గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా? | Funday cover story special 19-05-2019 | Sakshi
Sakshi News home page

గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా?

Published Sun, May 19 2019 12:27 AM | Last Updated on Sun, May 19 2019 12:27 AM

Funday cover story special 19-05-2019 - Sakshi

గ్రాముల్లో తింటున్నా కిలోల్లో పెరిగిపోతున్నారా?సన్నగా తిన్నా లావెక్కిపోతున్నారా?...చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? నిష్కారణంగా కుంగిపోతున్నారా?
అనవసరంగా చిర్రుబుర్రులాడుతున్నారా?...ఇందులో మీ తప్పేమీ లేదు. ఇదంతా థైరాయిడ్‌ తెచ్చిపెట్టిన ముప్పు కావచ్చు. అలాగని కంగారు పడకండి. వైద్యులను సంప్రదించి, పరీక్షలు జరిపించుకోండి.  చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుకోండి.

థైరాయిడ్‌ సమస్యలు ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారాయి. థైరాయిడ్‌ గ్రంథిలో తలెత్తే అసమతుల్యతల కారణంగా వచ్చే సమస్యల్లో హైపో థైరాయిడిజమ్, హైపర్‌ థైరాయిడిజమ్‌ ప్రధానమైనవి. హైపర్‌ థైరాయిడిజమ్‌తో పోలిస్తే హైపో థైరాయిడిజమ్‌తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో దాదాపు 4.20 కోట్ల మందికి పైగా హైపో థైరాయిడిజమ్‌ బాధితులు ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే మన దేశంలో ప్రతి పదిమంది వయోజనుల్లో ఒకరు హైపో థైరాయిడిజమ్‌ బాధితులేనని చెప్పవచ్చు. గడచిన ఇరవై ఏళ్లలో భారత్‌లో హైపో థైరాయిడిజమ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. మన దేశ జనాభాలో దాదాపు 11 శాతం మంది థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతుంటే, అమెరికాలో 4.6 శాతం, బ్రిటన్‌లో 2 శాతం మంది మాత్రమే ఈ సమస్యలతో బాధపడుతున్నారు.  థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వారి సంఖ్య మన దేశంలో మరింత ఎక్కువగానే ఉండవచ్చని, చాలామంది ఎలాంటి పరీక్షలూ చేయించుకోకుండానే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తూ ఉంటారని, వేరే ఏ జబ్బుతోనో బాధపడి ఆస్పత్రికి చేరితే, వైద్యుల సూచనతో జరిపించుకునే పరీక్షల్లో థైరాయిడ్‌ సమస్యలు బయటపడటం మన దేశంలో సర్వసాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్‌ గురించి, దాని పనితీరు గురించి, పనితీరులో తలెత్తే లోపాలు, వాటి వల్ల తలెత్తే సమస్యల గురించి, థైరాయిడ్‌ సమస్యల నియంత్రణ, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం.

కొలిమిలా పనిచేస్తుంది
థైరాయిడ్‌ గ్రంథి నిరంతరం కమ్మరి కొలిమిలా పనిచేస్తూ ఉంటుంది. ఒకే వేగంతో ఎప్పుడూ ఒకేలా శరీరంలోని కోటాను కోట్ల కణాలన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటుంది. థైరాయిడ్‌ పనితీరులో ఏమాత్రం వేగం తగ్గినా స్థూలకాయం వస్తుంది. ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపిస్తుంది. అలసట ముంచుకొస్తుంది. కదలికలు మందగిస్తాయి. థైరాయిడ్‌ పనితీరులో వేగం కాస్తంత పెరిగితే మాత్రం విపరీతంగా ఆకలి వేస్తుంది. అయితే, ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపోతుంది. కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా అవుతాయి. కనురెప్పలు మూసినా మూసుకుపోనట్లుగా కనుగుడ్లు బయటకు కనిపిస్తుంటాయి. అస్థిమితంగా, చూడటానికి మానసిక రోగిలా తయారవుతారు.

