బ్రెయిన్‌ డైట్‌  | The weight of the brain in our body weight is just 2 percent | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ డైట్‌ 

Published Thu, Feb 28 2019 3:32 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

The weight of the brain in our body weight is just 2 percent - Sakshi

మెదడుకు మనం చెబుతామా? మనకు మెదడు చెబుతుందా? ఇది పెద్ద పజిల్‌! మనం ఏమి తినాలో, ఏవి రుచిగా ఉంటాయో, ఏది హానికరమో, ఏది శ్రేష్ఠమో మనకు చెప్పేది బ్రెయినే! అయితే పరీక్షల టైమ్‌లో పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి వారు ఏమి తినాలో మెదడుకు ఎక్కించేదే 

ఈ కథనం.
పిల్లల పరీక్షల సీజన్‌ ఇది. చదివిందంతా గుర్తుపెట్టుకోవాలని అటు పిల్లలకూ ఉంటుంది. ఇటు తల్లిదండ్రులదీ అదే కోరిక. ఎగ్జామ్స్‌లో వాళ్ల బ్రెయిన్‌ చురుగ్గా పనిచేయాలని కూడా అటు పిల్లలూ, ఇటు పేరెంట్స్‌ కోరుకుంటారు. చదివిందీ, విన్నదీ, చూసింది గుర్తుపెట్టుకోవలసిన విజ్ఞానానికి భాండాగారమే మెదడు. కేవలం అలా చదివేసి మెదడులో నిక్షిప్తం చేసుకుంటే చాలదు... అలా దాచుకున్నది కాస్తా అవసరమైనప్పుడు టక్కున స్ఫురించాలి. స్ఫురించింది పూర్తిగా వరుసగా గుర్తుకురావాలి. అప్పుడే గుర్తుకొచ్చిన ఆ విషయాలను పిల్లలు పరీక్ష పేపర్‌ మీద రాయగలుగుతారు. చురుగ్గా ఉన్న మెదడే ఇలా విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవడం... అలా చేసుకున్నదాన్ని అవసరమైనప్పుడు బయటకు తీయడం చేస్తుంది. మరి మన పిల్లల మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండటానికి, దీర్ఘకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి వారు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో మరో మాటగా చెప్పాలంటే పేరెంట్స్‌ వారికి పెట్టాల్సిన ఫుడ్‌ ఎలా ఉండాలో తెలుసుకుందాం. 

ముందుగా మెదడు గురించి సంక్షిప్తంగా... 
మన శరీరం బరువులో మెదడు బరువు కేవలం 2 శాతం. కానీ ఒంటికి అందే ఆక్సిజన్‌లో దానికి 20 శాతం కావాలి. శరీరం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే కావాలి. దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. పిల్లలు మొదలుకొని మన వరకూ అందరమూ విజ్ఞానాన్నంతా మెదడు కణాల్లోనే నిక్షిప్తం చేసుకుంటాం. మనం చదివిందంతా  బాగా గుర్తుండిపోవాలంటే మాటిమాటికీ మననం చేసుకుంటాం. అప్పుడది తాత్కాలిక జ్ఞాపకం నుంచి శాశ్వత జ్ఞాపకంలోకి మారిపోతుంది. మనం అప్పటికే ఏర్పరచుకున్న జ్ఞాపకాలతో మెదడులో ఒక లైబ్రరీ ఏర్పడుతుంది. ఏదైనా కొత్త విషయం వస్తే అది మదిలో పదిలంగా ఉందా లేదా అన్నది మెదడు చెక్‌ చేసుకుంటుంది. ఒకవేళ అది లేకపోతే ఆ లైబ్రరీలోని కొత్త పుస్తకంలా నిల్వ చేసుకుంటుంది. ఉన్నదే అయితే అది మరోసారి అప్‌డేట్‌ అవుతుంది.

గుర్తుంచుకోవడం అంటే ఏమిటి? అదెలా జరుగుతుంది? 
ఏదైనా సంఘటననుగానీ, సమాచారాన్ని గాని... మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటాం. గుర్తుంచుకోవడం అన్నది మామూలుగానే జరుగుతుందని అనిపిస్తుంటుంది.  కానీ చాలాకాలం గుర్తుంచుకోవాలంటే కొంత ధారణ అవసరం. ఒక సంఖ్య గానీ, పదం గానీ మనకు ఎప్పుడూ అవసరం అనుకోండి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి అనుకోండి. అప్పుడు మనం దాన్ని కాస్త ప్రయత్నపూర్వకంగా మనసులో నిక్షిప్తమయ్యేలా చేస్తాం. అవసరాన్ని బట్టి కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం. దీన్నే షార్ట్‌ టర్మ్‌ మెమరీ అంటాం.

