hormonal
-
గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా?
గ్రాముల్లో తింటున్నా కిలోల్లో పెరిగిపోతున్నారా?సన్నగా తిన్నా లావెక్కిపోతున్నారా?...చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? నిష్కారణంగా కుంగిపోతున్నారా? అనవసరంగా చిర్రుబుర్రులాడుతున్నారా?...ఇందులో మీ తప్పేమీ లేదు. ఇదంతా థైరాయిడ్ తెచ్చిపెట్టిన ముప్పు కావచ్చు. అలాగని కంగారు పడకండి. వైద్యులను సంప్రదించి, పరీక్షలు జరిపించుకోండి. చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుకోండి. థైరాయిడ్ సమస్యలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే అసమతుల్యతల కారణంగా వచ్చే సమస్యల్లో హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్ ప్రధానమైనవి. హైపర్ థైరాయిడిజమ్‌తో పోలిస్తే హైపో థైరాయిడిజమ్‌తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో దాదాపు 4.20 కోట్ల మందికి పైగా హైపో థైరాయిడిజమ్ బాధితులు ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే మన దేశంలో ప్రతి పదిమంది వయోజనుల్లో ఒకరు హైపో థైరాయిడిజమ్ బాధితులేనని చెప్పవచ్చు. గడచిన ఇరవై ఏళ్లలో భారత్‌లో హైపో థైరాయిడిజమ్ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. మన దేశ జనాభాలో దాదాపు 11 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే, అమెరికాలో 4.6 శాతం, బ్రిటన్‌లో 2 శాతం మంది మాత్రమే ఈ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య మన దేశంలో మరింత ఎక్కువగానే ఉండవచ్చని, చాలామంది ఎలాంటి పరీక్షలూ చేయించుకోకుండానే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తూ ఉంటారని, వేరే ఏ జబ్బుతోనో బాధపడి ఆస్పత్రికి చేరితే, వైద్యుల సూచనతో జరిపించుకునే పరీక్షల్లో థైరాయిడ్ సమస్యలు బయటపడటం మన దేశంలో సర్వసాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ గురించి, దాని పనితీరు గురించి, పనితీరులో తలెత్తే లోపాలు, వాటి వల్ల తలెత్తే సమస్యల గురించి, థైరాయిడ్ సమస్యల నియంత్రణ, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం. కొలిమిలా పనిచేస్తుంది థైరాయిడ్ గ్రంథి నిరంతరం కమ్మరి కొలిమిలా పనిచేస్తూ ఉంటుంది. ఒకే వేగంతో ఎప్పుడూ ఒకేలా శరీరంలోని కోటాను కోట్ల కణాలన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటుంది. థైరాయిడ్ పనితీరులో ఏమాత్రం వేగం తగ్గినా స్థూలకాయం వస్తుంది. ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపిస్తుంది. అలసట ముంచుకొస్తుంది. కదలికలు మందగిస్తాయి. థైరాయిడ్ పనితీరులో వేగం కాస్తంత పెరిగితే మాత్రం విపరీతంగా ఆకలి వేస్తుంది. అయితే, ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపోతుంది. కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా అవుతాయి. కనురెప్పలు మూసినా మూసుకుపోనట్లుగా కనుగుడ్లు బయటకు కనిపిస్తుంటాయి. అస్థిమితంగా, చూడటానికి మానసిక రోగిలా తయారవుతారు. థైరాయిడ్ గ్రంథి చిన్న స్థలంలో నెలకొల్పిన పెద్ద రసాయనిక కర్మాగారంలా పనిచేస్తుంది. దీని నుంచి అత్యంత సంక్లిష్ట రసాయనాలు ఉత్పత్తవుతూ ఉంటాయి. దీని నుంచి వెలువడే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లో మూడింట రెండో వంతు అయొడిన్ ఉంటుంది. థైరాయిడ్ పనితీరు సజావుగా సాగడానికి గ్రాములో ఐదువేలవ వంతు పరిమాణంలో అయొడిన్ ప్రతిరోజూ అవసరమవుతూ ఉంటుంది. థైరాయిడ్ నుంచి వెలువడే హార్మోన్ల మోతాదు అతి తక్కువ. అయితే, అవి చాలా శక్తిమంతమైనవి. మెదడులో ఉండే హైపో థాలమస్, పిట్యూటరీ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి పనితీరు సజావుగా సాగడానికి దోహదపడుతూ ఉంటాయి. థైరాయిడ్‌ను ప్రేరేపించడానికి పిట్యూటరీ గ్రంథి థైరోట్రోపిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. పిట్యూటరీ గ్రంథి ఈ హార్మోన్‌ను స్రవించేలా దానిని హైపో థాలమస్ గ్రంథి ప్రేరేపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి నరాలపై ప్రభావం చూపుతుంది. దీని పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి కాస్త ఎక్కువ మోతాదులో హార్మోన్లను విడుదల చేస్తుంది. తీవ్ర విషాదం, ఆందోళన వంటివి కలిగినప్పుడు హైపోథాలమస్ అతిగా పనిచేస్తుంది. దాని ప్రభావంతో థైరాయిడ్ కూడా మోతాదుకు మించి హార్మోన్లు విడుదల చేసి, రకరకాల శారీరక, మానసిక వ్యాధులకు కారణమవుతుంది. వీటితో అయొడిన్ లోపానికి చెక్ సముద్రపు చేపలూ, సముద్ర తీరానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయొడిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీనదాలు ఉన్నచోట నివసించేవారు సముద్రపు ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందుకంటే అక్కడ ప్రవహించే హిమనీ నదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్ కొట్టుకుపోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు తప్పనిసరిగా అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. అయొడిన్ లోపం లేకుండా చూసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. పరిమాణంలో చిన్నది.. ప్రభావంలో పెద్దది... థైరాయిడ్ గ్రంథి ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టూ ఆవరించుకుని, గులాబి రంగులో చూడటానికి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. దీని బరువు ఇరవై గ్రాములు మాత్రమే. ఇది స్రవించే హార్మోన్ పరిమాణం మరీ మరీ తక్కువ. ఎంత తక్కువంటే, కనీసం కంటికి ఆననంత. కచ్చితమైన లెక్కల్లో చెప్పాలంటే, ఒక గ్రామును 28 లక్షల భాగాలు చేస్తే, ఒక్కో భాగం ఎంత ఉంటుందో, అంతే పరిమాణంలో థైరాయిడ్ గ్రంథి హార్మోన్‌ను స్రవిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచే థైరాయిడ్ గ్రంథి ఒక క్రమ పద్ధతిలో పని చేసుకుంటూ పోతుంది. శిశువు పుట్టినప్పుడు ఒకవేళ థైరాయిడ్ గ్రంథి సజావుగా పని చేయకుంటే, మందపాటి పెదవులు, చప్పిడి ముక్కు వంటి అవయవ లోపాలతో పాటు, బుద్ధిమాంద్యం వంటి మానసిక లోపాలూ ఏర్పడతాయి. చిన్నగా కనిపించే థైరాయిడ్ గ్రంథి మొత్తం శరీరంలోని జీవక్రియల వేగం ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది. ఇందులో ఎలాంటి లోపాలు ఏర్పడినా, మొత్తం జీవక్రియల్లోనే తేడాలు వస్తాయి. థైరాయిడ్ పనితీరు మందగించడం వల్ల తలెత్తే లోపాన్ని ‘హైపో థైరాయిడిజమ్’ అని, థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల తలెత్తే లోపాన్ని ‘హైపర్ థైరాయిడిజమ్’ అని అంటారు. పెరిగినా తగ్గినా ప్రమాదమే... థైరాయిడ్ పనితీరులో వేగం పెరిగినా, తరిగినా ప్రమాదమే. థైరాయిడ్ పనితీరు మందగిస్తే, దీని నుంచి వెలువడే హార్మోన్ల పరిమాణం తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు మందగించడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అయొడిన్ లోపం ఒకటి. గడచిన ఇరవయ్యేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అయొడైజ్డ్ ఉప్పు వాడకం మొదలైన తర్వాత అయొడిన్ లోపం కారణంగా థైరాయిడ్ పనితీరు మందగించిన సందర్భాలు తక్కువగానే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్‌ను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి రోగ నిరోధక శక్తి ఎదురు తిరగడం వల్ల థైరాయిడ్ పనితీరు మందగిస్తే, ఆ పరిస్థితిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌గా గుర్తించాల్సి ఉంటుంది. జన్యు కారణాల వల్ల థైరాయిడ్ పనితీరులో తేడాలు రావడం చాలా అరుదు. థైరాయిడ్ గ్రంథికి తగిన మోతాదులో అయొడిన్ అందకుంటే, దీని పరిమాణం బాగా పెరిగిపోయి, గొంతు వద్ద బాగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితినే ‘గాయిటర్’ అంటారు. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం మొదలుపెడుతుంది. థైరాయిడ్‌కు అందే అయొడిన్ మోతాదు పెరిగినప్పుడు కూడా దాని పరిమాణం అమాంతంగా పెరిగిపోతుంది. పిట్యూటరీ గ్రంథి మీద కణితి పెరిగితే, థైరోట్రోపిన్ ఉత్పత్తి మోతాదుకు మించి విడుదలవడం వల్ల కూడా ఇలాంటి దుస్థితి దాపురిస్తుంది. దీనినే ‘టాక్సిక్ గాయిటర్’ అంటారు. థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే లోపాలను సరిదిద్దేందుకు చాలా సందర్భాల్లో మందులు ఇస్తారు. ఒక్కోసారి థైరాయిడ్‌కు క్యాన్సర్ కూడా రావచ్చు. అరుదైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. పూర్తిగా తొలగించాల్సి వస్తే, థైరోట్రోపిన్ లోపాన్ని భర్తీ చేసేందుకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ పనితీరు మందగించడం వల్ల తలెత్తే హైపో థైరాయిడిజమ్ సమస్యకు కూడా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల తలెత్తే హైపర్ థైరాయిడిజమ్ సమస్యకు మాత్రం క్లినికల్ కండిషన్స్ బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు సాధారణంగా పురుషుల కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఈనాటివి కావు థైరాయిడ్ సమస్యలకు చెందిన పేర్లు ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చినా, నిజానికి ఈ సమస్యలు ఈనాటివి కావు. క్రీస్తుపూర్వమే థైరాయిడ్ పనితీరులోని లోపాల వల్ల తలెత్తే సమస్యలను ప్రాచీన వైద్యులు గుర్తించారు. వాటి నివారణకు తమవంతు ప్రయత్నాలూ చేశారు. క్రీస్తుపూర్వం 16వ శతాబ్దికి చెందిన చైనా వైద్యులు థైరాయిడ్ సమస్యల చికిత్స కోసం సముద్రపు నాచును, స్పాంజిని ఉపయోగించేవారు. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దికి చెందిన భారతీయ వైద్యుడు సుశ్రుతుడు తన ‘సుశ్రుత సంహిత’ గ్రంథంలో థైరాయిడ్ లోపాల వల్ల తలెత్తే హైపో థైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, ఈ గ్రంథి వాపు వల్ల ఏర్పడే ‘గాయిటర్’ వంటి వ్యాధుల లక్షణాలను విపులంగా వివరించాడు. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన అరిస్టాటిల్, జెనోఫోన్ వంటి వారు తమ రచనల్లో హైపర్ థైరాయిడిజమ్ వల్ల తలెత్తే ‘గ్రేవ్స్ డిసీజ్’ వ్యాధి లక్షణాలను వివరించారు. వాళ్లందరూ వ్యాధులను, వ్యాధి లక్షణాలను దాదాపు సరిగానే గుర్తించగలిగినా, ఆ లక్షణాలకు మూలం థైరాయిడ్ గ్రంథిలోనే ఉన్న సంగతిని గ్రహించలేకపోయారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి హిపోక్రాట్స్, ప్లాటో వంటి వారు థైరాయిడ్ గ్రంథి ఉనికిని గుర్తించారు. అయితే, వాళ్లు థైరాయిడ్ గ్రంథిని కేవలం లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథిగా పొరబడ్డారు. నాటి వైద్యులకు థైరాయిడ్ గ్రంథి కనీసం ఎలా ఉంటుందో కూడా తెలియదు. క్రీస్తుశకం పదిహేనో శతాబ్దికి చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సి తొలిసారిగా థైరాయిడ్ గ్రంథి చిత్రాన్ని ప్రపంచానికి అందించాడు. థైరాయిడ్ గ్రంథి వాపు వల్ల వచ్చే ‘గాయిటర్’కు థైరాయిడ్ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడమే (థైరాయిడెక్టమీ) తగిన పరిష్కారమని క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందిన పర్షియన్ వైద్యుడు అలీ ఇబ్న్ అబ్బాస్ అల్ మగుసి తన రచనల్లో సూచించాడు. క్రీస్తుశకం 1656లో ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు, శరీర శాస్త్రవేత్త థామస్ వార్టన్ ఈ గ్రంథికి ‘థైరాయిడ్’గా నామకరణం చేశాడు. ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త బెర్నార్డ్ కోర్టోయిస్ 1811లో అయొడిన్‌ను కనుగొంటే, థైరాయిడ్ గ్రంథి పనితీరులో ఇదే కీలకమైన మూలకమని జర్మన్ శాస్త్రవేత్త యూజన్ బామన్ 1896లో గుర్తించాడు. వేలాది గొర్రెల నుంచి సేకరించిన థైరాయిడ్ గ్రంథులను బాగా ఉడికించి, సేకరించిన పదార్థానికి అతడు ‘అయొడో థైరిన్’గా పేరు పెట్టాడు. ఇది జరిగిన కొన్నేళ్లకు అమెరికన్ వైద్యుడు డేవిడ్ మెరైన్ 1907లో థైరాయిడ్ పనితీరుకు అయొడిన్ అత్యవసరమని నిర్ధారణ చేశాడు. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లలో కీలకమైన థైరాక్సిన్‌ను 1914లో కనుగొన్నారు. ఆ తర్వాత 1952లో థైరాయిడో థైరాక్సిన్‌ను, 1970లో టి–4, టి–3 హార్మోన్లను గుర్తించారు. అదే ఏడాది అమెరికాకు చెందిన పోలిష్ వైద్యుడు ఆండ్రూ షెల్లీ టీఆర్‌హెచ్ హార్మోన్‌ను గుర్తించాడు. ఈ పరిశోధనకు ఫలితంగా ఆయన 1977లో నోబెల్ బహుమతిని పొందాడు. థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లను నిర్దిష్టంగా గుర్తించిన తర్వాత, థైరాయిడ్ సమస్యలకు అందించే వైద్య చికిత్స ప్రక్రియలు చాలా వరకు మెరుగుపడ్డాయి. జాతీయాలు అగ్రహారంలో తంబళ జోస్యం అగ్రహారం అంటే పండితులకు రాజులు, సంస్థానాధీశులు దానంగా ఇచ్చిన గ్రామం. సాధారణంగా అగ్రహారాల్లో ఉండేవారంతా మహా పండితులు, సకల శాస్త్ర కోవిదులు. తంబళ అంటే శివార్చనతో పొట్ట పోసుకునే పూజారి. శివాలయంలో అర్చనకు తగిన స్తోత్రాలు నోటికి రావడం తప్ప తంబళకు శాస్త్ర పాండిత్యం శూన్యం. అలాంటి తంబళ ఒకడు వెనకటికి ఒకనాడు అగ్రహారానికి వెళ్లి, అక్కడ తనకున్న మిడిమిడి జ్ఞానంతో జనాలకు జోస్యం చెప్పబోయి నవ్వులపాలయ్యాడట. అసాధారణ ప్రజ్ఞావంతుల ఎదుట మిడిమిడి జ్ఞానం ఉన్న అల్పులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి నవ్వులపాలయ్యే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అందితే జుట్టు, అందకుంటే కాళ్లు ఎలాగైనా అనుకున్న పనిని సాధించుకునే వాళ్లను ఉద్దేశించి వ్యాప్తిలోకి వచ్చిన జాతీయం ఇది. కొందరికి తలచిన పనిని సాధించుకోవడం మాత్రమే ముఖ్యం. తలపెట్టిన పనిని సాధించుకోవడానికి వాళ్లు ఎలాంటి మార్గాన్నయినా అనుసరిస్తారు. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండి, తాను తలపెట్టిన పనిని నెరవేర్చవలసిన ఎదుటి మనిషి బలహీనుడైతే, బలవంతంగానైనా, భయపెట్టయినా మెడలు వంచి మరీ పని జరిపించుకుంటారు. ఎదుటి మనిషి తన కంటే బలవంతుడైతే మాత్రం సిగ్గుశరం పక్కనపెట్టి కాళ్ల బేరానికి వస్తారు. కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి అయినా కావలసిన పనిని జరిపించుకుంటారు. నిస్సిగ్గుగా తమ పనులు జరిపించుకునే వారి ధోరణిని తేలికగా చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అజాగళస్తన సగోత్రులు కొందరు పనీపాటా లేకుండా కాలం వెళ్లబుచ్చేస్తూ ఉంటారు. తినడం, తిరగడం, పడుకోవడం తప్ప పొరపాటుగానైనా పనికొచ్చే పనులేవీ చెయ్యరు. ఇంట్లో వాళ్లకు గాని, బంధు మిత్రులకు గాని, ఊళ్లో వాళ్లకు గాని వారి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలాంటి వ్యర్థ జీవులను వ్యంగ్యంగా ‘అజాగళస్తన సగోత్రులు’ అని ఆక్షేపిస్తుంటారు. సంస్కృతంలో మేకను అజా అంటారు. కొన్ని మేకలకు మెడ వద్ద చిన్న పొదుగులా ఉండి సిరలు వేలాడుతూ ఉంటాయి. వాటి నుంచి పాలు రావు. అవి ఎందుకూ పనిరావు. దేనికీ పనికిరాని దద్దమ్మలు కూడా మేక మెడకు వేలాడే సిరల్లాంటి వ్యర్థులేనని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇల్లలకగానే పండుగవుతుందా? పండుగలకు, పర్వదినాలకు ఇళ్లను అలికి, ముగ్గులు తీర్చిదిద్దడం ఆచారం. అలాగని ఇల్లు అలికినంత మాత్రానే పండుగ జరిగిపోతుందనుకోలేం. ప్రకృతి వైపరీత్యాలు, దుస్సంఘటనలు వంటి అవాంతరాలు ఏవీ లేకుండా ఉంటేనే పిండివంటల వంటకాలు, బంధు మిత్రులు, అతిథి అభ్యాగతుల రాకపోకలతో పండుగ సంబరంగా జరుగుతుంది. కాలం అనుకూలించకుంటే, ఇల్లు అలికినా ఏదో ఒక అవాంతరం ఎదురైతే, ఇక పండుగ పరిస్థితి చెప్పాల్సినదేముంటుంది? ఏదైనా పనిని మొదలుపెట్టడంతోనే అది సజావుగా పూర్తయినట్లు కాదు, నిరాటంకంగా అది పూర్తి కావాలంటే పరిస్థితులన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. అప్పుడే పని విజయవంతమవుతుందని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. రక్తపరీక్షలతో నిర్ధారణ థైరాయిడ్ లోపాలను రక్తపరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. రక్త పరీక్షల ద్వారా థైరాయిడో థైరోనిన్–టి3, థైరాక్సిన్–టి4, థైరాయిడ్ స్టిములంట్ హార్మోన్–టీఎస్‌హెచ్ హార్మోన్ల పరిమాణంలోని హెచ్చు తగ్గులను గుర్తించవచ్చు. అలాగే, రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భాల్లో యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్‌ను కూడా రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే, ఈ పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచన మేరకు మందులు వాడుకుంటూ పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. హైపో థైరాయిడిజమ్ లక్షణాలు ►కొద్దిగా తింటున్నా లావెక్కిపోవడం ►అలసట ►మతిమరపు ►చర్మం, జుట్టు పొడిబారిపోవడం ►కండరాల నొప్పులు ►గోళ్లలో పగుళ్లు ►మలబద్ధకం ►మహిళల్లోనైతే రుతుస్రావంలో తగ్గుదల ►మానసిక కుంగుబాటు ►మెడ వద్ద వాపులా కనిపించడం హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు ►ఎంత తిన్నా బక్కచిక్కిపోవడం ►ఒళ్లంతా వేడిగా అనిపించడం ►అతిగా చెమటలు పట్టడం ►నిద్రలో ఇబ్బందులు ►నిలకడ లేని ఆలోచనలు ►ఆందోళన, అసహనం ►నిష్కారణమైన చిరాకు, అలసట ►గుండె వేగం పెరగడం, గుండె దడ ►మలవిసర్జన క్రమం తప్పడం ►మహిళల్లో నెలసరి సమస్యలు -
వేడి ఆవిర్లు వస్తున్నాయి
నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. వేడి ఆవిర్లు వస్తున్నాయి. ఇవి మెనోపాజ్ దశలోని లక్షణాలు అని విన్నాను. మెనోపాజ్ వచ్చిన వాళ్లు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈస్ట్రోజెన్ భర్తీ కావాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలియజేయగలరు. – పీఆర్వి, అవనిగడ్డ మీ వయసు ఎంతో రాయలేదు. పీరియడ్స్ ఆగిపోయి ఎన్నాళ్లయిందో రాయలేదు. నలభై ఏళ్ల తర్వాత ఒక ఏడాది పాటు పీరియడ్స్ రాకపోతే దానిని మెనోపాజ్ అంటారు. ఈ సమయంలో అండాశయం నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్ బాగా తగ్గిపోవడం వల్ల బాగా చెమటలు పట్టడం, ఒంట్లో వేడి ఆవిర్లు రావడం, గుండెదడగా ఉండటం, నిద్రపట్టకపోవడం, చిరాకు, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. వేసవిలో కొన్ని లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ఫ్యాన్ లేదా ఏసీ ఉండే చోట ఉండాలి. వదులుగా ఉండే లేతరంగు కాటన్ దుస్తులు ధరించాలి. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ, నీరు, పండ్లు, పండ్లరసాలు తీసుకోవాలి. పచ్చళ్లు, వేపుళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కనీసం పదిహేను నిమిషాల సేపు నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం మంచిది. సహజంగా శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల రక్తం నుంచి క్యాల్షియం ఎముకలకు చేరదు. ఎముకలు తొందరగా అరిగిపోవడం వల్ల నడుం నొప్పులు, ఒంటినొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, పప్పులు, పండ్లు, అవిసెగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీన్స్, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు వల్ల వీటి ద్వారా క్యాల్షియంతో పాటు ఈస్ట్రోజెన్లా పనిచేసే ఫైటోఈస్ట్రోజెన్స్ లభ్యమవుతాయి. ఈ జాగ్రత్తలు పాటించినా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి, ఫైటోఈస్ట్రోజెన్స్, ఐసోఫ్లావోన్స్ ఉండే సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్ మాత్రల రూపంలో లేదా స్ప్రే రూపంలో లేదా జెల్ రూపంలో డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదుల్లో వాడుకోవచ్చు. నాకు కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంది. దీనివల్ల పిల్లలు బరువుతో పుడతారని అంటున్నారు. పిల్లలు బొద్దుగా ఉంటే నాకు ఇష్టం. ఇలా బరువుగా పుట్టడం వల్ల నష్టం ఉందా? గర్భిణులలో జెస్టేషనల్ డయాబెటిస్ రావడానికి కారణం ఏమిటో తెలియజేయగలరు. – జి.హేమ, రంగంపేట కూల్‌డ్రింక్స్‌లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్, ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్, కెఫీన్, సుగర్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషక పదార్థాలేవీ ఉండవు. వీటిలో సుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తాగితే గర్భిణులలో బరువు పెరగడం, సుగర్ లెవల్స్ పెరగడం, కడుపులోని బిడ్డ అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూల్‌డ్రింక్స్‌లోని మిగిలిన పదార్థాల వల్ల కడుపులో గ్యాస్ తయారవడం, ఎసిడిటీ ఏర్పడటం, కెఫీన్ మోతాదు మించడం వల్ల అబార్షన్లు, పుట్టే బిడ్డల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ అధిక బరువుతో ఉంటే కాన్పు సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సుగర్ లెవల్స్‌లో తేడాలు, ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడవచ్చు. బిడ్డ మరీ బొద్దుగా ఉండే కంటే, మామూలు బరువుతో ఉండి చలాకీగా ఉండటం ముఖ్యం. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భిణులలో ఉండాల్సిన మోతాదు కంటే సుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం రావడం. ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం వంటి అనేక కారణాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. ఇది నిర్ధారణ అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఆహారంలో మార్పులు చేసుకుని, అవసరమైతే మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ సుగర్ లెవల్స్‌ను సక్రమంగా అదుపులో ఉంచుకుంటే పండంటి బిడ్డను క్షేమంగా కనవచ్చు. హోర్మోన్ల లోపానికి, నెలసరిలో తేడా, ఒత్తిడికి దగ్గర సంబంధం ఉంటుందని చదివాను. హార్మోన్ల సమతుల్యం పెంచుకోవడానికి ఏం చేయాలో తెలియజేయగలరు.– బి.సారిక, హైదరాబాద్ పీరియడ్స్ సక్రమంగా రావాలి. హార్మన్స్ సక్రమంగా విడుదల కావాలి. మొదట మెదడులోని హైపోథాలమస్ అనే భాగం నుంచి జీఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ విడుదలై అది పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజపరచడం వల్ల పిట్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టీఎస్‌హెచ్ వంటి అనేక హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి అండాలు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గర్భాశయంపై ప్రభావం చూపి నెలసరి రావడానికి దోహద పడతాయి. కాబట్టి మొదట మెదడు సక్రమంగా ఉంటే, హార్మోన్స్ సక్రమంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ క్రమం తప్పి, నెలనెలా సక్రమంగా రాకపోవచ్చు. కాబట్టి క్రమంగా నడక, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటి జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు పాజిటివ్ దృక్పథం, ఆత్మస్థైర్యం వంటివి అలవరచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ ,హైదరాబాద్ -
ఆ సమయంలో వాంతులు?
నాకు నెలసరి సమయంలో బాగా వాంతులు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. వైద్యం మీద అవగాహన ఉన్న నా ఫ్రెండ్ ‘స్పాస్మోడిక్ డిస్మెనోరయా’ అని చెబుతోంది. ఇది నిజమేనా? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.ప్రీతి, ఖమ్మం నెలసరి సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. ఇందులో ప్రొస్టాగ్లాండిన్స్ అనేవి కీలకం. ఇవి కొందరిలో మాములుగా విడుదల అవుతాయి. కొందరిలో ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి గర్భాశయం పైన చూపే ప్రభావం వల్ల, అది బాగా ముడుచుకున్నట్లయ్యి బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అది విడుదలయ్యే మోతాదును బట్టి ఈ సమయంలో పొత్తికడుపులో నొప్పి తీవ్రత ఉంటుంది. కొందరిలో నొప్పి కొద్దిగా, కొందరిలో బాగా ఎక్కువగా, కొందరిలో ఏమీ ఉండదు. ఇలా నెలసరి సమయంలో మెలిపెట్టినట్లు ఉండే పొత్తికడుపు నొప్పినే ‘స్పాస్మోడిక్ డిస్మెనోరియా’ అంటారు. గర్భాశయంలో ఏ సమస్యా లేకపోయినా కూడా ప్రొస్టాగ్లాండిన్స్ ప్రభావం వల్ల ఈ నొప్పి కొందరిలో 1–3 రోజులు ఉండి తగ్గిపోతుంది. ఇది మామూలే. దీనికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఆ రోజులలో నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు. మరి కొందరిలో గర్భాశయంలో ఫైభ్రాయిడ్స్, అడినోమియోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి ఇతర సమస్యల వల్ల కూడా నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొస్టాగ్లాండిన్స్ కండరాలను కుంచింప చేస్తాయి. నెలసరి సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ గర్భాశయ కండరాలపైనే కాకుండా, మిగతా బాగంలో ఉన్న కొన్ని కండరాలపైన, అవయవాలపైన ప్రభావం చూపడం వల్ల, కొందరిలో ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. దీనికి ఈ సమయంలో రానిటిడిన్, ఓన్‌డన్‌సెట్రాన్ వంటి మాత్రలు వాడి చూడవచ్చు.అలాగే మెడిటేషన్, యోగా వంటి వ్యాయామాలతో కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. మా బంధువులలో ఇద్దరు ముగ్గురు అండాశయాలలో నీటిబుడగల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇవి రావడం ప్రమాదమా? నివారణ చర్యలు ఏమిటి? అండాశయాలలో నీడిబుడగలు ఏర్పడడం అనేది జన్యుపరమైన సమస్యల వల్ల వస్తుందా? తీసుకునే ఆహారం లేక ఇతర కారణాల వల్ల వస్తుందా? తెలియజేయగలరు. – కె.రాధిక, రాజమండ్రి అండాశయాలలో నీటిబుడగల సమస్యను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి హార్మోన్లలో అసమతుల్యత, అధికబరువు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటి ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడడవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, సన్నగా ఉన్నవారిలో కూడా నీటిబుడగల సమస్య ఏర్పడవచ్చు. సాధారణంగా గర్భాశయం ఇరువైపుల ఉంటే అండాశయాలలో పరిపక్వత చెందని అండాలు ఉంటాయి. పీసీవో ఉన్నవారిలో పరిపక్వత చెందని అండాలు చాలా ఎక్కువగా ఏర్పడి, స్కానింగ్‌లో చిన్నచిన్న నీటిబుడగలలాగా కనిపిస్తుంటాయి.మగవారిలోఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజెన్ హార్మోన్, పీసీవో ఉన్న ఆడవారిలో ఎక్కువగా విడుదల అవుతుంది.ఇవి ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏర్పడతాయి. కొందరిలో అధిక బరువు వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి పీసీవో రావచ్చు. వీటి వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాలు, మెడచుట్టూ నల్లగా ఏర్పడటం, సాధారణంగా గర్భం దాల్చటంలో ఇబ్బందులు, అబార్షన్లు, గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం రావటం, తర్వాత కాలంలో షుగర్, బీపీ, గుండె సమస్యలు వంటివి ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్ల అసమతుల్యత తీవ్రతను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉండవచ్చు.వీటి చికిత్సలో భాగంగా మందులతో పాటు, జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, బరువు తగ్గటం సక్రమంగా వ్యాయమాలు చెయ్యటం తప్పనిసరి. చాలామందికి కేవలం జీవనశైలిలో మార్పులతో కూడా ఇవి అదుపులో ఉంటాయి. వీటిని పూర్తిగా నివారించలేము. కానీ, వాటివల్ల వచ్చే సమస్యలను, చికిత్సలు, పైన చెప్పిన జాగ్రత్తలలో కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. చికిత్సలో భాగంగా సమస్యను బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెట్ఫార్మిన్ మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్స్, యాంటీ ఆండ్రోజన్స్ వంటి అనేక మందులను ఇవ్వడం జరుగుతుంది. గర్భం కోసం ఇచ్చే చికిత్సలో మందులతో గర్భం రానప్పుడు, ల్యాపరోస్కోపీ ద్వారా కొన్ని నీటిబుడగలను తీసి, మందులతో మరలా చికిత్స చేయడం జరుగుతుంది. పీసీవో సమస్యను పూర్తిగా తొలగించడం చాలా కష్టం. వీటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. చికిత్స, మందులూ, అవి ఇంకా పెరగకుండా హార్మోన్లను అదుపులో ఉంచడానికి మాత్రమే పనికి వస్తాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు తీసుకోమని చెబుతుంటారు. ఇవి మెడికల్షాప్లలో అమ్ముతారా? మాత్రల రూపంలో ఉంటాయా? ఎంత మోతాదులో తీసుకోవాలి? మాత్రాల రూపంలో కాకుండా తినే ఆహారంతో సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలియజేయగలరు. – ఆర్.దేవిక, శ్రీకాకుళం ఫిష్ ఆయిల్లో ఛీజ్చి వంటి ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా చేప శరీరం నుంచి చేసినవి ఉండాలి. అవి చేప లివర్ నుంచి తీసినవి ఉండకూడదు. వీటిలో విటమిన్–ఎ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అది శిశువుపైన దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉంటాయి.ఫిష్ ఆయిల్‌లోకి ఛీజ్చి వల్ల గర్భిణీలలో బీపీ పెరగటం, నెలలు నిండకుండా కాన్పులు అవ్వడం వంటివి తగ్గవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. ఛీజ్చి కడుపులోని శిశువు నాడీవ్యవస్థ పనితీరుకు, కళ్ళ పనితీరు సక్రమంగా ఉండేటట్లు చేస్తాయి. ఇవి ఛీజ్చి 300 ఉండే మందుల షాపులలో దొరికే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్. రోజుకొకటి చొప్పున తొమ్మిది నెలలు, కాన్పు తర్వాత 3 నెలల వరకు వాడవచ్చు. చేపలు తినేవారికి ఈ క్యాప్సూల్స్ అవసరం లేదు. వారానికి రెండు మూడుసార్లు చేపలు ఆహారంలో తీసుకుంటే చాలు. ఛీజ్చి ఎక్కువగా చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారంలో దొరుకుతుంది. అవిసెగింజలు, వాల్నట్స్ వంటి వాటిలో దొరుకుతుంది. మాంసాహారం తీసుకోని వారిలో ఆల్గేతో తయారుచేసే వెజిటేరియన్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఇవి కూడా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఇలా ఉంటే ఆరోగ్యమేనా?
నా వయసు 29 సంవత్సరాలు. వ్యాయామాలు ఎక్కువగా చేసి సన్నబడ్డాను. ‘ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు’ అని కొందరు అంటుంటే, ‘హార్మోన్ల పనితీరు బాగుండడానికి కొవ్వు కూడా ఉండాలి’ అని మరికొందరు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – బి.గాయత్రి, మంచిర్యాల శరీరం పనితీరు, రసాయన ప్రక్రియలు, శరీరంలో జరిగే రోజువారీ పనులు సక్రమంగా సజావుగా జరగాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోట్రీన్స్, విటమిన్స్, మినరల్స్‌తో పాటు కొవ్వు కూడా సరైన నిష్పత్తిలో ఉండాలి. ఆడవారిలో ముఖ్యంగా విడుదలయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజ్రెస్టిరాన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లు తయారవ్వడానికి శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్ అనేది ఈ హార్మోన్లు తయారవడానికి ఒక ముడి పదార్థంలాంటిది. రజస్వల అవ్వడానికి శరీరంలో కనిసం 17 శాతం ఫ్యాట్ అవసరం. పీరియడ్స్ సక్రమంగా రావడానికి కనీసం 22 శాతం కొవ్వు ఉండాలి. కాబట్టి మరీ డైటింగ్ చేసి బాగా సన్నబడితే, శరీరంలో బాగా కొవ్వు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, శరీరం యాక్టివ్‌గా లేకపోవడం, డల్‌గా ఉండటం, నీరసం, ఒళ్ళునొప్పులు వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల లైంగిక కోరికలు సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యకరంగా ఉండడం అంటే బాగా సన్నబడిపోవడం కాదు. పొడువుకు తగ్గ బరువు ఉండటం, అధిక బరువు, ఎక్కువ కొవ్వు లేకుండా చూసుకోవడం...అంతేగానీ అసలు కొవ్వే లేకుండా ఉండటం కాదు. శరీరంలో అన్ని ప్రక్రియలూ సజావుగా జరగాలంటే శరీరంలో 25 శాతం కొవ్వు ఉండాలి. కాబట్టి మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమంగా వ్యాయామాలు చేసుకుంటూ, పొడవుకు తగ్గ బరువు అంటే బి.యం.ఐ(బాడీ మాస్ ఇండెక్స్) ఉండేటట్లు చూసుకోవడం వల్ల ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. ఆహారంలో కొద్దిగా అన్నం లేదా చపాతి ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొద్దిగా డ్రైఫ్రూట్స్ వంటివి ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. అయితే సరిౖయెన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గర్భం దాల్చాను. ఇప్పుడు అబార్షన్ చేసుకోవచ్చా? ఇలా చేయడం వల్ల మున్ముందు ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? – ఎన్.కీర్తన, గుంటూరు ఇప్పుడు గర్భం ఎన్ని నెలలు అని రాయలేదు. సాధారణంగా రెండు నెలల లోపల గర్భం అయితే అబార్షన్ అవ్వడానికి మందులు వాడవచ్చు. రెండు నెలలు దాటితే అంటే 8 వారాలు దాటితే మందుల ద్వారా పూర్తిగా అబార్షన్ అవ్వకపోవచ్చు. దానికి డి అండ్ సి అనే చిన్న ఆపరేషన్ ద్వారా యోని ద్వారం నుంచి గర్భాశయంలోని గర్భాన్ని తోలగించడం జరుగుతుంది. మందుల ద్వారా అబార్షన్‌కి ప్రయత్నం చేసినప్పుడు, నూటికి నూరుశాతం ఒకొక్కరి శరీరతత్వాన్నిబట్టి గర్భం సైజ్‌ని బట్టి, కొందరిలో కొన్ని ముక్కలు ఉండిపోవచ్చు. కొందరిలో బాగా నొప్పితో బాగా బ్లీడింగ్ అవ్వడం, బాగా నీరసపడటం, రక్తహీనత ఏర్పడటం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అబార్షన్ చేయించుకునే ముందు స్కానింగ్ చేయించుకొని గర్భం, గర్భాశయంలో ఉందా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అని చూసుకోవాలి. మందులతో అబార్షన్ తర్వాత కూడా స్కానింగ్ చేయించుకోవాలి. అందులో గర్భం పూర్తిగా తొలిగిపోయిందా లేక ఇంకా ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అనేది నిర్ధారణ చేసుకోవాలి. లేదంటే లోపల ముక్కలు ఉండిపోయి నిర్లక్ష్యం చేస్తే, మధ్యమధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉండడం, ఇన్ఫెక్షన్ సోకడం, పొత్తికడుపులో నొప్పి, ట్యూబ్స్ మూసుకుపోయే అవకాశాలు, మళ్లీ గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ముక్కలు ఉండిపోయి, మందుల ద్వారా పూర్తిగా అబార్షన్ కాకపోతే, డి అండ్ సి పద్ధతి ద్వారా నొప్పి తెలియకుండా మత్తు తీసుకొని అబార్షన్ చెయ్యించుకోవలసి ఉంటుంది. డి అండ్ సి పద్ధతి ద్వారా 1–2 శాతం మందిలో ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ గర్భం రావటానికి ఇబ్బంది కావచ్చు. కాకపోతే అబార్షన్ చెయ్యించుకున్నæ అందరిలోనూ మళ్ళీ గర్భం రావటానికి ఇబ్బంది ఉండాలని ఏమీ లేదు. కొందరిలో సాధారణంగా వచ్చిన గర్భాన్ని తొలగించుకుని, మళ్లీ కావాలనుకున్నప్పుడు వారి శరీరంలో మార్పులు, హార్మోన్లలో మార్పులు వంటి వేరే కారణాల వల్ల ఆలస్యం అయితే, అప్పుడు అనవసరంగా వచ్చిన గర్భాన్ని తీయించుకున్నాము అని పశ్చాత్తాప పడటం జరగుతుంటుంది. కాబట్టి అబార్షన్ చేయించుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. నా వయసు 43 సంవత్సరాలు. గత నాలుగైదు నెలలుగా నెలసరి రావడం లేదు. ఇది ప్రమాదకర సంకేతమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– టీఆర్. ఆముదాలవలస మీకు ఇంతకుముందు నెలనెల క్రమంగా వచ్చేవా? మీ వయసు 43 సంవత్సరాలు. ఈ వయసులో పీరియడ్స్ క్రమం తప్పడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ వయసులో కొద్దిమందిలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు మెల్లగా ఉత్పత్తి తగ్గిపోవడం మొదలయ్యి తర్వాత 5–6 సంవత్సరాలకు పూర్తిగా తగ్గిపోయి పీరియడ్స్ ఆగిపోతాయి. ఇలా ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ రాకపోతే దానినే మెనోపాజ్ దశ అంటారు.ఈ దశకి చేరేముందు కొందరిలో పీరియడ్స్ ఆలస్యంగా రావటం, బ్లీడింగ్ ఎక్కువ లేదా తక్కువగా అవ్వటం వంటి అనేక రకాల లక్షణాలు ఉంటాయి. ఇవే కాకుండా కొందరిలో అండాశయాలలో నీటికంతులు, గడ్డలు వంటి ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా రావచ్చు. కాబట్టి మీరు కంగారు పడకుండా గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే, వారు రక్తపరీక్షలు, స్కానింగ్ అవి చేసి కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు.అవి మెనోపాజ్ ముందు వచ్చే మార్పులు అయితే దానికి చెయ్యగలిగింది ఏమి లేదు. కాకపోతే వయసు 43 కాబట్టి ఆహారంలో ఎక్కువ కాల్షియం, ఐసోఫ్లావోన్స్ ఉండే పదార్థాలు అయిన ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, సోయాబీన్స్, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
హార్మోన్ల లోపంతో నెలసరి సక్రమంగా లేదు.. ఏం చేయాలి?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 22 ఏళ్లు. హార్మోన్ లోపంతో నెలసరి సరిగా రావడం లేదు. బరువు పెరుగుతోంది. హోమియోలో చికిత్స ఉందా? – ఎస్. శ్రీవాణి, కాకినాడ గర్భాశయంలోని పిండ దశ మొదలుకొని జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం చూపుతుంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణకు తోడ్పడతాయి.ఈ హార్మోన్లు అన్నీ రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసౌమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. ఇది నిర్ధారణ అయితే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మందులు బాగా పనిచేస్తాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ నయమవుతుందా? నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. యానల్ ఫిషర్‌కు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే భయం. హోమియోలో చికిత్స ఉందా? – వి.వి. సుందరరావు, అమలాపురం మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అప్పుడు మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇలా రోగి ముక్కే సమయంలో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ బాబుకు ఆటిజమ్ తగ్గుతుందా? మా బాబు వయసు మూడేళ్లు. ఇటీవల వాడెప్పుడూ ఒంటరిగా ఉండటం, చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ చెబుతుండటంతో డాక్టర్‌కు చూపించాం. డాక్టర్ పరీక్షించి ‘ఆటిజమ్’ అన్నారు. అంటే ఏమిటి? దీనికి హోమియోలో చికిత్స ఉందా? – డి. సురేశ్‌కుమార్, నల్లగొండ ఒకప్పుడు ఆటిజమ్‌ను పాశ్చాత్యదేశాలకు చెందిన రుగ్మతగా భావించేవారు. అయితేఇటీవల ఈ కేసులు మన దగ్గర కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఆటిజమ్ అంటే... చిన్న పిల్లల్లో మానసిక వికాసం చక్కగా జరగని, నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మతగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లలు నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఆటలు ఆడకుండా ఉండటం, చేసిన పనినే పదే పదే చేయడం, వల్లించిన మాటనే మళ్లీ మళ్లీ మాట్లాడటం వంటివి చేస్తారు. వారు నేర్చుకునే పదసంపద (వకాబులరీ) కూడా తక్కువే. కారణాలు: ఆటిజమ్‌కు నిర్దిష్టమైన కారణం తెలియకపోయినా ప్రధానంగా జన్యుపరంగా ఇది వస్తుందని భావిస్తున్నారు. అలాగే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం, ఆమె భారలోహాలకు ఎక్స్పోజ్ కావడం, యాంటీడిప్రెసెంట్ తీసుకోవడం లేదా ఆమెకు పొగతాగే / మద్యం తీసుకునే అలవాటు ఉండటం, చాలా ఆలస్యంగా గర్భందాల్చడం, జీవక్రియల్లో అసమతౌల్యత, ప్రసవం సమయంలో బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వంటివి దీనికి కారణం. లక్షణాలు: బిడ్డ పుట్టిన ఆర్నెల్ల నుంచే ఆటిజమ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే సాధారణంగా రెండేళ్లు లేదా మూడేళ్ల సమయంలోనే తల్లిదండ్రులు వాటిని గమనిస్తారు. చిన్నపిల్లల్లో సహజంగా ఉండాల్సిన కమ్యూనికేటిషన్ నైపుణ్యాలు లోపించడం ద్వారా పేరెంట్స్ ఆటిజాన్ని గుర్తిస్తారు. పిల్లలు నేరుగా మాట్లాడేవారి కళ్లలోకి చూడకుండా ఉండటం, తమ వయసు పిల్లలో ఆడుకోకపోవడం, వారి వయసుకు తగినన్ని మాటలు నేర్చుకోకపోవడం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. తీవ్రతను బట్టి దీన్ని మైల్డ్, ఒక మోస్తరు (మోడరేట్), తీవ్రమైన (సివియర్) ఆటిజమ్గా వర్గీకరించవచ్చు. చికిత్స: హోమియోలో ఆటిజమ్‌కు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే ఆటిజమ్‌ను చాలావరకు నయం చేయవచ్చు. ఇలాంటి పిల్లల్లో చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆరేడు ఏళ్ల వయసులో చికిత్స ప్రారంభించినా మంచి ఫలితాలే కనిపించడం హోమియో చికిత్సలోని విశిష్టత. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యను తగ్గించవచ్చా? నా వయసు 37 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్. రామేశ్వర్రావు, నిజామాబాద్ గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
సన్నటి లావాటి సమస్య!
థైరాయిడ్... థైరాయిడ్ అనేది మన శరీరంలోని అత్యంత కీలకమైన గ్రంథుల్లో ఒకటి. రెండు తమ్మెలుగా ఉండే ఇది.. మెడ దగ్గర థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. శరీరం తక్షణం ఉపయోగించే శక్తిని, ప్రోటీన్ల తయారీని, శరీరాన్ని ప్రభావితం చేసే అనేక ఇతర హార్మోన్ల స్రావాలను ఇది పర్యవేక్షిస్తుంది. అందుకే దీని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా అది శరీరంలోని అనేక జీవక్రియలపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ చేసే అనేక సంక్లిష్టమైన పనులను పరిశీలించి, తేడాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చికిత్సలను చూద్దాం. శరీరంలోని అత్యంత కీలకమైన కార్యకలాపాలన్నింటినీ థైరాయిడ్ గ్రంథి తన ప్రధానమైన హార్మోన్ల ద్వారా చేస్తుంది. వీటిలో అత్యంత ప్రధానమైనవి ట్రైఐయడోథైరానిన్ (టీ3), థైరాక్సిన్ (కొన్నిసార్లు దీన్ని టెట్రాఐయడోథైరానిన్ (టీ4) అంటారు). ఈ హార్మోన్లు మన పెరుగుదలను, శరీరంలోని అనేక జీవక్రియలు జరగడాన్ని, వాటి వేగాన్ని నియంత్రిస్తుంటాయి. ఈ హార్మోన్ల తయారీ అంతటినీ మరో హార్మోన్ నియంత్రిస్తుంటుంది. దీన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) అంటారు. ఈ హార్మోన్ల తేడాల వల్ల ఏర్పడే పరిస్థితులివి... హైపర్ థైరాయిడిజమ్ ఈ కండిషన్లో థైరాయిడ్ నుంచి వెలువడే హార్మోన్ల పాళ్లు రక్తంలో ఎక్కువగా ఉంటాయి. దాంతో జీవక్రియల్లో తేడాలు వస్తాయి. హైపర్ థైరాయిడిజమ్‌కు ముఖ్యమైన కారణాలు... థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే మన రోగనిరోధక వ్యవస్థ నుంచి యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పన్నం కావడం. దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు. థైరాయిడ్ గ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో హార్మోన్లు స్రవించడం జరుగుతుంది. ఇలా ఈ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావడాన్ని దీన్ని థైరాయిడైటిస్ అంటారు. థైరాయిడ్ హార్మోన్ స్రావాలను ఎక్కువ చేసే ఇతర మందులను అధిక మోతాదులో తీసుకోవడం. కొన్ని నిరపాయకరమైన లేదా క్యాన్సరస్ గడ్డలు పుట్టి అవి థైరాయిడ్ స్రావాలను అధికంగా స్రవించేలా చేయడం. లక్షణాలు: హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలివి... బరువు తగ్గడం ఆకలి పెరగడం తెలియని ఉద్విగ్నత (యాంగ్జైటీ)తో పాటు అస్థిమితంగా ఉండటం ఏమాత్రం వేడిని భరించలేకపోవడం చెమటలు అధికంగా పట్టడం తీవ్రమైన అలసట తరచుగా కండరాలు పట్టేస్తుండటం మహిళల్లో రుతుస్రావం క్రమం తప్పడం మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉబ్బి ఎత్తుగా కనిపించడం గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం కళ్లు ఉబ్బి బయటకు పొడుచుకొచ్చినట్లుగా ఉండటం నిద్రలో అంతరాయాలు ఎప్పుడూ ఎక్కువగా దాహం వేస్తుండటం చర్మం రంగు మారడంతో పాటు ఎప్పుడూ దురదలు ఉండటం వికారం, వాంతులు మన ప్రమేయం లేకుండానే శరీర కదలికలు సంభవిస్తుండటం వణుకు పురుషుల్లో రొమ్ములు పెరగడం హైబీపీ తలవెంట్రుకలు రాలిపోతుండటం. నిర్ధారణ: రోగిని డాక్టర్లు పరీక్షించి, లక్షణాలను అడిగి తెలుసుకుంటారు. దాంతోపాటు రక్తపరీక్షలో రక్తంలో టీఎస్‌హెచ్, టీ3, టీ4 పాళ్లను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో యాంటీథైరాయిడ్ యాంటీబాడీస్ వల్ల కూడా దీన్ని తెలుసుకుంటారు. ‘థైరాయిడ్ అప్టేక్ స్కాన్’ అనే న్యూక్లియర్ ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా కూడా దీన్ని తెలుసుకుంటారు. దీని వల్ల హైపర్ థైరాయిడిజమ్‌కు అసలు కారణం కూడా తెలుస్తుంది. ఐయోడిన్ థైరాయిడ్ స్కాన్ వల్ల గ్రంథి పూర్తిగా గానీ లేదా ఏవైనా బొడిపెల లాంటివి ఉంటే అవిగానీ కనిపిస్తాయి. ఇక ఒక్కోసారి ఎక్స్‌రే కూడా తీస్తారు. చికిత్స: థైరాయిడ్ గ్రంథి పనితీరు తీవ్రతను తగ్గించడమే చికిత్స ఉద్దేశం. దీనికోసం ప్రొపైల్థియోయురాసిల్, మెథిమజోల్, పొటాషియమ్ ఐయోడైడ్ వంటి మందులను వాడతారు. బీటాబ్లాకర్స్ అనే మందులతో పాటు అటెనలాల్ లేదా మెటాప్రొపాల్ వంటి మందులు ఉపయోగించి, థైరాయిడ్ అతిగా పనిచేయడాన్ని నియంత్రిస్తారు. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు, దడ, చెమటలు, ఉద్విగ్నత (యాంగ్జైటీ) తగ్గుతాయి. అయితే రేడియో యాక్టివ్ ఐయోడిన్ ఉపయోగించడం అన్నది హైపర్ థైరాయిడిజమ్‌కు చేసే శాశ్వతమైన చికిత్స. ఇది అంతటా అందరూ సిఫార్సు చేసే చికిత్సా ప్రక్రియ కూడా. హైపోథైరాయిడిజమ్: ఈ కండిషన్లో థైరాయిడ్ గ్రంథి స్రవించాల్సిన హార్మోన్లు తగ్గుతాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో హైపోథైరాయిడిజమ్ ఎక్కువ. కొద్దిపాటి సమస్య ఉంటే రోగి మామూలుగానే ఉంటారు. కానీ దీనికి చికిత్స తీసుకోకపోతే స్థూలకాయం, కీళ్లనొప్పులు, సంతానలేమి, గుండెజబ్బులు రావచ్చు. హైపోథైరాయిడిజమ్ ఎవరికైనా రావచ్చు. అయితే 50 ఏళ్లు దాటిన మహిళల్లో దీని రిస్క్ ఎక్కువ. హైపోథైరాయిడిజమ్‌కు కారణాలివి... మన రోగనిరోధక వ్యవస్థలో కొన్ని యాంటీబాడీస్ పుట్టి... అవి థైరాయిడ్ గ్రంథిపై దాడి చేస్తాయి. ఇలా కొన్నేళ్ల పాటు ఈ దాడి కొనసాగడం వల్ల సాధారణంగా స్రవించాల్సిన దాని కంటే తక్కువ హార్మోన్లు స్రవిస్తుండటం జరగవచ్చు. తన సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తమకు వ్యతిరేకంగా పనిచేసే ఈ (ఆటోఇమ్యూన్) కండిషన్‌ను ‘హషిమోటోస్ థైరాయిడైటిస్’ అంటారు. ఇక కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను స్రవించడంలో పిట్యూటరీ గ్రంథి విఫలం కావడం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్ వస్తుంది. సాధారణంగా పిట్యూటరీ గ్రంథికి కణితి వస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో టీ4, టీఎస్‌హెచ్... ఈ రెండు హార్మోన్లూ తగ్గుతాయి. కొందరు మహిళల్లో గర్భధారణ తర్వాత హైపోథైరాయిడిజమ్ కండిషన్ వస్తుంది. దీన్ని పోస్ట్‌పార్టమ్ హైపోథైరాయిడిజమ్ అంటారు. తమ సొంత థైరాయిడ్ గ్రంథే యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ కండిషన్ వస్తుంది. దీనికి తోడు ఐయోడిన్ లోపం వల్ల కూడా హైపోథైరాయిడిజమ్ వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఐయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి. లక్షణాలు : హైపోథైరాయిడిజమ్ వల్ల ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. కొందరిలో కొన్ని మాత్రమే కనిపించవచ్చు. అవి... నీరసం, అలసట చల్లదనాన్ని అస్సలు భరించలేకపోవడం మలబద్దకం స్థూలకాయం తినడం తక్కువే అయినా బరువు పెరగడం డిప్రెషన్ ఇవి ప్రధాన లక్షణాలు. వ్యాధి నిర్ధారణ: హైపోథైరాయిడిజమ్‌ను నిర్ధారణ చేయడానికి కొన్ని భౌతిక పరీక్షలతో పాటు రసాయనిక పరీక్షలూ అవసరం అవి... మెదడు పనితీరు సరిగ్గా ఉందో లేదో చూడటం (అబ్నార్మల్ మెంటల్ ఫంక్షన్) వెంట్రుకలు, చర్మం, గోళ్లలో మార్పులు ముఖం, కాళ్లూ చేతుల్లో వాపు గుండెవేగం మందగించడం బీపీ తగ్గడం. ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగితే అది మనకు తెలియకపోవచ్చు. అందుకు కొన్ని లాబొరేటరీ పరీక్షలతో పాటు టీ4, టీ3 పరీక్షలు అవసరం. వాటితో పాటు చేయించాల్సిన ఇతర పరీక్షలు ఇవి... కొలెస్ట్రాల్ పాళ్లు లివర్ ఎంజైమ్ పరీక్ష సీరమ్ ప్రోలాక్టిన్ బ్లడ్ గ్లూకోజ్ పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ కౌంట్). యాంటీబాడీ యాంటీథైరాయిడ్ పరీక్ష వల్ల కూడా ఈ ఆటో ఇమ్యూన్ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: హైపోథైరాయిడిజమ్ కండిషన్లో థైరాయిడ్ గ్రంథి స్రవించని హార్మోన్ల లోటును బయటి నుంచి అలాంటి రసాయానాల కంపోజిషన్‌ను ఇస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ కె.డి. మోదీ, సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, నాంపల్లి, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
టూకీగా ప్రపంచ చరిత్ర 60
జాతులు-నుడికారాలు ‘అడాప్షన్’ పద్ధతిని తెలుసుకోవాలంటే మన మధ్యనే మెలిగే మనుషులను జిజ్ఞాసతో పరిశీలిస్తే చాలు - ఒక రకమైన అవగాహన ఏర్పడుతుంది. సున్నితమైన చర్మంరంగుతో పుట్టిన మనిషి పొలం పనుల మూలంగా ఎండ తాకిడికి గురికావడంతో చర్మం నలుపెక్కి నాణ్యత కోల్పోతాడు. ఎండపొడ సోకకుండా పెరిగిన మనిషికి నలుపు తగ్గి చర్మం నాజూగ్గా తేలుతుంది. అలాగే, ఎదిగే పిల్లలు యవ్వనానికి చేరువౌతున్న కొద్దీ, ‘హార్మోన్ల’ ప్రేరణ కారణంగా, చర్మంలో లావణ్యం పెరుగుతుంది. దీన్నిబట్టి, మనిషి బాహ్య లక్షణాల్లో కనిపించే తేడాలకు కారణాలు సవాలక్ష. అతడు నివసించే ప్రదేశం, అక్కడి వాతావరణం, అతని జీవనసరళి, ఆహారపుటలవాట్లూ, ఆత్మరక్షణకు అవసరమైన జాగ్రత్తలూ మొదలైన అంశాలెన్నో అందులో ఇమిడివుంటాయి. ఎప్పుడో లక్షలాది సంవత్సరాలకు పూర్వం, నిటారుగా నడిచే జంతువు తన రాతి పనిముట్లతో నేల నాలుగు చెరగులకూ విస్తరించింది. ఆ తరువాత, చరిత్రకు తెలిసినంత మేరకు, దాదాపు 20వేల సంవత్సరాల ముందు నుండి కొత్త రాతియుగం మానవుడు అదేవిధంగా విస్తరించడం మొదలెట్టాడు. వారి మధ్యకాలం ఎంతో దీర్ఘమైనది కావడం వల్ల ఆ రెండు తరహాల వారి పోలికల్లో తేడాలు అప్పటికే ఏర్పడివుండాలి. విస్తరణ మార్గంలో సంభవించే పరస్పర సంపర్కం వల్ల మరో తరహా బాహ్య లక్షణాలు కూడా ఉనికిలోకి వచ్చుండాలి. సంచార జీవితం తెరమరుగవుతున్న తరుణంలో, అనుకూలత దొరికిన తావుల్లో గుంపులు గుంపులుగా మానవుడు స్థిరనివాసానికి పునాదులు వేసుకుంటున్న కాలంలో, గుంపుల మధ్య ఏర్పడిన తగాదాలూ, శరీరాల్లోని బాహ్యలక్షణాలూ కలగాపులగంగా కలిసిపోయి జాతిభేదాలకు విత్తనం పడివుండాలి. చరిత్రనూ, చెట్లమీదా జంతువుల మీదా జరిగిన ప్రయోగాలనూ ఆధారం చేసుకుని వీటిని ఊహించాలే తప్ప, బాహ్యశరీరానికి సంబంధించి కాలానికి నిలబడగలిగిన సాక్ష్యాలను సేకరించడం శాస్త్రానికి అసాధ్యమైన విషయం. ఈ సంబంధంగా పురాతన సాహిత్యంలోనైనా తగినంత ఆధారం మనకు దొరకడం లేదు. లిపి ఏర్పడకపూర్వమే ఉద్భవించిన సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి ‘రుగ్వేదం’, ‘అవెస్టా’లు. రుగ్వేదంలో దేవతలు, దైత్యులు అనబడే వర్గాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ తెగలు రెండూ కశ్యప ప్రజాపతి సంతానమే. దితి, అదితి ఆయన భార్యలు. సంస్కృత సంప్రదాయం ప్రకారం ‘దితి’ కానిది ‘అదితి.’ బహుశా అదితి కంటే ముందే దితి ఆయనకు భార్యై ఉండొచ్చు. దితికి పుట్టినవాళ్ళు దైత్యులు లేక అసురులు. అదితి పుట్టినవాళ్ళు ఆదితేయులు లేదా దేవతలు. ఈ రెండువర్గాల మధ్య శత్రుత్వం, అడపాదడపా మైత్రీబంధాలూ తప్ప రుగ్వేదంలో జాతులకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించవు. అవెస్టా సిద్ధాంతం రుగ్వేదానికి పూర్తిగా విరుద్ధం. రుగ్వేదంలో దేవతలు ఏవిధంగా ఆరాధించబడ్డారో, అవెస్టాలో అసురులు అదేవిధంగా ఆరాధించబడ్డారు. రుగ్వేదాన్ని గానం చేసేవాళ్ళు ఆర్యులైతే, అవెస్టాను గానం చేసేవాళ్ళు జొరాస్ట్రియన్లు. వీళ్లిద్దరూ ఒకే నాణేనికి బొమ్మాబొరుసులుగా కనిపిస్తారు. బహుశా, దాయాది మత్సరం వాళ్లను రెండు పాయలుగా చీల్చిందో ఏమో! వీటి తరువాతి కాలానిది ‘బుక్ ఆఫ్ జెనిసిస్ (బైబిల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్).’ దీంట్లో మానవుడు జాతులుగా విడిపోవడానికి కారణాన్ని సూచించేది ‘టవర్ ఆఫ్ బేబెల్’ కథ. కాలాతీతమైన సాంకేతిక నైపుణ్యంతోనూ, మూకుమ్మడి శ్రమతోనూ మెసపటోమియాలో ఒకానొకచోట నిర్మించిన గోపురాన్ని టవర్ ఆఫ్ బేబెల్ అన్నారు. హిబ్రూ భాషలో ‘బేబెల్’ అంటే అర్థం ‘అయోమయం’ అని. మానవజాతిని అయోమయంలో పడేసేందుకు కారణమైంది గాబట్టి, ఆ గోపురాన్ని ‘టవర్ ఆఫ్ బేబెల్’ అన్నారు. (ఆ కథ ఏమిటో ... రేపటి సంచికలో..) రచన: ఎం.వి.రమణారెడ్డి -
ఆరళ్లు కాదు.. ఆరు సూత్రాలు అవసరం...
రుణ్ లాంటి తల్లిదండ్రులు మనలో చాలా మందిమి ఉంటాం. అలాంటివారిని చాలా వరకు చూస్తుంటాం. వరుణ్, అతని తల్లిదండ్రుల పరిస్థితి గమనిస్తే తేలిన విషయాలు ఇవి... ఒకటి: ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉండటం. వరుణ్‌కి తన ఈడు పిల్లలే కాదు, సమయానికి మరొకరు తోడులేకపోవడంతో ఇంటి వాతావరణం విసుగు అనిపించేంది. రెండు: పిల్లలకు నచ్చింది కాకుండా మనకు నచ్చింది, మన కలలను వారి మీద రుద్దాలనుకుంటాం. యుక్తవయసులో కష్టాలు రుచించవు. వరుణ్‌కి నచ్చని కోర్సు చదవమని తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి ఆ అబ్బాయికి నచ్చలేదు. అందుకే మరో దారిని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల మీదకు ఎదురుదాడికి దిగాడు. చదువు మూలనపడింది. మూడు:13-19 ఏళ్లలోపు పిల్లల్లో పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఈ దశనే యుక్తవయసు అంటారు. ఈ వయసులో హార్మోన్లలో మార్పులు అధికం. కొత్తదనం కోరుకుంటారు. అందుకే ప్రయోగాలు ఎక్కువ చేస్తుంటారు. తాతాల్కిక ఆనందాలు పొందాలని ఉబలాటపడతారు. అబ్బాయిలైతే.. బైక్ రేసింగ్, బెట్టింగ్, సినిమాలు... వంటివి ఎంచుకుంటారు. చదువు మూలన పడేసి వరుణ్ ఎంచుకున్న మార్గం ఇదే! నాల్గు: టీవీ, సినిమా హీరోలు చేసే విన్యాసాలు, హింసాత్మక సన్నివేశాలు, కిక్ ఇచ్చే ప్రకటనలు.. ఈ వయసు వారిని ఎక్కువ ఆకట్టుకుంటాయి. తామూ హీరోలకు ఏ విధంగా తీసిపోము అని నిరూపించుకోవా లనుకుంటారు. దొంగతనాలు, స్మోకింగ్, అబద్ధాలు వరుణ్‌కి తాత్కాలిక ఆనందాన్నిచ్చాయి. వాటినే మళ్లీ మళ్లీ చేయాలని కోరుకునేవాడు. ఐదు: పిల్లలు చెప్పింది వినడం లేదని, శిక్షించడానికి పెద్దలు చేసే పనులు కొన్ని ఉంటాయి. అందులో పిల్లల దగ్గర ఫోన్లు లాగేసుకోవడం. ఇంటర్నెట్ కట్ చేయడం, ఇంట్లో పెట్టి తాళం వేయడం, కొట్టడం. ఇవన్నీ ఈ వయసు పిల్లలకు పెద్దలపై మరింత ద్వేషం కలిగించేవే. తమ అవసరాలను తీర్చేవారు, తమను ఎందుకు శిక్షిస్తున్నారో తెలియదు. అందుకని రహస్యంగా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో తెలిస్తే తనను శిక్షిస్తారేమో అని భయపడి వరుణ్ రహస్యంగా బయట ఆనందం వెతుక్కునేవాడు. ఆరు: పనుల ఒత్తిడి మూలంగా పిల్లలతో కూర్చొని కాసేపు కూడా కబుర్లు చెప్పకపోవడం. తల్లీ దండ్రి ఇద్దరూ ఉద్యోగాలు అంటూ వెళ్లిపోయినా సాయంత్రాలు, వారంతాలు, సెలవు రోజులు పిల్లలతో ఎక్కువ సేపు మాట్లాడాలి. పిల్లలు చెప్పింది ఓపికగా వినాలి. అప్పుడే వారి మనసులో ఉన్న బాధ, భయాలు తెలిసిపోతాయి. లేదంటే తమ మనసులోని భావాలు పంచుకోవడానికి స్నేహితులపై ఆధారపడతారు. ఇంటి విషయాలు బయట చెబుతున్నారు అంటే ఇంట్లో పిల్లలు తగింత మానసిక విశ్రాంతి పొందడం లేదు అని అర్థం చేసుకోవాలి. టీనేజ్ అనేది గోల్డెన్ పీరియడ్. ఈ వయసు పిల్లల్లో వచ్చే మార్పులు అర్థం కాకపోతే, పరిస్థితిలో తేడాలు గమనిస్తే వెంటనే నిపుణుల సలహాలు తీసుకొని పాటించాలి. - డా.కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
భయం.. భయం
నగరంలో విస్తరిస్తోన్న థైరాయిడ్ వాతావరణ కాలుష్యం, పౌష్టికాహార లోపమే కారణం మూడోవంతు బాధితులు మహిళలే ఇందులో హైపోథైరాయిడే అధికం సర్వేలో వెల్లడైన వాస్తవాలు థైరాయిడ్.. ఇప్పుడీ సమస్య గ్రేటర్ నగరాన్ని వణికిస్తోంది. నగర వాసులు తమకు తెలియకుండానే థైరాయిడ్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం.. హార్మోన్లలో సమతుల్యత లోపించడం, పౌష్టికాహార లోపం వల్ల చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో మూడోవంతు మంది మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. నగరంలో హైపోథైరాయిడిజం బాధితులే అధికం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితేనే అన్ని విధాలా మేలంటున్నారు వైద్య నిపుణులు. నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న థైరాయిడ్‌పై ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతా ల్లో మాత్రమే కన్పించే థైరాయిడ్ తాజాగా మెట్రో నగరాలకూ విస్తరించింది. పౌష్టికాహారం, అయోడిన్ లోపం.. వాతావరణ కాలుష్యం వల్ల గ్రేటర్లో నేడు అనేకమంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. మధుమేహం, గుండె జబ్బులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో థైరాయిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమిలాజీ వారు నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యం కలిగిం చే అంశాలు వెలుగు చూ శాయి. సర్వే ప్రకారం 18 ఏళ్లుపైబడిన వారిలో జాతీయ స్థాయిలో సగటున 10.95% మంది హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో సగటున హైదరాబాద్‌లో 8.88% మంది ఉండగా ఇందులో మూడోవంతు బాధితులు మహిళలు కావడం ఆందోళన కలిగించే అంశం. ఉత్తరాదిన కోల్‌కత.. దక్షిణాన హైదరాబాద్ 2012-13లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చెన్నై, హైదరాబాద్‌లో సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన నగరాల్లో థైరాయిడ్ హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధికంగా ఉత్తర భారత దేశంలోని కోల్‌కతలో 21.6 శాతం, దేశ రాజధాని న్యూఢిల్లీలో 11.07 శాతం, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా, దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్టు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలాజీ విభాగం వైద్యుడు డాక్టర్ రాకేష్సహాయ్ స్పష్టం చేశారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమంటున్నారు. కాలుష్యం వల్లే... శరీరంలో అయోడిన్ మూలక లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో థైరాయిడ్ బారిన పడే వారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది తమ ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల అనేకమంది దీని బారిన పడుతున్నట్టు తేలింది. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంతవరకు కాపాడుకోవచ్చు.- డాక్టర్ రాకేష్ సహాయ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి హైపో థైరాయిడిజం లక్షణాలు హైపర్ థైరాయిడిజం లక్షణాలు హైపో థైరాయిడ్‌ను సులభంగా గుర్తించవచ్చు - హైపర్ థైరాయిడ్‌ను కూడా గుర్తించవచ్చు బరువు పెరగడం - బరువు తగ్గడం జుట్టు రాలిపోతుంది - విపరీతమైన చమట చర్మం పొడిబారుతుంది - గుండె వేగంగా కొట్టుకోవడం విపరీతమైన అలసట - టెన్షన్(ఆందోళన), చేతులు వణకడం మహిళల్లో రుతుచక్ర క్రమం తప్పడం - గుర్తించడంలో రోగులే కాదు వైద్యులు కూడా పొరపాటు పడవచ్చు సంతాన లేమి - టీఎస్‌హెచ్ టెస్టు చేస్తే ఉందో లేదో తెలుస్తుంది థైరాయిడ్ అంటే..? థైరాయిడ్ అనేది రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, మరొకటి హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతోపాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వహించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. ప్రస్తుతం నగరంలో హైపోథైరాయిడిజం బాధితులు అధికంగా ఉన్నారు. -
ఒళ్లు బరువు?కళ్లు తెరువు!
స్థూలకాయం సమస్య తీవ్రంగా మారింది. ప్రజల జీవనశైలిపై దాని ప్రభావాలు విపరీతంగా ఉంటూ ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలకు అది కారణమవుతోంది. ఉదాహరణకు స్థూలకాయం చాలామందిలో డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాససంబంధమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ శతాబ్దానికి అదో పెద్ద విపత్తుగా మారిందనడం అతిశయోక్తి కాదు. భారత్‌లో కనీసం ఆరు శాతం ప్రజలు స్థూలకాయం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిత్రం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స్థూలకాయం సమస్య ఎంత విపరీతంగా పెరుగుతోందో, భారత్‌లోనూ అదే తరహాలో అధికమవుతోంది. దేశంలోనే కాదు... తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లూ ఈ తరహా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ 18 శాతం పురుషుల్లో, 23 శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నెల 26న ప్రపంచ స్థూలకాయం దినం సందర్భంగా ఈ సమస్య తీవ్రతనూ, అది తెచ్చే ఆరోగ్యఅనర్థాలపై అవగాహన కోసం ఈ కథనం. స్థూలకాయం అంటే...? ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారి, బరువు పెరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలమానం ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి బరువును కిలోల్లో తీసుకుని, దాన్ని ఆ వ్యక్తి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి భాగించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలు, ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ.x 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను ఈకింద ఉన్న ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు అన్నది నిర్ణయిస్తారు. ఇది ఇలా... వర్గీకరణ బీఎంఐ (కిలోలు / మీ. స్క్వేర్) ------------------------------------------------------- తక్కువ బరువు 18.5 కంటే తక్కువ సాధారణ బరువు 18.5 నుంచి 22.9 వరకు అధిక బరువు 23 నుంచి 24.9 వరకు స్థూలకాయానికి ముందు 25 నుంచి 29.9 వరకు ఒబేస్ క్లాస్ 1 30.0 నుంచి 34.9 వరకు ఒబేస్ క్లాస్ 2 35.0 నుంచి 39.9 వరకు ఒబేస్ క్లాస్ 3 40 కంటే ఎక్కువ ------------------------------------------------------ స్థూలకాయానికి కారణాలు జన్యుపరమైనవి : కొందరిలో జన్యుపరమైన కారణాలతో హార్మోన్ల పనితీరు అధికమై అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది.. ఈ క్యాలరీల వల్ల కొవ్వు పేరుకుపోవచ్చు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం : తగినంత శరీరక శ్రమ లేపోవడం వల్ల శరీరం తగినన్ని క్యాలరీలను కోల్పోక వాటిని నిత్యం నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది. అనారోగ్యకరమైన తినే అలవాట్లు : ఈ రోజుల్లో మనలో చాలామంది అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం వల్ల బరువు పెరుగుతున్నారు. మహిళల విషయంలో గర్భధారణ కూడా : గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు బిడ్డ పుట్టాక కూడా తాము పెరిగిన బరువును కోల్పోరు. ఇది అనర్థాలకు కారణం కావచ్చు. నిద్రలేమి : సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడి, క్రమంగా అది బరువు పెరగడానికి దోహదం చేస్తుంటుంది. కొన్ని రకాల మందులు : యాంటీడిప్రెసెంట్ మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ నియంత్రణకు వాడే మందులు, మానసిక వ్యాధులకు వాడే మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ స్థూలకాయానికి దారితీయవచ్చు. కొన్ని రకాల వ్యాధులు : ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణం కావచ్చు. ఉదాహరణకు ప్రెడర్-విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధుల్లో అది స్థూలకాయానికి దారితీయవచ్చు. బరువు తగ్గడానికి అనువైన మార్గాలు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. అవి... ఆరోగ్యకరమైన జీవన శైలి : మనం నిత్యజీవితంలో ఆచరించే ఆహార, వ్యాయామ విధానాల ద్వారానే బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. వాటిని ఆచరిస్తూ మన మీద మనకు ఉన్న నమ్మకంతో ‘మనం చేయగలం’ అనుకుంటూ బరువు తగ్గడం. మందులతో/వైద్య ప్రక్రియలతో... ఆరోగ్యకరమైన రీతిలో మనం రోజూ అనుసరించే మామూలు మార్గాల్లోనే అధిక బరువు సమస్యను అధిగమించకపోతే... ఒక్కోసారి పేషెంట్ కండిషన్‌ను బట్టి మందులు, డాక్టర్ల సాయంతో బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అది రెండు రకాలుగా జరగవచ్చు. అవి... 