న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్లకు టోక్యో విమానాశ్రయం నుంచి సమస్యలు ఎదురు కావచ్చని, అన్నింటికీ సిద్ధపడి జపాన్ అధికారులకు సహకరించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. కరోనా నేపథ్యంలో విమానాశ్రయంలోనే ఆహారం, నీళ్లు లేకుం డా కనీసం ఏడు గంటల పాటు వేచి చూడాల్సి రావచ్చని, దీనిని సమస్యగా భావించరాదని ఆయన అన్నారు. టోక్యోలో ఇప్పటికే అడుగు పెట్టిన వివిధ దేశాల ఆటగాళ్లకు ఎదురైన అనుభవాన్ని, అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఈ విషయం చెబుతున్నట్లు బాత్రా స్పష్టం చేశారు.
‘చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు విమానాశ్రయంలోకి అడుగు పెట్టాక నాలుగు గంటల తర్వాతగానీ ఇమిగ్రేషన్ ప్రక్రియ మొదలు కాలేదు. ఆ తర్వాత తమ టీమ్ బస్సులోకి ఎక్కేందుకు వారికి మరో మూడు గంటలు పట్టింది. ఈ సమయంలో ఎలాంటి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. అసలు అక్కడ వలంటీర్లు అనేవాళ్లే లేరని జర్మనీ బృందం వెల్లడించింది. కాబట్టి గేమ్స్ విలేజ్ చేరుకునే వరకు మీరంతా ఇలాంటి సమస్యలకు మానసికంగా సిద్ధం కావాలనే ముందుగా చెబుతున్నాం. అసాధారణ పరిస్థితుల్లో ఈ క్రీడలు జరుగుతున్నందున చిరునవ్వుతోనే స్థానిక అధికారులకు సహకరించాలి. విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ టీమ్ బస్సు ఎక్కడానికి వీల్లేదు. దీనంతటికీ చాలా సమయం పట్టవచ్చు’ అని బాత్రా భారత క్రీడాకారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment