బహ్రెయిన్: తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో మహిళలు, హాజరయ్యారు. ఈసందర్భంగా మహిళలు, పిల్లలు బతుకమ్మ కోలాటం, ఆటపాటలతో అలరించారు. రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.
ఈ సందర్బంగా గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ ఆయన అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన సభ్యులకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను బహ్రెయిన్‌లో విస్తరింప చేయడానికి తమవంతు కృషి చేస్తామన్నారు.
ఈకార్యక్రమంలో గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్, బహ్రెయిన్ జాగృతి అధ్యక్షులు బరుకుంట్ల బాబురావు, ఉపాధ్యక్షులు మామిడాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు విజయ వర్ధన్, శ్రీనివాస్, సభ్యులు రవి, సుమన్, రాము, విజయసిందె, మహేష్, రాజేష్‌లు పాల్గొన్నారు.