ఈపనిని మెదడులోని టెంపోరల్‌ లోబ్‌ ప్రాంతంలోని హిప్పోక్యాంపస్‌ అనే భాగం చేస్తుంది. ఒక సమాచారం చాలా సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేదయితే దాన్ని సుదీర్ఘకాల జ్ఞాపకం (లాంగ్‌ టర్మ్‌ మెమరీ) అంటాం. ఇలా లాంగ్‌ టర్మ్‌ మెమరీ అంటా మెదడులోని నియోకార్టెక్స్‌ అనే భాగంలో నిక్షిప్తమవుతుంది. అవసరమైనప్పుడు అక్కడినుంచి మనం గుర్తుతెచ్చుకుంటాం. ఇలా జ్ఞాపకం పెట్టుకోవడంతో పాటు అవసరమైనప్పుడు గుర్తుతెచ్చుకోవడానికి మెదడు చురుగ్గా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన మంచి ఆహారాలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. మంచి ఆహారాలు అంటే సమతౌల్యంగా ఉండే అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మైక్రోన్యూట్రియెంట్ల వంటివి. చెడు ఆహారాలు మెదడును మందకొడిగా చేస్తాయి. జంక్‌ఫుడ్, కోలాడ్రింక్స్, పరిమితి దాటినప్పుడు కాఫీ, టీల వంటివి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. 

మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఆహారాలు... 
కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌: మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దాని పనిలో సునిశితత్వం, వేగం ఉండాలంటే ముందుగా శరీరం నుంచి కనీసం 15 శాతం తీసుకునే దానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ సరిగా అందాలి. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్‌ కార్బోహడ్రేట్స్‌. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి  పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లలో మనం తీసుకోదగ్గ వాటిలో ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్‌ తక్షణం వినియోగితమైపోతుంది. ఆ తర్వాత మళ్లీ గ్లూకోజ్‌ అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్‌ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది. 

ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ (అత్యవసరమైన కొవ్వులు)
 కొవ్వులు పరిమిత మోతాదుకు మించితే ఒంటికీ, ఆరోగ్యానికీ మంచివి కాదన్న విషయం తెలిసిందే. కానీ మెదడు చురుగ్గా పనిచేయడానికి మాత్రం పరిమిత స్థాయిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కావాల్సిందే. అందుకే మెదడుకు అవసరమైన కొవ్వులను ‘ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌’ అంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సాంకేతికంగా చూస్తే మెదడు కణాలన్నీ ‘కొవ్వు’ పదార్థాలే! మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని విధిగా ఆహారం నుంచి స్వీకరించాల్సిందే. ఎసెన్షియల్‌ ఫ్యాటీఆసిడ్స్‌ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి వాటితోపాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి. 

ఏ కొవ్వులు మెదడుకు మంచిది కాదు?
మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని కొవ్వులూ మెదడుకు మంచిది కాదు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా చేస్తాయి. సాంకేతిక పరిభాషలో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అని పిలిచే హైడ్రోజినేటెడ్‌ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ను  అడ్డుకుంటాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ హైడ్రోజనేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారుచేసే కేక్‌లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అలాగే షెల్ఫ్‌ లైఫ్‌ ఎక్కువగా ఉంచడం కోసం వాడే మార్జరిన్‌ వంటి కృత్రిమ నూనెలు మంచివి కాదు. 

తినుబండారాలు కొనే సమయంలో జాగ్రత్త: మనం మార్కెట్‌లో కొనే పదార్థాలపై ఉండే పదార్థాల జాబితా పరిశీలించి, అందులో హైడ్రోజనేటెడ్‌ ఫ్యాట్స్‌/ఆయిల్స్‌ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. మెదడుకు అవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌) కోసం చేపలు ఎక్కువగా తినాలి. శాకాహారులు ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆలివ్‌ ఆయిల్‌ వంటి నూనెలపై ఆధారపడవచ్చు. 

అమైనో యాసిడ్స్‌: మెదడులోని అనేకకణాల్లో ఒకదానినుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే మెదడులోని అంశాలను  న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ అంటారు. ఇదెంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇందుకు దోహదపడేవే ‘అమైనో యాసిడ్స్‌’. మనకు  ప్రోటీన్స్‌నుంచి ఈ అమైనో యాసిడ్స్‌ లభ్యమవుతాయి. 
ఇక ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్‌పైనే మనందరి మూడ్స్‌ ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు నిద్ర బాగా పట్టాలంటే సెరటోనిన్‌ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ అవసరం. ఈ ట్రిప్టోఫాన్‌ పాలలో పుష్కలంగా ఉంటుంది.

అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. పిల్లలు చదివిందంతా షార్ట్‌ టర్మ్‌ మెమరీ నుంచి లాంగ్‌ టర్మ్‌ మెమరీలోకి నిక్షిప్తం కావడమనే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పిల్లల్లో మంచి జ్ఞాపకశక్తి ఉండాలంటే, వారికి నిద్ర కూడా అవసరమైనంతగా ఉండాలి. అందుకు ట్రిఫ్టొఫాన్‌ బాగా దోహదం చేస్తుంది. అందుకే వారికి రాత్రి పడుకోబోయే ముందర గోరువెచ్చని పాలు ఇవ్వడం చాలా మంచిది. 

విటమిన్లు / మినరల్స్‌ (ఖనిజలవణాలు): మన మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు. ఇవి అమైనో యాసిడ్స్‌ను న్యూరోట్రాన్స్‌మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చడంలోనూ విశేషంగా తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి బీకాంప్లెక్స్‌లోని బి1, బి6, బి12 ప్రధానంగా అవసరమవుతాయి. ఇవి  తాజాకూరగాయల్లో, ఆకుపచ్చని ఆకుకూరల్లో, పాలలో పుష్కలంగా ఉంటాయి.

అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి12 మాంసాహారంలోనే ఎక్కువ. అయితే ఇటీవల స్ట్రిక్ట్‌ వెజిటేరియన్‌ పదార్థాలు మాత్రమే తీసుకునే ఇండ్లలోని పిల్లలకు, ఎండకు సోకని చిన్నారుల్లో విటమిన్‌ ‘డి’ లోపించే అవకాశాలు ఎక్కువ. ఆధునిక జీవనశైలి వల్ల ఇప్పుడీ కండిషన్‌  చాలామందిలో చోటుచేసుకుంటోంది. ఇలాంటివారు విధిగా విటమిన్‌ డితో పాటు విటమిన్‌ బి12 పాళ్లను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్‌–ఈ కూడా పిల్లల్లో నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది. 

నీళ్లు : మెదడులోని ఘనపదార్థమంతా కొవ్వులే అయితే... మొత్తం మెదడును తీసుకుంటే అందులో ఉండేది 80 శాతం నీళ్లే. మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మీకు తెలుసా...? మనం మనమూత్రం ద్వారా, ఉచ్ఛాసనిశ్వాసల ద్వారా ఒక రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం అవసరం. దీనికోసం అంత నీటినీ తీసుకోవాలి. ఇక  తక్కువ మోతాదులో నీళ్లు తీసుకునే వారైనా కనీసం 1.5 లీటర్లను తీసుకోవాలి. (మిగతాది మనం తీసుకునే ఘనాహారంలోంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటినుంచి భర్తీ అవుతుంది.

రోజువారీ తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం తగ్గుతుంది. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది మన అందరి మూడ్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రోజూ 6–8 గ్లాసుల నీళ్లతోపాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు (ఈ పండ్లరసాల్లో చక్కెర వేయడం సరికాదు. చక్కెర ఎక్కువైనా అది మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది), రాగిజావ వంటివి మెదడును చురుగ్గా ఉంచే ద్రవాహారాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి... పిల్లలు తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకునేలా చూడండి. ఇది పిల్లలతోపాటు అందరికీ అవసరం. పరీక్షలకు వెళ్తున్న పిల్లలకు మరీ ఎక్కువ అవసరం. 

మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్‌.... 
మంచి జ్ఞాపకశక్తి కోసం జింక్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. దాంతోపాటు విటమిన్‌–బి6, విటమిన్‌ బి12, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా తాజా పళ్లు అంటే... ద్రాక్ష, అన్ని నిమ్మజాతి (సిట్రస్‌) పళ్లు, యాపిల్స్, ప్లమ్స్, బెర్సీస్, దానిమ్మ వంటివి, కూరగాయలు, ఆకుకూరలు, పొట్టు తీయని గోధుమ, రాగి, జొన్న, మొక్కజొన్న వంటి ధాన్యాలు, చిక్కుళ్లు, పాలు వంటి ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. మాంసాహారంలోనూ ఇవి ఉంటాయి. ఇక జింక్‌ ఎక్కువగా మాంసాహారం, సీఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్‌ కోసం పాలపై ఆధారపడవచ్చు. మెదడుకు మేలు చేసే ఆహారాలు: నేరుగా చెప్పాలంటే మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే ఈ కిందివి వారు తినే ఆహారంలో ఈ కింది అంశాలు/పదార్థాలు ఉండేలా చేసుకోండి. 

 పండ్లలో: మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. 

ఆకుకూరలు: కూరగాయల్లో పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్‌రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. 

వీటితోపాటు డార్క్‌/బిట్టర్‌ చాకొలెట్, గ్రీన్‌ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి. 
చేపల్లో: పండుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్‌)... వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువ. 

మెదడుకు హాని చేసే ఆహారాలు : టీ, కాఫీలు డీహైడ్రేషన్‌... అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే అవి చాలా పరిమితంగా (రోజుకు రెండు కప్పులు) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే అది మెదడును ముందుగా చురుగ్గా చేస్తుంది. అయితే ఈ చర్యవల్ల మెదడు వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌వల్ల కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. 

►ఉప్పు ఒంట్లోని నీటిని తొలగించి డిహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్‌ సూప్స్‌ మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగానే  తీసుకోవాలి.  

►మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతోపాటు మెదడుకూ అది చేటు చేస్తుంది. అది జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని మందకొడిగా మారుస్తుంది. కాబట్టి తక్కువ ఉప్పు తీసుకునేలా పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం మంచిది.

►కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలనే  తీసుకోవాలి. బటర్, క్రీమ్‌ కూడా పరిమితంగా తీసుకునేలా చూడాలి.

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి, 
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం. 12,
బజారాహిల్స్,హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement