నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ విధానం అమలులో ఉన్నా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా నమోదు చేసి వేలాది రూపాయలను దోచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలు బయటపడకుండా పై అధికారులకు నెలనెలా కొంత మొత్తం సమర్పిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో నెల్లూరులో కాపురం ఉంటున్న వార్డెన్ల సంఘం నేత ఒకరు కీలకంగా వ్యవహరిస్తూ వార్డెన్ల నుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు పర్సెంటేజీలు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వసూల్ రాజాలు
Published Tue, Nov 19 2013 6:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement