ఇరాక్‌లో ఉన్న మహిళలకు సుంతీ చేయండి!
జెనీవా: ఐఎస్‌ఐఎల్ మిలిటెంట్లు ఇస్లాం పేరుతో ఆటవిక చర్యలకు దిగారు. ఇరాక్‌లో ప్రత్యేక ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రకటించుకున్నఐఎస్ఐఎల్ మిలిటెంట్లు 11 నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్న ఆడవారందరికీ సుంతీ చేయాలని ఫత్వా జారీ చేశారు. దీంతో సుమారు 40 లక్షల మంది ఆడవారిపై తీవ్ర ప్రభావం పడనుందని ఇరాక్‌లో ఐక్యరాజ్యసమితి సీనియర్ ఉన్నతాధికారి జాక్వెలిన్ బాడ్‌కాక్ గురువారం వెల్లడించారు.
ఇరాక్‌లో జరుగుతున్న యుద్ధంలో మోసుల్ పట్టణం సహా అనేక కీలక ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్న ఐఎస్‌ఐఎస్ జిహాదిస్టులు ఇస్లాంకు తమదైన భాష్యం చెబుతూ ఫత్వా జారీ చేశారని ఆమె తెలిపారు. ఇరాక్‌లో ఇంతకుముందు ఆడవారికి సుంతీ చేయడం అనేది ఎక్కడో కొన్ని మారుమూల చోట్ల తప్ప పెద్దగా లేదని పేర్కొన్నారు. ఇరాక్‌లో బాలికలు, మహిళలకు సుంతీ చేయాలంటూ ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు ఫత్వా జారీ చేయడాన్ని భారతీయ ముస్లిం మతపెద్దలు తీవ్రంగా ఖండించారు. అలాంటి చర్యలు ఇస్లాంకు వ్యతిరేకమని శుక్రవారం స్పష్టం చేశారు.