ఆరళ్లు కాదు.. ఆరు సూత్రాలు అవసరం...
రుణ్ లాంటి తల్లిదండ్రులు మనలో చాలా మందిమి ఉంటాం. అలాంటివారిని చాలా వరకు చూస్తుంటాం. వరుణ్, అతని తల్లిదండ్రుల పరిస్థితి గమనిస్తే తేలిన విషయాలు ఇవి...
ఒకటి: ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉండటం. వరుణ్‌కి తన ఈడు పిల్లలే కాదు, సమయానికి మరొకరు తోడులేకపోవడంతో ఇంటి వాతావరణం విసుగు అనిపించేంది.
రెండు: పిల్లలకు నచ్చింది కాకుండా మనకు నచ్చింది, మన కలలను వారి మీద రుద్దాలనుకుంటాం. యుక్తవయసులో కష్టాలు రుచించవు. వరుణ్‌కి నచ్చని కోర్సు చదవమని తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి ఆ అబ్బాయికి నచ్చలేదు. అందుకే మరో దారిని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల మీదకు ఎదురుదాడికి దిగాడు. చదువు మూలనపడింది.
మూడు:13-19 ఏళ్లలోపు పిల్లల్లో పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఈ దశనే యుక్తవయసు అంటారు. ఈ వయసులో హార్మోన్లలో మార్పులు అధికం. కొత్తదనం కోరుకుంటారు. అందుకే ప్రయోగాలు ఎక్కువ చేస్తుంటారు. తాతాల్కిక ఆనందాలు పొందాలని ఉబలాటపడతారు. అబ్బాయిలైతే.. బైక్ రేసింగ్, బెట్టింగ్, సినిమాలు... వంటివి ఎంచుకుంటారు. చదువు మూలన పడేసి వరుణ్ ఎంచుకున్న మార్గం ఇదే!
నాల్గు: టీవీ, సినిమా హీరోలు చేసే విన్యాసాలు, హింసాత్మక సన్నివేశాలు, కిక్ ఇచ్చే ప్రకటనలు.. ఈ వయసు వారిని ఎక్కువ ఆకట్టుకుంటాయి. తామూ హీరోలకు ఏ విధంగా తీసిపోము అని నిరూపించుకోవా లనుకుంటారు. దొంగతనాలు, స్మోకింగ్, అబద్ధాలు వరుణ్‌కి తాత్కాలిక ఆనందాన్నిచ్చాయి. వాటినే మళ్లీ మళ్లీ చేయాలని కోరుకునేవాడు.
ఐదు: పిల్లలు చెప్పింది వినడం లేదని, శిక్షించడానికి పెద్దలు చేసే పనులు కొన్ని ఉంటాయి. అందులో పిల్లల దగ్గర ఫోన్లు లాగేసుకోవడం. ఇంటర్నెట్ కట్ చేయడం, ఇంట్లో పెట్టి తాళం వేయడం, కొట్టడం. ఇవన్నీ ఈ వయసు పిల్లలకు పెద్దలపై మరింత ద్వేషం కలిగించేవే. తమ అవసరాలను తీర్చేవారు, తమను ఎందుకు శిక్షిస్తున్నారో తెలియదు. అందుకని రహస్యంగా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో తెలిస్తే తనను శిక్షిస్తారేమో అని భయపడి వరుణ్ రహస్యంగా బయట ఆనందం వెతుక్కునేవాడు.
ఆరు: పనుల ఒత్తిడి మూలంగా పిల్లలతో కూర్చొని కాసేపు కూడా కబుర్లు చెప్పకపోవడం. తల్లీ దండ్రి ఇద్దరూ ఉద్యోగాలు అంటూ వెళ్లిపోయినా సాయంత్రాలు, వారంతాలు, సెలవు రోజులు పిల్లలతో ఎక్కువ సేపు మాట్లాడాలి. పిల్లలు చెప్పింది ఓపికగా వినాలి. అప్పుడే వారి మనసులో ఉన్న బాధ, భయాలు తెలిసిపోతాయి. లేదంటే తమ మనసులోని భావాలు పంచుకోవడానికి స్నేహితులపై ఆధారపడతారు. ఇంటి విషయాలు బయట చెబుతున్నారు అంటే ఇంట్లో పిల్లలు తగింత మానసిక విశ్రాంతి పొందడం లేదు అని అర్థం చేసుకోవాలి. టీనేజ్ అనేది గోల్డెన్ పీరియడ్. ఈ వయసు పిల్లల్లో వచ్చే మార్పులు అర్థం కాకపోతే, పరిస్థితిలో తేడాలు గమనిస్తే వెంటనే నిపుణుల సలహాలు తీసుకొని పాటించాలి.
- డా.కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్