తిరువనంతపురం: వలస వాదులు-స్థానికుల రగడ ఏ ఒక్క దేశానికే పరిమితం అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఇరాక్ లో మిలిటెంట్ల ఆకస్మిక దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులకు స్థానికుల నుంచి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక వైపు మిలిటెంట్ల దాడి నుంచి ప్రాణాలు కాపాడు కోవాలా?లేక అక్కడ స్థానికుల్ని తమను తాము రక్షించుకోవాలా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇరాక్ లోని కుర్దిస్థాన్ లో చిక్కుకుపోయిన 47 మంది భారతీయులపై స్థానికంగా ఉన్న వారు దాడులకు పాల్పడుతున్నారు. దీనికి కారణం మాత్రం ఉద్యోగ సమస్య. తమ ఉద్యోగాలను ఎక్కడి నుంచో వచ్చిన భారతీయులు దోచుకుంటున్నారని వారు దాడులకు తెగబడుతున్నారు.
ఉపాధి కోసం ఎడాది దేశం ఇరాక్ వెళ్లిన భారతీయులు అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంతో పాటు స్థానిక యుద్ధంతో అతలాకుతలమవుతున్నారు. మిలిటెంట్ల దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయం భయంగా కాలం గడుపుతున్న వారికి స్థానికుల నుంచి దాడులు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 'ఇక అక్కడ ఉండలేము. మమ్ముల్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి' అంటూ కేరళకు చెందిన ఓ కార్మికుడు ఐఏఎన్ఎస్ కు ఫోన్లో తన ఆవేదన వెల్లబుచ్చాడు. ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని బ్రతుకుతున్న తమపై ఇరాక్ వాసులు అతి దారుణంగా దాడులు చేస్తున్నారని ఏకరువు పెట్టాడు. ఇక్కడ సున్నీ వర్గానికి చెందిన తిరుగుబాటుదారుల నుంచి పెద్దగా ప్రమాదం లేకపోయినా.. స్థానికంగా ఉన్న వారి నుంచి తమకు ప్రమాదం ఉందని తెలిపాడు. ప్రస్తుతం తమ పనుల్ని నిలిపివేసి వారం రోజులకు పైగా అయ్యిందని, ఇక తిరిగి ఇండియా పయనమవ్వటం ఒక్కటే మార్గమని ఆ కార్మికుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.