థైరాయిడ్‌ గ్రంథి చిన్న స్థలంలో నెలకొల్పిన పెద్ద రసాయనిక కర్మాగారంలా పనిచేస్తుంది. దీని నుంచి అత్యంత సంక్లిష్ట రసాయనాలు ఉత్పత్తవుతూ ఉంటాయి. దీని నుంచి వెలువడే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లో మూడింట రెండో వంతు అయొడిన్‌ ఉంటుంది. థైరాయిడ్‌ పనితీరు సజావుగా సాగడానికి గ్రాములో ఐదువేలవ వంతు పరిమాణంలో అయొడిన్‌ ప్రతిరోజూ అవసరమవుతూ ఉంటుంది. థైరాయిడ్‌ నుంచి వెలువడే హార్మోన్ల మోతాదు అతి తక్కువ. అయితే, అవి చాలా శక్తిమంతమైనవి. మెదడులో ఉండే హైపో థాలమస్, పిట్యూటరీ గ్రంథులు థైరాయిడ్‌ గ్రంథి పనితీరు సజావుగా సాగడానికి దోహదపడుతూ ఉంటాయి. థైరాయిడ్‌ను ప్రేరేపించడానికి పిట్యూటరీ గ్రంథి  థైరోట్రోపిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. పిట్యూటరీ గ్రంథి ఈ హార్మోన్‌ను స్రవించేలా దానిని హైపో థాలమస్‌ గ్రంథి ప్రేరేపిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి నరాలపై ప్రభావం చూపుతుంది. దీని పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో థైరాయిడ్‌ గ్రంథి కాస్త ఎక్కువ మోతాదులో హార్మోన్లను విడుదల చేస్తుంది. తీవ్ర విషాదం, ఆందోళన వంటివి కలిగినప్పుడు హైపోథాలమస్‌ అతిగా పనిచేస్తుంది. దాని ప్రభావంతో థైరాయిడ్‌ కూడా మోతాదుకు మించి హార్మోన్లు విడుదల చేసి, రకరకాల శారీరక, మానసిక వ్యాధులకు కారణమవుతుంది.

వీటితో అయొడిన్‌ లోపానికి చెక్‌
సముద్రపు చేపలూ, సముద్ర తీరానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయొడిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీనదాలు ఉన్నచోట నివసించేవారు సముద్రపు ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందుకంటే అక్కడ ప్రవహించే హిమనీ నదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్‌ కొట్టుకుపోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు తప్పనిసరిగా అయోడైజ్‌డ్‌ ఉప్పునే వాడాలి. అయొడిన్‌ లోపం లేకుండా చూసుకోవడం ద్వారా థైరాయిడ్‌ సమస్యలను కొంతవరకు నివారించవచ్చు.

పరిమాణంలో చిన్నది..  ప్రభావంలో పెద్దది...
థైరాయిడ్‌ గ్రంథి ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టూ ఆవరించుకుని, గులాబి రంగులో చూడటానికి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. దీని బరువు ఇరవై గ్రాములు మాత్రమే. ఇది స్రవించే హార్మోన్‌ పరిమాణం మరీ మరీ తక్కువ. ఎంత తక్కువంటే, కనీసం కంటికి ఆననంత. కచ్చితమైన లెక్కల్లో చెప్పాలంటే, ఒక గ్రామును 28 లక్షల భాగాలు చేస్తే, ఒక్కో భాగం ఎంత ఉంటుందో, అంతే పరిమాణంలో థైరాయిడ్‌ గ్రంథి హార్మోన్‌ను స్రవిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచే థైరాయిడ్‌ గ్రంథి ఒక క్రమ పద్ధతిలో పని చేసుకుంటూ పోతుంది. శిశువు పుట్టినప్పుడు ఒకవేళ థైరాయిడ్‌ గ్రంథి సజావుగా పని చేయకుంటే, మందపాటి పెదవులు, చప్పిడి ముక్కు వంటి అవయవ లోపాలతో పాటు, బుద్ధిమాంద్యం వంటి మానసిక లోపాలూ ఏర్పడతాయి. చిన్నగా కనిపించే థైరాయిడ్‌ గ్రంథి మొత్తం శరీరంలోని జీవక్రియల వేగం ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది. ఇందులో ఎలాంటి లోపాలు ఏర్పడినా, మొత్తం జీవక్రియల్లోనే తేడాలు వస్తాయి. థైరాయిడ్‌ పనితీరు మందగించడం వల్ల తలెత్తే లోపాన్ని ‘హైపో థైరాయిడిజమ్‌’ అని, థైరాయిడ్‌ అతిగా పనిచేయడం వల్ల తలెత్తే లోపాన్ని ‘హైపర్‌ థైరాయిడిజమ్‌’ అని అంటారు.

పెరిగినా తగ్గినా ప్రమాదమే... 
థైరాయిడ్‌ పనితీరులో వేగం పెరిగినా, తరిగినా ప్రమాదమే. థైరాయిడ్‌ పనితీరు మందగిస్తే, దీని నుంచి వెలువడే హార్మోన్ల పరిమాణం తగ్గుతుంది. థైరాయిడ్‌ పనితీరు మందగించడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా అయొడిన్‌ లోపం ఒకటి. గడచిన ఇరవయ్యేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అయొడైజ్డ్‌ ఉప్పు వాడకం మొదలైన తర్వాత అయొడిన్‌ లోపం కారణంగా థైరాయిడ్‌ పనితీరు మందగించిన సందర్భాలు తక్కువగానే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్‌ను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి రోగ నిరోధక శక్తి ఎదురు తిరగడం వల్ల థైరాయిడ్‌ పనితీరు మందగిస్తే, ఆ పరిస్థితిని ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌గా గుర్తించాల్సి ఉంటుంది. జన్యు కారణాల వల్ల థైరాయిడ్‌ పనితీరులో తేడాలు రావడం చాలా అరుదు. థైరాయిడ్‌ గ్రంథికి తగిన మోతాదులో అయొడిన్‌ అందకుంటే, దీని పరిమాణం బాగా పెరిగిపోయి, గొంతు వద్ద బాగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితినే ‘గాయిటర్‌’ అంటారు.  ఒక్కొక్కసారి థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేయడం మొదలుపెడుతుంది. థైరాయిడ్‌కు అందే అయొడిన్‌ మోతాదు పెరిగినప్పుడు కూడా దాని పరిమాణం అమాంతంగా పెరిగిపోతుంది. పిట్యూటరీ గ్రంథి మీద కణితి పెరిగితే, థైరోట్రోపిన్‌ ఉత్పత్తి మోతాదుకు మించి విడుదలవడం వల్ల కూడా ఇలాంటి దుస్థితి దాపురిస్తుంది. దీనినే ‘టాక్సిక్‌ గాయిటర్‌’ అంటారు. థైరాయిడ్‌ గ్రంథిలో తలెత్తే లోపాలను సరిదిద్దేందుకు చాలా సందర్భాల్లో మందులు ఇస్తారు. ఒక్కోసారి థైరాయిడ్‌కు క్యాన్సర్‌ కూడా రావచ్చు. అరుదైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స ద్వారా థైరాయిడ్‌ గ్రంథిని తొలగించే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. పూర్తిగా తొలగించాల్సి వస్తే, థైరోట్రోపిన్‌ లోపాన్ని భర్తీ చేసేందుకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ పనితీరు మందగించడం వల్ల తలెత్తే హైపో థైరాయిడిజమ్‌ సమస్యకు కూడా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ అతిగా పనిచేయడం వల్ల తలెత్తే హైపర్‌ థైరాయిడిజమ్‌ సమస్యకు మాత్రం క్లినికల్‌ కండిషన్స్‌ బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ సమస్యలు సాధారణంగా పురుషుల కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా కనిపిస్తాయి.

థైరాయిడ్‌ సమస్యలు ఈనాటివి కావు
థైరాయిడ్‌ సమస్యలకు చెందిన పేర్లు ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చినా, నిజానికి ఈ సమస్యలు ఈనాటివి కావు. క్రీస్తుపూర్వమే థైరాయిడ్‌ పనితీరులోని లోపాల వల్ల తలెత్తే సమస్యలను ప్రాచీన వైద్యులు గుర్తించారు. వాటి నివారణకు తమవంతు ప్రయత్నాలూ చేశారు. క్రీస్తుపూర్వం 16వ శతాబ్దికి చెందిన చైనా వైద్యులు థైరాయిడ్‌ సమస్యల చికిత్స కోసం సముద్రపు నాచును, స్పాంజిని ఉపయోగించేవారు. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దికి చెందిన భారతీయ వైద్యుడు సుశ్రుతుడు తన ‘సుశ్రుత సంహిత’ గ్రంథంలో థైరాయిడ్‌ లోపాల వల్ల తలెత్తే హైపో థైరాయిడిజమ్, హైపర్‌ థైరాయిడిజమ్, ఈ గ్రంథి వాపు వల్ల ఏర్పడే ‘గాయిటర్‌’ వంటి వ్యాధుల లక్షణాలను విపులంగా వివరించాడు. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన అరిస్టాటిల్, జెనోఫోన్‌ వంటి వారు తమ రచనల్లో హైపర్‌ థైరాయిడిజమ్‌ వల్ల తలెత్తే ‘గ్రేవ్స్‌ డిసీజ్‌’ వ్యాధి లక్షణాలను వివరించారు. వాళ్లందరూ వ్యాధులను, వ్యాధి లక్షణాలను దాదాపు సరిగానే గుర్తించగలిగినా, ఆ లక్షణాలకు మూలం థైరాయిడ్‌ గ్రంథిలోనే ఉన్న సంగతిని గ్రహించలేకపోయారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి హిపోక్రాట్స్, ప్లాటో వంటి వారు థైరాయిడ్‌ గ్రంథి ఉనికిని గుర్తించారు. అయితే, వాళ్లు థైరాయిడ్‌ గ్రంథిని కేవలం లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథిగా పొరబడ్డారు. నాటి వైద్యులకు థైరాయిడ్‌ గ్రంథి కనీసం ఎలా ఉంటుందో కూడా తెలియదు. క్రీస్తుశకం పదిహేనో శతాబ్దికి చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సి తొలిసారిగా థైరాయిడ్‌ గ్రంథి చిత్రాన్ని ప్రపంచానికి అందించాడు. థైరాయిడ్‌ గ్రంథి వాపు వల్ల వచ్చే ‘గాయిటర్‌’కు థైరాయిడ్‌ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడమే (థైరాయిడెక్టమీ) తగిన పరిష్కారమని క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందిన పర్షియన్‌ వైద్యుడు అలీ ఇబ్న్‌ అబ్బాస్‌ అల్‌ మగుసి తన రచనల్లో సూచించాడు. క్రీస్తుశకం 1656లో ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు, శరీర శాస్త్రవేత్త థామస్‌ వార్టన్‌ ఈ గ్రంథికి ‘థైరాయిడ్‌’గా నామకరణం చేశాడు. ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త బెర్నార్డ్‌ కోర్టోయిస్‌ 1811లో అయొడిన్‌ను కనుగొంటే, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో ఇదే కీలకమైన మూలకమని జర్మన్‌ శాస్త్రవేత్త యూజన్‌ బామన్‌ 1896లో గుర్తించాడు. వేలాది గొర్రెల నుంచి సేకరించిన థైరాయిడ్‌ గ్రంథులను బాగా ఉడికించి, సేకరించిన పదార్థానికి అతడు ‘అయొడో థైరిన్‌’గా పేరు పెట్టాడు. ఇది జరిగిన కొన్నేళ్లకు అమెరికన్‌ వైద్యుడు డేవిడ్‌ మెరైన్‌ 1907లో థైరాయిడ్‌ పనితీరుకు అయొడిన్‌ అత్యవసరమని నిర్ధారణ చేశాడు. థైరాయిడ్‌ గ్రంథి స్రవించే హార్మోన్లలో కీలకమైన థైరాక్సిన్‌ను 1914లో కనుగొన్నారు. ఆ తర్వాత 1952లో థైరాయిడో థైరాక్సిన్‌ను, 1970లో టి–4, టి–3 హార్మోన్లను గుర్తించారు. అదే ఏడాది అమెరికాకు చెందిన పోలిష్‌ వైద్యుడు ఆండ్రూ షెల్లీ టీఆర్‌హెచ్‌ హార్మోన్‌ను గుర్తించాడు. ఈ పరిశోధనకు ఫలితంగా ఆయన 1977లో నోబెల్‌ బహుమతిని పొందాడు. థైరాయిడ్‌ గ్రంథి స్రవించే హార్మోన్లను నిర్దిష్టంగా గుర్తించిన తర్వాత, థైరాయిడ్‌ సమస్యలకు అందించే వైద్య చికిత్స ప్రక్రియలు చాలా వరకు మెరుగుపడ్డాయి.

