హమ్మయ్య.. భారత చిన్నారి దొరికింది
మనామా: బహ్రెయిన్ లో భారత బాలిక కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఐదేళ్ల సారా ను కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు విడిపించడంతో 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం రాత్రి హూరా ప్రాంతంలో చిన్నారిని కిడ్నాప్ చేశారు. సారాను కారులో ఉంచి తల్లి మంచినీళ్ల బాటిల్ కొనుక్కురావడానికి వెళ్లగా దుండగులు కారుతో పాటు చిన్నారిని ఎత్తుకుపోయారు.
సారా తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పాపను విడిపించారు. నిందితులు బహ్రెయిన్ వ్యక్తి(38), ఆసియా మహిళ(37)గా వెల్లడించారు. వారి పేర్లు చెప్పలేదు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిచామని, 25 పహారా వాహనాలను రంగంలోకి దింపి కిడ్నాపర్లను పట్టుకున్నామని కాపిటల్ గవర్నేట్ పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది తెలిపారు. హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించామని చెప్పారు. సారాకు ఎటువంటి ముప్పు తలపెట్టలేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఆమె మేనమామ అనిశ్ చార్లెస్ తెలిపాడు. హూరా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి పాపను తమకు అప్పగించారని చెప్పారు.
తల్లిని చూడగానే సారా పరిగెత్తుకుని వెళ్లి ఆమెను అమాంతంగా కౌగిలించుకుంది. కూతుర్ని తల్లి గుండెలకు హత్తుకున్న దృశ్యాలు అక్కడున్న వారిని కదిలించాయి. సారా కిడ్నాప్ వెనుక ఆమె తండ్రి హస్తం ఉందని అనీశ్ చార్లెస్ అనుమానం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న సారా తండ్రి ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. వీరిద్దరికీ సారా ఒక్కతే సంతానం. కాగా, సారా కిడ్నాప్ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. చిన్నారిని సురక్షితంగా విడిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.