1. అధిక బరువు తగ్గడానికి అవసరమైన వైద్య విధానాలు ఆచరించడం / మందులను వాడటం 2. స్థూలకాయం వల్ల వచ్చిన ఆరోగ్యసమస్యలకు మందులు వాడటం. అధిక బరువు / స్థూలకాయం ఉన్నవారికి వైద్యపరమైన జాగ్రత్తలతో మందులు వాడుతున్నప్పుడు వైద్యప్రక్రియ మూడు రకాలుగా ఉంటుంది. అది... అధికబరువు / స్థూలకాయం ద్వారా వచ్చిన ఆరోగ్య సమస్యను తగ్గించేందుకు మందులు వాడటం. ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం. ఏవైనా తినడానికి సంబంధించిన సమస్య (ఈటింగ్ డిజార్డర్) ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. ఇలా ఈ మూడు మార్గాలను కలగలపిన ఆరోగ్య ప్రణాళిక ద్వారా పేషెంట్ బరువును నియంత్రిస్తూ ఉండటం వంటివి చేస్తారు. స్థూలకాయాన్ని తగ్గించడానికి అవసరమైన శస్త్రచికిత్స మార్గాలు : స్థూలకాయం వల్ల కలిగే అనర్థాలు ఒక్కోసారి రోగికి ప్రాణాపాయానికి దారితీసేలా ఉంటే అప్పుడు సంప్రదాయ విధానాల ద్వారా బరువు తగ్గించడానికి బదులు డాక్టర్లు శస్త్రచికిత్స ప్రక్రియలను అనుసరించడానికి మొగ్గుచూపువచ్చు. అయితే ఇది అందరి విషయంలోనూ జరగదు. ఇలా ఒక లావుగా ఉన్న వ్యక్తి బరువు తగ్గించడానికి శస్త్రచికిత్సను సూచించడం కొన్ని పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఆ పరిస్థితులేమిటంటే... రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం. ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... రోగి పురుషుడైతే అతడి బరువు 45 కిలోల కంటే ఎక్కువ ఉండటం / అదే స్త్రీ అయితే ఆమె బరువు సాధారణ బరువు కంటే 35 కిలోలు అధికంగా ఉండటం. ఒక వ్యక్తికి తన బీఎంఐ విలువ 35 - 40 మధ్యన ఉంటే అతడికి స్థూలకాయం వల్ల వచ్చే అనర్థాలైన టైప్-2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం. స్థూలకాయం వల్ల రోగికి ప్రాణాపాయం ఉంటే... అతడి స్థూలకాయాన్ని తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స వల్ల అతడికి, బరువు పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలనుంచే కొంత ఉపశమనం కలగవచ్చు. అవి... రక్తంలోని చక్కెర పాళ్లు తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం, గురకను తగ్గించడం, గుండెపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించడం, రక్తంలోని ఒక రకం కొవ్వులైన కొలెస్ట్రాల్ పాళ్లనూ తగ్గించడం వంటివి. అయితే అంతమాత్రాన ప్రాణాపాయం కలిగించేటంతగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ప్రతి సందర్భంలోనూ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాకపోవచ్చు. రోగి వ్యక్తిగత పరిస్థితితో పాటు అనేక అంశాలను గమనించి ఈ తరహా శస్త్రచికిత్సను చేయాల్సి ఉంటుంది. రోగి బరువు తగ్గించడానికి చేసే శస్త్రచికిత్సను ‘బేరియాట్రిక్ సర్జరీ’ అంటారు. ఇలా చేసే శస్త్రచికిత్సలు మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1. మాల్ అబ్సార్ప్టివ్ 2. రెస్ట్రిక్టివ్ 3. పై రెండు అంశాలనూ కలగలిపిన శస్త్రచికిత్సలు. 1. మాల్ ఆబ్సార్ప్టివ్ తరహా శస్త్రచికిత్స : ఈ తరహా శస్త్రచికిత్స వల్ల రెస్ట్రిక్టివ్ తరహా కంటే ఎక్కువగా బరువు తగ్గుతారు. ఈ తరహా శస్త్రచికిత్సలో భోజనం స్వతహాగా జీర్ణమయ్యే మార్గం నుంచి ఆ ఆహారాన్ని ఇతర మార్గానికి మళ్లిస్తారు. అందువల్ల ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపు, చిన్నపేగుల్లోని మార్గంలో చాలా తక్కువగా ప్రయాణిస్తుంది. అందుకే ఈ తరహా చికిత్సను ‘‘గ్యాస్ట్రిక్ బైపాస్’’ అని కూడా వ్యవహరిస్తారు. 2. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ : ఇందులో ఆహారం ప్రయణించే మార్గాన్ని బై-పాస్ చేయకుండా పేగుల్లో జీర్ణమయ్యే ఆహారపు మార్గాన్ని శస్త్రచికిత్స మార్గాల ద్వారా కుదిస్తారు. ఉదా: కడుపు సైజును గణనీయంగా తగ్గించడం. దీని వల్ల కడుపులో పట్టే ఆహారపు పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీన్నే ‘స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ’ ప్రక్రియ అంటారు. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్లు ఎంతో కొంత మేరకు కడుపు కుదించడం జరుగుతుంది కాబట్టి బేరియాట్రిక్ సర్జరీలలోని ఈ ప్రక్రియ అన్నిట్లోనూ ఎక్కువగా చోటుచేసుకుంటుంది. అదే మెటబాలిక్ తరహా సిండ్రోమ్‌లు ఉన్నవారి పరిస్థితిని మెరుగుపరచడానికి మాల్ అబ్సార్ప్టివ్ ప్రొసీజర్లను అనుసరిస్తూ ఉంటారు. రకరకాల గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్సలు రూక్స్ ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్ (ఆర్జీబీ) : ఇది గ్యాస్ట్రిక్ బై-పాస్ ప్రక్రియలన్నింటిలోనూ చాలా సాధారణంగా చేసే శస్త్రచికిత్స. ఇందులో రెస్ట్రిక్టివ్, మాల్అబ్సార్ప్టివ్... కలగలసి ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత రోగి తన బరువులో మూడింట రెండు వంతుల బరువును తగ్గించవచ్చు. ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై-పాస్ చేస్తూ నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచి రూపొందేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో చిన్నపేగుల ఆకృతి ‘వై’ అక్షరంలా ఉంటుంది. ఇలా చేసే శస్త్ర చికిత్సలో జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని మొదటి భాగమైన ‘డియోడినమ్’లోకి కాకుండా నేరుగా రెండో భాగమైన జిజినమ్ అనే చోట పేగుల్లోకి ప్రవేశిస్తుంది. దాంతో జీర్ణమయ్యే భాగాల్లో ఆహారం ఇంకకుండా పోతుంది. ఫలితంగా ఆహారంలోని అదనపు క్యాలరీలు శరీరంలోకి రావు. గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స వల్ల వచ్చే రిస్క్‌లు అయితే గ్యాస్ట్రిక్ బైపాస్ వల్ల కొన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యే నిడివిని తగ్గించడం వల్ల తగినంత ఆహారం, పోషకాలు రక్తంలోకి ఇంకవు. ఫలితంగా అనీమియా (రక్తహీనత) రావచ్చు. అంతేకాదు... కీలకమైన ఐరన్, విటమిన్ బి12 వంటివి శరీరానికి తగినంతగా అందకపోవచ్చు. ఫలితంగా ఒక్కోసారి ఈ శస్త్రచికిత్స తర్వాత ఆస్టియోపోరోసిస్ వంటి పరిస్థితులూ రావచ్చు. డంపింగ్ సిండ్రోమ్ అనే మరో కండిషన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రొసిజర్ ఇది. ఇందులో రోగికి వికారం, చెమటలు పట్టడం, స్పృహతప్పిపడిపోవడం, బలహీనంగా మారడం, నీళ్లవిరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటి రిస్క్‌లు ఉన్నప్పుడు మరో అదనపు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ : ఈ ప్రక్రియలో కడుపును మూడింట రెండు వంతుల కుదిస్తారు. సంచి లాంటి కడుపు భాగాన్ని ఒక అరటిపండు ఆకృతికి పరిమితమయ్యేలా తగ్గిస్తారు. ఒకసారి ఈ ప్రక్రియను అనుసరిస్తే మళ్లీ కోల్పోయిన కడుపు భాగాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియ తర్వాత స్థూలకాయంతో బాధపడే రోగి 6 నుంచి 12 నెలల వ్యవధిలోనే తన బరువులో 70 శాతాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంది. ఇంతగా కడుపును కుదించడం వల్ల... ఆహారాన్ని చాలా చిన్న మోతాదుకు తగ్గించాల్సి ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీపై అపోహలు బరువును తగ్గించడానికి చేసే బేరియాట్రిక్ సర్జరీలపై ప్రజల్లో ఎన్నో అపోహలూ... వివాదాలూ ఉన్నాయి. వాటిలో మొదటిది... బరువును తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని సులభమైన మందులు ఉండగా రోగికి శస్త్రచికిత్స అనవసరం. కానీ వాస్తవం ఏమిటంటే... రోగి బరువును ఠక్కున తగ్గించే మ్యాజిక్ మందు అంటూ ఏదీ లేదు. ఇలా ఉందని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు. రెండో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగికి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఈ తరహా సర్జరీ మృత్యువుకూ దారి తీయవచ్చు. అయితే ఇది పూర్తిగా తప్పు. నిజానికి సర్జరీ చేయకపోవడం వల్లనే అతడి బరువు అతడిని కబళించే పరిస్థితుల్లోనే డాక్టర్లు రోగులకు ఈ తరహా సర్జరీలను సిఫార్సు చేస్తారు. మూడో అపోహ : బేరియాట్రిక్ సర్జరీ తర్వాత రోగి తన మామూలు ఆహారాన్ని తీసుకోలేడు. వాస్తవం ఏమిటంటే... సర్జరీ తర్వాత కూడా రోగి తన సాధారణ ఆహారాన్నే తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే తక్కువ మోతాదుల్లో డాక్టర్లు సూచించిన విధంగా. తక్షణ ప్రాణాపాయ ప్రమాదం ఉన్న రోగులు మినహా మిగతా వారు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్గాలతో బరువు తగ్గడం ఎంతో మేలు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం... శస్త్రచికిత్స తర్వాత రోగి ఘనాహారం తీసుకోవడం ప్రారంభించాక... ఆహారాన్ని బాగా, చాలాసేపు, నింపాదిగా నమిలాకే మింగాలి. ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణమయ్యే పరిస్థితిని శస్త్రచికిత్స ద్వారా తగ్గిస్తారు కాబట్టే ఈ జాగ్రత్త. ఆహారం తీసుకునే సమయంలో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే ఒక్కోసారి అది వెంటనే వాంతి అయ్యేందుకు దోహదపడవచ్చు. లేదా డంపింగ్ సిండ్రోమ్‌కు దారితీయవచ్చు / తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, అన్నం తర్వాత తీసుకునే పాయసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. చాలా కొద్ది పరిమాణంలోనే వాటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్ లేదా హైక్యాలరీ సప్లిమెంట్స్ ఉండే పానీయాలు, మిల్క్‌షేక్‌లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా మానేయాలి. మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఆహారానికి, ఆహారానికి మధ్య తీసుకునే చిరుతిండ్లను గణనీయంగా తగ్గించాలి. స్థూలకాయం వల్ల అనర్థాలు స్థూలకాయం ఒక పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. నడుస్తున్నప్పుడు తమ భారాన్ని తమ శరీరమే భరించలేకపోవచ్చు. తమ శరీర బరువు వల్ల సరిగా శ్వాసతీసుకోలేకపోవచ్చు. స్థూలకాయం డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండెజబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు కారణం కావచ్చు. బేరియా ట్రిక్ శస్త్రచికిత్స తర్వాత జీవితంఎలా ఉంటుంది? మన జీవనంలోని నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికే ఈ తరహా శస్త్రచికిత్సలు. ఒంటి బరువు తగ్గడం వల్ల రోగి కదలికలు చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరంగా అనిపించడం చాలా సాధారణం. అయితే రోగి కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. -
బీమారీ.. హైదరాబాదీ
భాగ్యనగరం.. ఇప్పుడొక కాలుష్య కాసారం.. తినే తిండి దగ్గరి నుంచి, తాగే నీరు, పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితమే. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల్సిన నగరవాసులు.. జబ్బుల బారిన పడుతున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కనీసం బెడ్ దొరకని దుస్థితి. వివిధ రకాల జబ్బులపై ప్రత్యేక కథన ం! - నోముల శ్రీశైలం/ సాక్షి, సిటీబ్యూరో కొవ్వు కేక.. స్థూలకాయం... వందలో ఏ ఒక్కరిలోనో కన్పించేది. అది కూడా జన్యు సంబంధంతో కూడినదై ఉండేది. 2005లో స్థూలకాయుల సం ఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం ప్రతి ఆరుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు నోవా ఆస్పత్రికి చెందిన ప్రముఖ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహిధర్ వల్లెటి చెప్పారు. అంటే గ్రేటర్లో సుమారు కోటి జనాభా ఉంటే, అందులో ఐదు లక్షల మంది అధిక బరు వుతో బాధపడుతున్నారన్నమాట. తగ్గిన శారీరక శ్రమ.. నిశీరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జా లు, బర్గర్లు... వెరసి శరీరంలో కొవ్వును పేర్చేస్తున్నాయి. పీలగా ఉన్న వారిని సైతం పీపాలా తయా రు చేస్తున్నాయి. ఇది ఒక జబ్బు కాకపోవచ్చు కానీ, అనేక ఇతర జబ్బులకు కారణం అవుతోంది. సంతాన లేమితో సతమతం ఉరుకుల పరుగుల జీవితం.. రోజంతా కంప్యూటర్లతో సహవాసం.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఉపాధి.. ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి.. వెరసి దంపతుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్య ఒక షిఫ్టులో పని చేస్తే.. భర్త మరో షిఫ్టులో పని చేయాల్సి వస్తోంది. ఫలితంగా స్త్రీ, పురుషుల హార్మోన్లలో సమతుల్యత లోపించి, సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటీహబ్‌గా పేరుగాంచిన హైటెక్నగరంలో ప్రస్తుతం నూటికి 30 శాతం మంది ఐటీ దంపతులు పిల్లల కోసం పరితపిస్తున్నారు. వీరిలో 20 శాతం దంపతులు సంతాన సాఫల్య కేంద్రాల (ఇన్ ఫెర్టిలిటీ సెంటర్లు)ను ఆశ్రయిస్తుండగా, ఏడు శాతం మంది టెస్ట్‌ట్యూబ్ బేబీని, మూడు శాతం ‘సరోగేట్ మదర్స్’వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కిడ్నీ జబ్బుల్లో గ్రేటరే టాప్ కిడ్నీ జబ్బుల్లోనూ గ్రేటర్ అగ్రస్థానంలోనే ఉంది. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-12 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిమ్స్ వైద్యుల సర్వేలో వెల్లడైంది. ఇటీవల ఎయిమ్స్, నిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో కిడ్నీ జబ్బుల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమస్థానంలో ఉన్నట్లు తేలింది. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 15,000 మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, ఏటా 200 ైపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాం టేషన్లు జరుగుతున్నాయి. ఒక్క నిమ్స్‌లోనే ఏటా 70-80 శస్త్రచికిత్సలు చేస్తుండగా, నిత్యం ఇక్కడ 300 మంది చికిత్స పొందుతున్నట్లు కిడ్నీ మార్పిడి శ స్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ శ్రీ భూషణ్‌రాజు స్పష్టం చేశారు. శ్వాసా కష్టమే నగరంలో ఐదు శాతం మంది పెద్దలు, 20 శాతం మంది చిన్నారులు శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణంలో ఓజోన్ 100 మైక్రోగ్రాములు దాటకూడదు. కానీ, పగటివేళ 120-150 మైక్రోగ్రాము లు దాటుతోంది. సీసం, ఆర్సెనిక్, నికెల్ వంటి భారలోహ మూలకాలు కలిగిన గాలి పీల్చడం ద్వారా నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. కాలుష్యం వల్ల ముక్కు ద్వారాలు మూసుకుపోయి గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. బ్రెస్ట్ కేన్సర్‌తో బేజార్ ఐఏఆర్సీ సర్వే ప్రకారం దేశంలో ఏటా కొత్తగా పది లక్షల కేన్సర్ కేసుల నమోదు అవుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే పదివేల కేసులు నమోదు అవు తున్నట్లు సమాచారం. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్ తక్కువగా ఉన్నా... రొమ్ము కేన్సర్ మాత్రం రెట్టింపవు తోంది. ప్రతి వంద కేన్సర్ బాధితుల్లో 60 శాతం రొ మ్ము, 40 శాతం గర్భాశయ ముఖద్వార కేన్సర్ బాధితులే. ఇక పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా 2 లక్షల కేన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. అంతే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా 40కి పైగా కేన్సర్ ఆస్పత్రులు హైదరా బాద్లోనే ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రోడ్డెక్కితే గుల్లే బైక్ నడిపేవారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారును నడిపేవారు నడుము, పిరుదులు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వీరు సరైన భంగిమలో కూర్చోక పోవడం వల్ల గుంతల్లో ఎత్తేసిన ప్రతిసారీ డిస్క్‌ల మధ్య కదలికలు ఎక్కువై జాయింట్స్ అరిగి పోతున్నాయని యశోద ఆస్పత్రికి చెందిన స్పైన్ సర్జన్ డాక్టర్ కె.సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ఓపీకి వ స్తున్న బాధితుల్లో 60 శాతం మంది వెన్ను, ఇతర ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారేనని సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సుబ్బయ్య చెప్పారు. పంజా విసురుతున్న 15 రకాల స్వైన్ ఫ్లూ కారకవైరస్లు 60 % మోకాళ్లు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నవారు 6 లక్షలు హృద్రోగులు 25 లక్షలు నగరంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,132 గత నాలుగేళ్లలో డెంగీ, మలేరియా బారిన పడినవారు 1,993 గత నాలుగేళ్లలో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య 5,00,000 స్థూలకాయంతో బాధ పడుతున్నవారు 1012 లక్షలు కిడ్నీ సంబంధిత రోగుల సంఖ్య 15 రకాల స్వైన్ ఫ్లూ కారక వైరస్లు ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన హెచ్1ఎన్1ఇన్‌ఫ్లూయెంజా(స్వైన్‌ఫ్లూ)వైరస్ నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ మాసాల్లో విస్తరించే ఈ వైరస్ ఏడాది పొడవునా తన ఉణికిని చాటుకుంటూనే ఉంది. ప్రతికూల పరిస్థితుల వల్ల గ్రేటర్ వాతావరణంలో 15 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్లు ఉన్నట్లు ఎర్రగడ్డ ఛాతీ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్వైన్‌ఫ్లూ వైరస్ కూడా ప్రస్తుతం సాధారణ వైరస్‌లా మారిపోయింది. 2009లో 840 మంది దీని బారిన పడగా, 2010లో 784 మంది, 2011లో 9 మంది, 2012లో 314 మంది, 2013లో 17 మంది, 2014లో 29 మంది స్వైన్ ప్లూ బారిన పడ్డారు. డెంగీ, మలేరియా సరే సరి.. పారిశుద్ధ్య నిర్వహణ లోపం, రోడ్లపై పారు తున్న మురుగు నీటితో గ్రేటర్ కంపు కొడుతోంది. పందుల స్థానంలో నేడు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ ఆస్పత్రిలోకి తొంగి చూసినా డెంగీ, మలేరియా బాధితులే దర్శనమిస్తారు. 2009లో 329 మలేరియా కేసులు నమోదు అయితే 2012లో 528 కేసుల నమోదు అయ్యా యి. అదే విధంగా 2009లో 525 డెంగీ కేసులు వెలుగు చూస్తే 2012లో 750కి పైగా కేసులు వెలుగు చూశాయి. 17 మందికిపైగా మృత్యువాత పడ్డారు. గుండె గుభేల్... నగరం కేవలం రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాదు, తాజాగా గుండె నొప్పికి కేంద్ర బిందువుగా మారుతోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం గుండె జబ్బులు చాలా అరుదు. వేయి మందిలో ఎవరో ఒకరికి మాత్రమే అన్నట్లుగా ఉండేది. కానీ నేడు ఏ కార్పొరేట్ ఆస్పత్రి గడపతొక్కినా.. నిత్యం 70-100 మంది హృద్రోగులే తారసపడతారు. వీరిలో 50 ఏళ్ల లోపు వారే ఎక్కువ. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచంలో ప్రతి వంద మందిలో ముగ్గురు గుండె నొప్పితో బాధపడుతుండగా, గ్రేటర్లో ఐదు నుంచి ఆరుగురు ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.‘తాను పని చేస్తున్న సన్‌షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రతినెలా 500 మందికి డయాగ్నైస్ చేస్తే, అందులో 150-200 మందికి యాంజియోప్లాస్టీ చే స్తున్నాం. 130-150 మందికి మినిమల్లీ ఇన్వేసివ్, బైపాస్ సర్జరీలు చేస్తున్నాం. ఇలా ఏడాదికి ఏడు వేల మందికి చికిత్స చేస్తున్నాం. అంతేకాదు ప్రపంచంలో మరెక్కడా లేనన్ని క్యాథ్‌ల్యాబ్స్, ఎంఆర్ఐ మిషన్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని డాక్టర్ శరత్‌కుమార్ తెలిపారు. తియ్య తియ్యగా చక్కెర వ్యాధి.. పాతికేళ్ల క్రితం చాలా అరుదు. ప్రస్తుతం నగరంలో ప్రతి పదిమందిలో ఇద్దరి నుంచి ముగ్గురు మధుమేహంతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఇది రెట్టింపయ్యే అవకాశముంది. గ్రేటర్లో 22-25 శాతం మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. అంటే గ్రేటర్ జనాభా సుమారు కోటి ఉంటే, 25 లక్షల మంది మధుమేహులే అన్నమాట. బాధితుల్లో 40 ఏళ్లు దాటినవారు 85-95 శాతం మంది, 18 ఏళ్ల లోపు వారిలో 10-15 శాతం మంది ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని నిమ్స్ డయా బెటిక్ సెంటర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు. -
ఎడమచేతి వాటం అబ్బాయిలు మేధావులా?
మనిషికి హార్మోనల్ ప్రభావం వల్ల వచ్చేదే ఎడమచేతి వాటం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పది శాతం జనాభా ఎడమచేతి వాటం వారే! ఎడమచేతి వాటం వారి మానసిక, శారీరక పరిస్థితులను కొన్ని సర్వేలు ఇటీవల వెలుగులోకి తెచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యు.కె.కి చెందిన రీసెర్చ్ సర్వే ఆన్ లెఫ్టీ వంటి సామాజిక పరిశోధన సంస్థలు వివిధ దేశాలలో చేసిన అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటమున్న మహిళలతో పోలిస్తే మగాళ్ల సంఖ్య 50 శాతం ఎక్కువ. 11 శాతం మంది ఎడమచేతి వాటంవారిలో, తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మాత్రం లెఫ్ట్ హ్యాండర్లు. కేవలం 1.4 శాతం మంది ఎడమచేతి వాటం వారి తల్లిదండ్రులిద్దరూ ఎడమచేతి వాటం వాళ్లే. మిగతావారికి మాత్రం జన్యు నేపథ్యం లేకుండానే ఎడమచేయి అలవాటుగా మారింది. ఎడమచేతి వాటాన్ని గుర్తించడానికి ప్రధానమైన ఆధారం రాత. లెఫ్ట్ హ్యాండర్స్‌లో 98 శాతంమంది ఎడమచేతితోనే రాస్తున్నారట. మిగతా పనుల్లో మాత్రం వీరు ఎడమచేతికి కొద్దిగా పని తగ్గిస్తున్నారట. టూత్‌బ్రష్, స్పూన్, కత్తెర, కత్తి వంటివి ఎడమ చేతితో ఉపయోగించే వారి శాతం 60 - 70 మధ్యలో ఉంది. మిగతా వారు మాత్రం ఈ పనులను కుడి చేత్తోనే చేసుకొంటున్నారు! ఎడమచేతి వాటం వారిలో ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువేనట. 58 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ తాము మేధావులమని, ఇతరులకంటే తెలివైనవారమని చెప్పారట. 48 శాతంమంది ఇతరులతో పోల్చుకొన్నప్పుడు తమలో సృజనాత్మకత ఎక్కువ స్థాయి లో ఉందని, ఇతరులకంటే భిన్నంగా ఉన్నందున అందరూ తమను విచిత్రంగా చూశారని 71 శాతం లెఫ్ట్ హ్యాండర్స్ అన్నారట. అయితే తమ చేత కుడిచేత్తో రాయించాలని చాలామంది ప్రయత్నించారని లెఫ్ట్ హ్యాండర్స్ చెప్పారు. ఇక కంప్యూటర్ మౌస్ వంటివి ఎడమచేతి వాటం వారికి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం 38 శాతంమంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. 40 శాతంమంది లెఫ్ట్ హ్యాండర్స్ ‘ఆర్ట్’పై ఆసక్తిని చూపుతున్నారట. కొన్ని హారర్ సినిమాలను ఎడమచేతి, కుడి చేతి వాటాల వారికి ఒకేసారి చూపించగా... ఎడమచేతి వాటం వారిలో ఎక్కువ భీతి కనిపించిందని అధ్యయనకర్తలు అన్నారు. 17 శాతం మంది కవలలు ఎడమచేతి వాటంవారే! ఇక ఎడమచేతి వాటం అబ్బాయిలు గర్వించదగ్గ విషయాన్నొకటి చెప్పారు విశ్లేషకులు. ఏ పనికైనా ఎడమచేతిని ఉపయోగించే అబ్బాయిలంటే అమ్మాయిల్లో ఏదో ఆకర్షణ భావం కలుగుతుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.