 జాతీయాలు
అగ్రహారంలో తంబళ జోస్యం
అగ్రహారం అంటే పండితులకు రాజులు, సంస్థానాధీశులు దానంగా ఇచ్చిన గ్రామం. సాధారణంగా అగ్రహారాల్లో ఉండేవారంతా మహా పండితులు, సకల శాస్త్ర కోవిదులు. తంబళ అంటే శివార్చనతో పొట్ట పోసుకునే పూజారి. శివాలయంలో అర్చనకు తగిన స్తోత్రాలు నోటికి రావడం తప్ప తంబళకు శాస్త్ర పాండిత్యం శూన్యం. అలాంటి తంబళ ఒకడు వెనకటికి ఒకనాడు అగ్రహారానికి వెళ్లి, అక్కడ తనకున్న మిడిమిడి జ్ఞానంతో జనాలకు జోస్యం చెప్పబోయి నవ్వులపాలయ్యాడట. అసాధారణ ప్రజ్ఞావంతుల ఎదుట మిడిమిడి జ్ఞానం ఉన్న అల్పులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి నవ్వులపాలయ్యే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

అందితే జుట్టు, అందకుంటే కాళ్లు
ఎలాగైనా అనుకున్న పనిని సాధించుకునే వాళ్లను ఉద్దేశించి వ్యాప్తిలోకి వచ్చిన జాతీయం ఇది. కొందరికి తలచిన పనిని సాధించుకోవడం మాత్రమే ముఖ్యం. తలపెట్టిన పనిని సాధించుకోవడానికి వాళ్లు ఎలాంటి మార్గాన్నయినా అనుసరిస్తారు. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండి, తాను తలపెట్టిన పనిని నెరవేర్చవలసిన ఎదుటి మనిషి బలహీనుడైతే, బలవంతంగానైనా, భయపెట్టయినా మెడలు వంచి మరీ పని జరిపించుకుంటారు. ఎదుటి మనిషి తన కంటే బలవంతుడైతే మాత్రం సిగ్గుశరం పక్కనపెట్టి కాళ్ల బేరానికి వస్తారు. కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి అయినా కావలసిన పనిని జరిపించుకుంటారు. నిస్సిగ్గుగా తమ పనులు జరిపించుకునే వారి ధోరణిని తేలికగా చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

అజాగళస్తన సగోత్రులు
కొందరు పనీపాటా లేకుండా కాలం వెళ్లబుచ్చేస్తూ ఉంటారు. తినడం, తిరగడం, పడుకోవడం తప్ప పొరపాటుగానైనా పనికొచ్చే పనులేవీ చెయ్యరు. ఇంట్లో వాళ్లకు గాని, బంధు మిత్రులకు గాని, ఊళ్లో వాళ్లకు గాని వారి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలాంటి వ్యర్థ జీవులను వ్యంగ్యంగా ‘అజాగళస్తన సగోత్రులు’ అని ఆక్షేపిస్తుంటారు. సంస్కృతంలో మేకను అజా అంటారు. కొన్ని మేకలకు మెడ వద్ద చిన్న పొదుగులా ఉండి సిరలు వేలాడుతూ ఉంటాయి. వాటి నుంచి పాలు రావు. అవి ఎందుకూ పనిరావు. దేనికీ పనికిరాని దద్దమ్మలు కూడా మేక మెడకు వేలాడే సిరల్లాంటి వ్యర్థులేనని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

ఇల్లలకగానే పండుగవుతుందా?
పండుగలకు, పర్వదినాలకు ఇళ్లను అలికి, ముగ్గులు తీర్చిదిద్దడం ఆచారం. అలాగని ఇల్లు అలికినంత మాత్రానే పండుగ జరిగిపోతుందనుకోలేం. ప్రకృతి వైపరీత్యాలు, దుస్సంఘటనలు వంటి అవాంతరాలు ఏవీ లేకుండా ఉంటేనే పిండివంటల వంటకాలు, బంధు మిత్రులు, అతిథి అభ్యాగతుల రాకపోకలతో పండుగ సంబరంగా జరుగుతుంది. కాలం అనుకూలించకుంటే, ఇల్లు అలికినా ఏదో ఒక అవాంతరం ఎదురైతే, ఇక పండుగ పరిస్థితి చెప్పాల్సినదేముంటుంది? ఏదైనా పనిని మొదలుపెట్టడంతోనే అది సజావుగా పూర్తయినట్లు కాదు, నిరాటంకంగా అది పూర్తి కావాలంటే పరిస్థితులన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. అప్పుడే పని విజయవంతమవుతుందని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

రక్తపరీక్షలతో నిర్ధారణ
థైరాయిడ్‌ లోపాలను రక్తపరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. రక్త పరీక్షల ద్వారా థైరాయిడో థైరోనిన్‌–టి3, థైరాక్సిన్‌–టి4, థైరాయిడ్‌ స్టిములంట్‌ హార్మోన్‌–టీఎస్‌హెచ్‌ హార్మోన్ల పరిమాణంలోని హెచ్చు తగ్గులను గుర్తించవచ్చు. అలాగే, రోగ నిరోధక వ్యవస్థ థైరాయిడ్‌ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భాల్లో యాంటీ థైరాయిడ్‌ యాంటీబాడీస్‌ను కూడా రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే, ఈ పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచన మేరకు మందులు వాడుకుంటూ పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. 

హైపో థైరాయిడిజమ్‌ లక్షణాలు
►కొద్దిగా తింటున్నా లావెక్కిపోవడం
►అలసట
►మతిమరపు
►చర్మం, జుట్టు పొడిబారిపోవడం
►కండరాల నొప్పులు
►గోళ్లలో పగుళ్లు
►మలబద్ధకం
►మహిళల్లోనైతే రుతుస్రావంలో తగ్గుదల
►మానసిక కుంగుబాటు
►మెడ వద్ద వాపులా కనిపించడం

హైపర్‌ థైరాయిడిజమ్‌ లక్షణాలు
►ఎంత తిన్నా బక్కచిక్కిపోవడం
►ఒళ్లంతా వేడిగా అనిపించడం
►అతిగా చెమటలు పట్టడం
►నిద్రలో ఇబ్బందులు
►నిలకడ లేని ఆలోచనలు
►ఆందోళన, అసహనం
►నిష్కారణమైన చిరాకు, అలసట
►గుండె వేగం పెరగడం, గుండె దడ
►మలవిసర్జన క్రమం తప్పడం
►మహిళల్లో నెలసరి సమస్యలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement