immigration problem
-
ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి
విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. చక్కటి ఉద్యోగం,మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో పొట్టచేత పట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. చివరికి అక్కడినుంచి ఎలా బైటపడ్డాడు? కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం రండి!కేరళలోని త్రివేండ్రంలోని పౌడికోణం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న గోపాలన్ గల్ఫ్ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో ఇల్లు వదిలాడు. 1983 ఆగస్టు 16న బహ్రెయిన్‌కు వెళ్లాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఏమైందంటే..గోపాలన్ బహ్రెయిన్‌కు చేరుకున్నాడో లేదో, అతని యజమాని అకాల మరణం చెందాడు. గోపాలన్ పాస్‌పోర్ట్ పోయింది. దీంతో గోపాలన్ అయోమయంలో పడిపోయాడు. ఇమ్మిగ్రేషన్ చిక్కులతో బహ్రెయిన్‌లో చిక్కుకు పోయాడు. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు.అయితే భారతదేశం, విదేశాలలో అన్యాయాన్నిఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు , జర్నలిస్టులతో కూడిన ప్రవాసీ లీగల్ సెల్ (PLC) అనే NGO ద్వారా అతని పాలిట వరంగా అవతరించింది. గోపాలన్ విషయం తెలుసుకుని అతనికి సాయపడింది. పీఎల్సీ బహ్రెయిన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునిలత్, తన బృందంతో కలిసి బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని, అష్టకష్టాలు పడి చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా చేశారు.ఫలించిన తల్లి ఎదురు చూపులు గోపాలన్ చివరకు 95 ఏళ్ల తల్లిని చూడటానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అలా కొడుకు కోసం ఆమె చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఒట్టి చేతులతో కేవలం ఎన్నో జ్ఞాపకాలు, మరెంతో కన్నీళ్లభారంతో స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంతో తిరిగి కలవాలనే కలతో విమాన మెక్కిన రోజు అతని జీవితంలో మరపురాని రోజుగా మిగిలిపోయింది. కాసింత దయ, మానవత్వం, న్యాయం, అవిశ్రాంత పోరాటం ఫలితంగా వచ్చిన ఫలితమిది. ఎంతోమంది వలసదారులకు ఆశలకు ప్రాణంపోసిన ఉదంతమిది. ‘స్వాగతం గోపాలన్, ఇంటికి స్వాగతం’ అంటూ పీఎల్సీ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. -
ముందస్తు హెచ్చరిక.. కనీసం ఏడు గంటలు ఆలస్యం కావొచ్చు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్లకు టోక్యో విమానాశ్రయం నుంచి సమస్యలు ఎదురు కావచ్చని, అన్నింటికీ సిద్ధపడి జపాన్ అధికారులకు సహకరించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. కరోనా నేపథ్యంలో విమానాశ్రయంలోనే ఆహారం, నీళ్లు లేకుం డా కనీసం ఏడు గంటల పాటు వేచి చూడాల్సి రావచ్చని, దీనిని సమస్యగా భావించరాదని ఆయన అన్నారు. టోక్యోలో ఇప్పటికే అడుగు పెట్టిన వివిధ దేశాల ఆటగాళ్లకు ఎదురైన అనుభవాన్ని, అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఈ విషయం చెబుతున్నట్లు బాత్రా స్పష్టం చేశారు. ‘చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు విమానాశ్రయంలోకి అడుగు పెట్టాక నాలుగు గంటల తర్వాతగానీ ఇమిగ్రేషన్ ప్రక్రియ మొదలు కాలేదు. ఆ తర్వాత తమ టీమ్ బస్సులోకి ఎక్కేందుకు వారికి మరో మూడు గంటలు పట్టింది. ఈ సమయంలో ఎలాంటి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. అసలు అక్కడ వలంటీర్లు అనేవాళ్లే లేరని జర్మనీ బృందం వెల్లడించింది. కాబట్టి గేమ్స్ విలేజ్ చేరుకునే వరకు మీరంతా ఇలాంటి సమస్యలకు మానసికంగా సిద్ధం కావాలనే ముందుగా చెబుతున్నాం. అసాధారణ పరిస్థితుల్లో ఈ క్రీడలు జరుగుతున్నందున చిరునవ్వుతోనే స్థానిక అధికారులకు సహకరించాలి. విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ టీమ్ బస్సు ఎక్కడానికి వీల్లేదు. దీనంతటికీ చాలా సమయం పట్టవచ్చు’ అని బాత్రా భారత క్రీడాకారులకు సూచించారు. -
వలస వాదులు మా జాబ్ లు కొల్లగొడుతున్నారు!
తిరువనంతపురం: వలస వాదులు-స్థానికుల రగడ ఏ ఒక్క దేశానికే పరిమితం అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఇరాక్ లో మిలిటెంట్ల ఆకస్మిక దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులకు స్థానికుల నుంచి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక వైపు మిలిటెంట్ల దాడి నుంచి ప్రాణాలు కాపాడు కోవాలా?లేక అక్కడ స్థానికుల్ని తమను తాము రక్షించుకోవాలా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇరాక్ లోని కుర్దిస్థాన్ లో చిక్కుకుపోయిన 47 మంది భారతీయులపై స్థానికంగా ఉన్న వారు దాడులకు పాల్పడుతున్నారు. దీనికి కారణం మాత్రం ఉద్యోగ సమస్య. తమ ఉద్యోగాలను ఎక్కడి నుంచో వచ్చిన భారతీయులు దోచుకుంటున్నారని వారు దాడులకు తెగబడుతున్నారు. ఉపాధి కోసం ఎడాది దేశం ఇరాక్ వెళ్లిన భారతీయులు అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంతో పాటు స్థానిక యుద్ధంతో అతలాకుతలమవుతున్నారు. మిలిటెంట్ల దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయం భయంగా కాలం గడుపుతున్న వారికి స్థానికుల నుంచి దాడులు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 'ఇక అక్కడ ఉండలేము. మమ్ముల్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి' అంటూ కేరళకు చెందిన ఓ కార్మికుడు ఐఏఎన్ఎస్ కు ఫోన్లో తన ఆవేదన వెల్లబుచ్చాడు. ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని బ్రతుకుతున్న తమపై ఇరాక్ వాసులు అతి దారుణంగా దాడులు చేస్తున్నారని ఏకరువు పెట్టాడు. ఇక్కడ సున్నీ వర్గానికి చెందిన తిరుగుబాటుదారుల నుంచి పెద్దగా ప్రమాదం లేకపోయినా.. స్థానికంగా ఉన్న వారి నుంచి తమకు ప్రమాదం ఉందని తెలిపాడు. ప్రస్తుతం తమ పనుల్ని నిలిపివేసి వారం రోజులకు పైగా అయ్యిందని, ఇక తిరిగి ఇండియా పయనమవ్వటం ఒక్కటే మార్గమని ఆ కార్మికుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.