కలెక్టరేట్,ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో లొల్లి ముదిరింది. వసతి గృహాల నిర్వహణకు సంబంధించిన కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ కథనాలకు వివరణ ఇచ్చినందుకు బీసీ సంక్షేమశాఖాధికారిణి విమలాదేవిపై వార్డెన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే నీవు ఇక్కడ ఉండవంటూ హెచ్చరించినట్లు సమాచారం. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో రహస్యంగా నిర్వహించుకు న్న సమీక్షలో అధికారిణిపై వార్డెన్‌లు ధ్వజమెత్తిన విషయం బయట పడింది. దీనికి తోడు కార్యాలయంలో ఉద్యోగుల సహాయ నిరాకరణతో బీసీ సంక్షేమ శాఖధికారి విమలాదేవి పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కగా మారింది.
బోధన్ ఏబీసీడబ్ల్యూగా పని చేస్తున్న విమలాదేవికి ఆరు నెలల క్రితం బీసీ సంక్షేమాధికారి రాజయ్య పదవీ వీరమణ చేయడంతో ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె వసతి గృహాలపై దృష్టి సారించింది. వీటి నిర్వహణపై ఎప్పటికప్పుడు వార్డెన్‌లతో సమీక్షలు నిర్వహించారు. బీసీ వసతి గృహాల బిల్లులు ఈ నెల 26లోగా ఆన్‌లైన్ చేయాలని, మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపై వార్డెన్లకు కచ్చితమై ఆదేశాలు జారీ చేశారు. విధించిన గడువులోగా ఆన్‌లైన్ చేయని వార్డెన్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ‘సాక్షి’ లో కథనం ప్రచురితమైంది. దీనికి కొందరు వార్డెన్‌లు సమాధానం ఇస్తూ తమకు అసలే కంప్యూటర్ గురించి తెలియదు.. ఇప్పుడు ఆన్‌లైన్ చేయాలంటే ఎలా...? తమకు శిక్షణ కూడా ఇవ్వలేదంటూ... అధికారిణిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇందుకు తమకు నోటీసులు ఇస్తామంటే చేతులు ముడుచుకుని కూర్చోలేమని... నోటీసులు ఇస్తే కనుక తామంతా ఏకమై పలు ఆరోపణలు మోపి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, సదరు అధికారిణిని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. ఇటు బీసీ సంక్షేమ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు కూడా అధికారిణిపై సహాయ నిరాకరణ చేపట్టడంతో సంక్షేమ శాఖ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. విమలదేవి మెతక వైఖరి సంక్షేమ శాఖ ఉద్యోగులకు, వార్డెన్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో జరుగుతున్న సంక్షేమ శాఖ లొల్లి,చిలికి చిలికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకుని బీసీ సంక్షేమ శాఖ పరిస్థితిని చక్కదిద్దితే గాని వసతి గృహాల నిర్వహణ ముందుకు సాగేలా కనబడటంలేదు.
బీసీ సంక్షేమ శాఖలో లొల్లి
Published Wed, Oct 30 2013 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement