సంగీత కళానిధి కేవీ రెడ్డి కన్నుమూత
విజయవాడ, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు కేవీ రెడ్డి(89) హృదయ సంబంధిత వ్యాధితో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మించిన ఈయన విజయనగరం మహరాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు వద్ద వయోలిన్‌లో మెళకువలు నేర్చుకున్నారు.
విజయవాడ, విజయనగరాల్లో సంగీత అధ్యాపకునిగా పనిచేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తూరు బాలసుబ్రహ్మణ్యం పిళ్ళే, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ వంటి ప్రముఖులకు వాద్య సహకారాన్ని అందించారు. ఆకాశవాణిలో పలు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. సలహా సంఘ సభ్యునిగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంగీత అభిమానుల అశృనయనాల మధ్య మంగళవారం కేవీ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.