వేధింపులకు గురిచేసిన బహ్రెయిన్ యజమాని నుంచి ఒక తెలుగు యువతి తప్పించుకుంది. మరో ఇద్దరు ఇండోనేసియన్ యువతులు కూడా ఆమె తరహాలోనే తమ యజమానుల నుంచి తప్పించుకున్నారు.
దుబాయి: వేధింపులకు గురిచేసిన బహ్రెయిన్ యజమాని నుంచి ఒక తెలుగు యువతి తప్పించుకుంది. మరో ఇద్దరు ఇండోనేసియన్ యువతులు కూడా ఆమె తరహాలోనే తమ యజమానుల నుంచి తప్పించుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డ ఈ ముగ్గురు యువతులూ ప్రస్తుతం బహ్రెయిన్ రాజ దాని మనామాలోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స పొందుతున్నట్లు ‘గల్ఫ్ న్యూస్’ దినపత్రిక మంగళవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి గతనెల బహ్రెయిన్‌లోని ఒక కుటుంబం వద్ద పనికి కుదిరిన అనూష అనే యువతి ఏజెంట్ల ద్వారా ఫోర్జరీ వీసాతో ఇక్కడకు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. తన వయసు 35 ఏళ్లు అని చెప్పుకొని ఆమె ఇక్కడకు వచ్చినా, ఆమె అసలు వయసు 19 ఏళ్లేనని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. తమ యజమానులు గొడ్డుచాకిరీ చేయించడంతో పాటు శారీరకంగా వేధించడంతో తాళలేక వారి నుంచి తప్పించుకున్నట్లు అనూషతో పాటు మిగిలిన ఇద్దరు ఇండోనేసియన్ యువతులు చెప్పారన్నారు. అనూషకు చెయ్యి, కాళ్లు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు వలస కార్మికుల రక్షణ సంఘం అధ్యక్షురాలు డయాస్ చెప్పారు.