టూకీగా ప్రపంచ చరిత్ర 60
జాతులు-నుడికారాలు
‘అడాప్షన్’ పద్ధతిని తెలుసుకోవాలంటే మన మధ్యనే మెలిగే మనుషులను జిజ్ఞాసతో పరిశీలిస్తే చాలు - ఒక రకమైన అవగాహన ఏర్పడుతుంది. సున్నితమైన చర్మంరంగుతో పుట్టిన మనిషి పొలం పనుల మూలంగా ఎండ తాకిడికి గురికావడంతో చర్మం నలుపెక్కి నాణ్యత కోల్పోతాడు. ఎండపొడ సోకకుండా పెరిగిన మనిషికి నలుపు తగ్గి చర్మం నాజూగ్గా తేలుతుంది. అలాగే, ఎదిగే పిల్లలు యవ్వనానికి చేరువౌతున్న కొద్దీ, ‘హార్మోన్ల’ ప్రేరణ కారణంగా, చర్మంలో లావణ్యం పెరుగుతుంది. దీన్నిబట్టి, మనిషి బాహ్య లక్షణాల్లో కనిపించే తేడాలకు కారణాలు సవాలక్ష. అతడు నివసించే ప్రదేశం, అక్కడి వాతావరణం, అతని జీవనసరళి, ఆహారపుటలవాట్లూ, ఆత్మరక్షణకు అవసరమైన జాగ్రత్తలూ మొదలైన అంశాలెన్నో అందులో ఇమిడివుంటాయి.
ఎప్పుడో లక్షలాది సంవత్సరాలకు పూర్వం, నిటారుగా నడిచే జంతువు తన రాతి పనిముట్లతో నేల నాలుగు చెరగులకూ విస్తరించింది. ఆ తరువాత, చరిత్రకు తెలిసినంత మేరకు, దాదాపు 20వేల సంవత్సరాల ముందు నుండి కొత్త రాతియుగం మానవుడు అదేవిధంగా విస్తరించడం మొదలెట్టాడు. వారి మధ్యకాలం ఎంతో దీర్ఘమైనది కావడం వల్ల ఆ రెండు తరహాల వారి పోలికల్లో తేడాలు అప్పటికే ఏర్పడివుండాలి. విస్తరణ మార్గంలో సంభవించే పరస్పర సంపర్కం వల్ల మరో తరహా బాహ్య లక్షణాలు కూడా ఉనికిలోకి వచ్చుండాలి. సంచార జీవితం తెరమరుగవుతున్న తరుణంలో, అనుకూలత దొరికిన తావుల్లో గుంపులు గుంపులుగా మానవుడు స్థిరనివాసానికి పునాదులు వేసుకుంటున్న కాలంలో, గుంపుల మధ్య ఏర్పడిన తగాదాలూ, శరీరాల్లోని బాహ్యలక్షణాలూ కలగాపులగంగా కలిసిపోయి జాతిభేదాలకు విత్తనం పడివుండాలి. చరిత్రనూ, చెట్లమీదా జంతువుల మీదా జరిగిన ప్రయోగాలనూ ఆధారం చేసుకుని వీటిని ఊహించాలే తప్ప, బాహ్యశరీరానికి సంబంధించి కాలానికి నిలబడగలిగిన సాక్ష్యాలను సేకరించడం శాస్త్రానికి అసాధ్యమైన విషయం.
ఈ సంబంధంగా పురాతన సాహిత్యంలోనైనా తగినంత ఆధారం మనకు దొరకడం లేదు. లిపి ఏర్పడకపూర్వమే ఉద్భవించిన సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి ‘రుగ్వేదం’, ‘అవెస్టా’లు. రుగ్వేదంలో దేవతలు, దైత్యులు అనబడే వర్గాలు మాత్రమే కనిపిస్తాయి.
ఆ తెగలు రెండూ కశ్యప ప్రజాపతి సంతానమే. దితి, అదితి ఆయన భార్యలు. సంస్కృత సంప్రదాయం ప్రకారం ‘దితి’ కానిది ‘అదితి.’ బహుశా అదితి కంటే ముందే దితి ఆయనకు భార్యై ఉండొచ్చు. దితికి పుట్టినవాళ్ళు దైత్యులు లేక అసురులు. అదితి పుట్టినవాళ్ళు ఆదితేయులు లేదా దేవతలు. ఈ రెండువర్గాల మధ్య శత్రుత్వం, అడపాదడపా మైత్రీబంధాలూ తప్ప రుగ్వేదంలో జాతులకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించవు. అవెస్టా సిద్ధాంతం రుగ్వేదానికి పూర్తిగా విరుద్ధం. రుగ్వేదంలో దేవతలు ఏవిధంగా ఆరాధించబడ్డారో, అవెస్టాలో అసురులు అదేవిధంగా ఆరాధించబడ్డారు. రుగ్వేదాన్ని గానం చేసేవాళ్ళు ఆర్యులైతే, అవెస్టాను గానం చేసేవాళ్ళు జొరాస్ట్రియన్లు. వీళ్లిద్దరూ ఒకే నాణేనికి బొమ్మాబొరుసులుగా కనిపిస్తారు. బహుశా, దాయాది మత్సరం వాళ్లను రెండు పాయలుగా చీల్చిందో ఏమో!
వీటి తరువాతి కాలానిది ‘బుక్ ఆఫ్ జెనిసిస్ (బైబిల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్).’ దీంట్లో మానవుడు జాతులుగా విడిపోవడానికి కారణాన్ని సూచించేది ‘టవర్ ఆఫ్ బేబెల్’ కథ. కాలాతీతమైన సాంకేతిక నైపుణ్యంతోనూ, మూకుమ్మడి శ్రమతోనూ మెసపటోమియాలో ఒకానొకచోట నిర్మించిన గోపురాన్ని టవర్ ఆఫ్ బేబెల్ అన్నారు. హిబ్రూ భాషలో ‘బేబెల్’ అంటే అర్థం ‘అయోమయం’ అని. మానవజాతిని అయోమయంలో పడేసేందుకు కారణమైంది గాబట్టి, ఆ గోపురాన్ని ‘టవర్ ఆఫ్ బేబెల్’ అన్నారు. (ఆ కథ ఏమిటో ... రేపటి సంచికలో..)
రచన: ఎం.వి.రమణారెడ్డి