Hostel Wardens
-
చండీగఢ్ వర్సిటీ కేసుపై ‘సిట్’
చండీగఢ్: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో వీడియోల లీక్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు మహిళా అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ సోమవారం చెప్పారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. హాస్టల్లో తోటి విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేసి షేర్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడి ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామన్నారు. ఆందోళనల సందర్భంగా విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చిన ఇద్దరు హాస్టల్ వార్డెన్లను సస్పెండ్ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. వర్సిటీలో సెలవులను 24 దాకా పొడిగించారు. ముగ్గురు నిందితులను 7 రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. -
మంత్రి రావెలకు చేదు అనుభవం !!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రస్థాయి స్వచ్ఛ వసతి గృహం వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో మంత్రి రావెలను హాస్టళ్ల వార్డెన్లు నిలదీశారు. ప్రభుత్వ హాస్టళ్ల మూసివేతపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో కంగుతున్న మంత్రి రావెల సమాధానం చెప్పకుండా వెనుదిరిగారు. -
వసూల్ రాజాలు
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఆశ్రయం పొందే సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు, వార్డెన్లకు అవి అదనపు ఆదాయం సమకూర్చుకునే వనరులుగా మారాయి. వసూల్ రాజాలుగా మారిన అధికారులు విద్యార్థులకు భోజన మెనూ అమలును గాలికొదిలేశారు. కొందరు వార్డెన్లయితే విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి సర్కారు ఖజానాకు కన్నం పెడుతున్నారు. వసతిగృహాల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు పలువురు ఆమ్యామ్యాలకు అలవాటు పడటంతో విద్యార్థులు అర్థాకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 253 సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్లు) ఉన్నాయి. ఇందులో ఎస్సీ విద్యార్థులకు 143, ఎస్టీలకు 25, బీసీలకు 86 హాస్టళ్లు. వీటిలో 25 వేల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్ల పర్యవేక్షణకు 10 మంది, బీసీ హాస్టళ్లకు 8 మంది, ఎస్టీ హాస్టళ్లకు ముగ్గురు ఏఎస్‌డబ్ల్యూఓలు ఉన్నారు. ఇందరు అధికారులు పనిచేస్తున్నా ఏడాదిగా కొత్త భోజన మెనూ అమలుకు నోచుకోవడం లేదు. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు వారంలో ఐదు సార్లు కోడిగుడ్లు అందించాలి. అనేక చోట్ల కోడిగుడ్డు రెండు రోజులకే పరిమితమవుతోంది. రోజూ అరటి పండు ఇవ్వాల్సి ఉన్నా వారంలో ఒక రోజే ఇస్తున్నారు. ఇక పాలు అయితే రికార్డులకే పరిమితమవుతున్నాయి. శనివారం స్వీటుకు బదులు రవ్వతో చేసిన కేసరితో సరిపెడుతున్నారు. ఉదయం అల్పాహారంగా వారంలో మూడు రోజులు ఇడ్లీలు ఇవ్వాల్సి ఉన్నా అదీ లేదు.ప్రతి ఆదివారం ఎగ్‌బిర్యానీ బదులు కిచిడీ వడ్డిస్తున్నారు. మెనూ అమలు కోసం ప్రభుత్వం మూడు నుంచి ఏడు తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 (నెలకు), ఎనిమిది నుంచి పదో తరగతుల విద్యార్థుల కోసం రూ.850 కేటాయిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తనిఖీలు గాలికి.. సహాయ సంక్షేమ శాఖ అధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని పలువురు అధికారులు విస్మరించడంతో కొందరు వార్డెన్లకు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండాల్సిన వార్డెన్లు, ఎక్కడో కాపురముంటూ హాస్టళ్లకు అతిథులుగా మారారు. చాలా చోట్ల వంటమనుషులే హాస్టల్ నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అక్రమాలకు అడ్డాగా.. జిల్లాలోని పలు హాస్టళ్లు అక్రమాలకు అడ్డాగా మారాయి. చాలా హాస్టళ్లలో లేని విద్యార్థుల పేర్లను నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ విధానం అమలులో ఉన్నా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా నమోదు చేసి వేలాది రూపాయలను దోచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలు బయటపడకుండా పై అధికారులకు నెలనెలా కొంత మొత్తం సమర్పిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో నెల్లూరులో కాపురం ఉంటున్న వార్డెన్ల సంఘం నేత ఒకరు కీలకంగా వ్యవహరిస్తూ వార్డెన్ల నుంచి డబ్బులు వసూలు చేసి అధికారులకు పర్సెంటేజీలు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
బీసీ సంక్షేమ శాఖలో లొల్లి
కలెక్టరేట్,ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో లొల్లి ముదిరింది. వసతి గృహాల నిర్వహణకు సంబంధించిన కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ కథనాలకు వివరణ ఇచ్చినందుకు బీసీ సంక్షేమశాఖాధికారిణి విమలాదేవిపై వార్డెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే నీవు ఇక్కడ ఉండవంటూ హెచ్చరించినట్లు సమాచారం. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో రహస్యంగా నిర్వహించుకు న్న సమీక్షలో అధికారిణిపై వార్డెన్లు ధ్వజమెత్తిన విషయం బయట పడింది. దీనికి తోడు కార్యాలయంలో ఉద్యోగుల సహాయ నిరాకరణతో బీసీ సంక్షేమ శాఖధికారి విమలాదేవి పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కగా మారింది. బోధన్ ఏబీసీడబ్ల్యూగా పని చేస్తున్న విమలాదేవికి ఆరు నెలల క్రితం బీసీ సంక్షేమాధికారి రాజయ్య పదవీ వీరమణ చేయడంతో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె వసతి గృహాలపై దృష్టి సారించింది. వీటి నిర్వహణపై ఎప్పటికప్పుడు వార్డెన్లతో సమీక్షలు నిర్వహించారు. బీసీ వసతి గృహాల బిల్లులు ఈ నెల 26లోగా ఆన్లైన్ చేయాలని, మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపై వార్డెన్లకు కచ్చితమై ఆదేశాలు జారీ చేశారు. విధించిన గడువులోగా ఆన్లైన్ చేయని వార్డెన్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ‘సాక్షి’ లో కథనం ప్రచురితమైంది. దీనికి కొందరు వార్డెన్లు సమాధానం ఇస్తూ తమకు అసలే కంప్యూటర్ గురించి తెలియదు.. ఇప్పుడు ఆన్లైన్ చేయాలంటే ఎలా...? తమకు శిక్షణ కూడా ఇవ్వలేదంటూ... అధికారిణిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందుకు తమకు నోటీసులు ఇస్తామంటే చేతులు ముడుచుకుని కూర్చోలేమని... నోటీసులు ఇస్తే కనుక తామంతా ఏకమై పలు ఆరోపణలు మోపి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, సదరు అధికారిణిని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. ఇటు బీసీ సంక్షేమ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు కూడా అధికారిణిపై సహాయ నిరాకరణ చేపట్టడంతో సంక్షేమ శాఖ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. విమలదేవి మెతక వైఖరి సంక్షేమ శాఖ ఉద్యోగులకు, వార్డెన్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో జరుగుతున్న సంక్షేమ శాఖ లొల్లి,చిలికి చిలికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకుని బీసీ సంక్షేమ శాఖ పరిస్థితిని చక్కదిద్దితే గాని వసతి గృహాల నిర్వహణ ముందుకు సాగేలా కనబడటంలేదు.