సాక్షి, కోరుట్ల: ‘అమ్మా..మంచిగుండుండ్రి..ఏం టెన్షన్ తీసుకోకు..సరేనా.? నేను పనిచేయలేక సచ్చిపోతలే..అమ్మా .. నా గుండెలో మొత్తం మంచిగ అనిపిస్తలేదు..చచ్చిపోవాలనిపిస్తుంది.. నన్ను ఇక్కడే కాలెస్తరో ఏమో నాకు తెల్వదు. నా కోసం ఎవ్వరు ఏడ్వకుండ్రి..సరేనా.. మంచిగుండుండ్రి.. అక్కలను మంచిగా చూసుకో.. అ మ్మా.. నన్ను క్షమించు అంటూ ఫోన్‌లో వాయిస్ రికా ర్డు చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం వెళ్లిన బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌కు చెందిన విట్టల వెంకటి–లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు నవీన్(22) ఆరు నెలల కిందట ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు.
అక్కడ లేబర్‌గా పనిచేస్తూ కొన్నాళ్లు బాగానే ఉన్నాడు. సోమవారం రాత్రి 7 గంటలకు అకస్మాత్తుగా తన గదిలో తాడుతో ఉరేసుకున్నాడు. ఆత్మహత్య కు ముందు తను మాట్లాడింది ఫోన్‌లో రికార్డు చేసి, దాన్ని తన తల్లికి పంపమని స్నేహితున్ని కోరాడు. అందులో తాను పనిచేయలేక ఆత్మహత్య చేసుకోవడం లేదని, మనసులో ఏదో బా ధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషాద స్వరంతో అక్కలను.. నాన్నను మంచిగ చూసుకోవాలని.. ఏడవొద్దని కోరాడు.
తన అంత్యక్రియలు బహ్రెయిన్‌లోనే చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేయడంతో నవీన్‌కు కరోనా సోకిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ భయంతోనే మానసిక ఆందోళనకు గురై, ఆత్మహత్య చేసుకున్నాడేమోననే చర్చ స్థానికంగా జరుగుతోంది. నవీన్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతదేహాన్ని స్వగ్రామం రప్పించాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కోరి నట్లు కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ తోట శారద తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment