నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన కొట్టూరి శ్రీకాంత్ రెండు నెలల కిందట విజిట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ విజిట్ వీసాపై వచ్చిన వారికి పని ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి. ఫలితంగా విజిట్ వీసా గడువు ముగిసేలోపు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. బహ్రెయిన్‌కు వెళ్లడానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయగా ఈ డబ్బును శ్రీకాంత్ నష్టపోవాల్సి వచ్చింది.
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఎండీ ఇబ్రహీం కొన్నేళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చి మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. అతనికి మరో రెండేళ్ల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ అక్కడి ప్రభుత్వ ఆధీనంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఏ) అనేక మంది వలస కార్మికుల వీసాలను అర్ధంతరంగా రద్దు చేసింది.
ఫలితంగా ఇబ్రహీం ఇంటికి వచ్చేశాడు. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బహ్రెయిన్‌లో పర్యాటక రంగం వృద్ధి చెందడంతో ఆ దేశానికి వెళితే ఏదో ఒక పని చేసుకోవచ్చని వలస కార్మికులు ఆశిస్తున్నారు. అదే ఆశతో విజిట్ వీసాపై వెళ్లిన శ్రీకాంత్ ఇంటి దారి పట్టగా, వర్క్ వీసాకు గడువున్నా ఇబ్రహీం కూడా బలవంతంగా ఇంటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వందలాది మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.
మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్‌లో ఉపాధి పొందవచ్చని భావిస్తున్న ఎంతో మంది వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమాన్‌ల మాదిరిగానే బహ్రెయిన్ కూడా ఎంతో మంది తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే ఇకనుంచి అది చరిత్రగానే మిగిలిపోనుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు, వలస కార్మికుల వీసాలను పర్యవేక్షించే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అనుసరిస్తున్న విధానాలతో బహ్రెయిన్‌లో ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి.
వారం, పది రోజుల వ్యవధిలోనే తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు దాదాపు రెండు వేలమంది బహ్రెయిన్ నుంచి ఇంటిదారి పట్టారని అంచనా. వర్క్ వీసాలను రద్దు చేయడం, విజిట్ వీసాలపై వెళ్లి పని వెతుక్కునేవారికి ఎల్‌ఎంఆర్‌ఏ ఇచ్చిన ఆదేశాలతో కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో ఉపాధి కరువైంది. బహ్రెయిన్ ప్రభుత్వం పునరాలోచన చేస్తే తప్పా ఆ దేశంలో వలస కార్మికుల ఉపాధికి అవరోధాలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహ్రెయిన్‌కు వెళ్లే ఆలోచన మానుకోవాలని వలస కార్మికుల సంఘాలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment