వేడి ఆవిర్లు వస్తున్నాయి | what to do to increase the hormonal balance | Sakshi
Sakshi News home page

వేడి ఆవిర్లు వస్తున్నాయి

Published Sun, Apr 21 2019 12:49 AM | Last Updated on Sun, Apr 21 2019 12:49 AM

what to do to increase the hormonal balance - Sakshi

నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. వేడి ఆవిర్లు వస్తున్నాయి. ఇవి మెనోపాజ్‌ దశలోని లక్షణాలు అని విన్నాను. మెనోపాజ్‌ వచ్చిన వాళ్లు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈస్ట్రోజెన్‌ భర్తీ కావాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలియజేయగలరు. – పీఆర్‌వి, అవనిగడ్డ
మీ వయసు ఎంతో రాయలేదు. పీరియడ్స్‌ ఆగిపోయి ఎన్నాళ్లయిందో రాయలేదు. నలభై ఏళ్ల తర్వాత ఒక ఏడాది పాటు పీరియడ్స్‌ రాకపోతే దానిని మెనోపాజ్‌ అంటారు. ఈ సమయంలో అండాశయం నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌ బాగా తగ్గిపోవడం వల్ల బాగా చెమటలు పట్టడం, ఒంట్లో వేడి ఆవిర్లు రావడం, గుండెదడగా ఉండటం, నిద్రపట్టకపోవడం, చిరాకు, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. వేసవిలో కొన్ని లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ఫ్యాన్‌ లేదా ఏసీ ఉండే చోట ఉండాలి. వదులుగా ఉండే లేతరంగు కాటన్‌ దుస్తులు ధరించాలి. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ, నీరు, పండ్లు, పండ్లరసాలు తీసుకోవాలి. పచ్చళ్లు, వేపుళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కనీసం పదిహేను నిమిషాల సేపు నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం మంచిది. సహజంగా శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌ తగ్గిపోవడం వల్ల రక్తం నుంచి క్యాల్షియం ఎముకలకు చేరదు. ఎముకలు తొందరగా అరిగిపోవడం వల్ల నడుం నొప్పులు, ఒంటినొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, పప్పులు, పండ్లు, అవిసెగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీన్స్, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు వల్ల వీటి ద్వారా క్యాల్షియంతో పాటు ఈస్ట్రోజెన్‌లా పనిచేసే ఫైటోఈస్ట్రోజెన్స్‌ లభ్యమవుతాయి. ఈ జాగ్రత్తలు పాటించినా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి, ఫైటోఈస్ట్రోజెన్స్, ఐసోఫ్లావోన్స్‌ ఉండే సప్లిమెంట్స్‌ మాత్రల రూపంలో తీసుకోవచ్చు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మాత్రల రూపంలో లేదా స్ప్రే రూపంలో లేదా జెల్‌ రూపంలో డాక్టర్‌ సలహా మేరకు తక్కువ మోతాదుల్లో వాడుకోవచ్చు.

నాకు కూల్‌డ్రింక్స్‌ తాగే అలవాటు ఉంది. దీనివల్ల పిల్లలు బరువుతో పుడతారని అంటున్నారు. పిల్లలు బొద్దుగా ఉంటే నాకు ఇష్టం. ఇలా బరువుగా పుట్టడం వల్ల నష్టం ఉందా? గర్భిణులలో జెస్టేషనల్‌ డయాబెటిస్‌ రావడానికి కారణం ఏమిటో తెలియజేయగలరు. – జి.హేమ, రంగంపేట
కూల్‌డ్రింక్స్‌లో కార్బన్‌ డయాక్సైడ్‌ గ్యాస్, ఫాస్ఫారిక్‌ యాసిడ్, కార్బానిక్‌ యాసిడ్, కెఫీన్, సుగర్, కలరింగ్‌ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషక పదార్థాలేవీ ఉండవు. వీటిలో సుగర్‌ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తాగితే గర్భిణులలో బరువు పెరగడం, సుగర్‌ లెవల్స్‌ పెరగడం, కడుపులోని బిడ్డ అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూల్‌డ్రింక్స్‌లోని మిగిలిన పదార్థాల వల్ల కడుపులో గ్యాస్‌ తయారవడం, ఎసిడిటీ ఏర్పడటం, కెఫీన్‌ మోతాదు మించడం వల్ల అబార్షన్లు, పుట్టే బిడ్డల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ అధిక బరువుతో ఉంటే కాన్పు సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సుగర్‌ లెవల్స్‌లో తేడాలు, ఇతరత్రా సమస్యలు కూడా ఏర్పడవచ్చు. బిడ్డ మరీ బొద్దుగా ఉండే కంటే, మామూలు బరువుతో ఉండి చలాకీగా ఉండటం ముఖ్యం. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటే గర్భిణులలో ఉండాల్సిన మోతాదు కంటే సుగర్‌ లెవల్స్‌ పెరిగి మధుమేహం రావడం. ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగడం, హార్మోన్ల సమతుల్యత లోపించడం వంటి అనేక కారణాల వల్ల జెస్టేషనల్‌ డయాబెటిస్‌ రావచ్చు. ఇది నిర్ధారణ అయితే డాక్టర్‌ పర్యవేక్షణలో ఆహారంలో మార్పులు చేసుకుని, అవసరమైతే మందులు, ఇన్సులిన్‌ ఇంజెక్షన్స్‌ తీసుకుంటూ సుగర్‌ లెవల్స్‌ను సక్రమంగా అదుపులో ఉంచుకుంటే పండంటి బిడ్డను క్షేమంగా కనవచ్చు.

హోర్మోన్ల లోపానికి, నెలసరిలో తేడా, ఒత్తిడికి దగ్గర సంబంధం ఉంటుందని చదివాను. హార్మోన్ల సమతుల్యం పెంచుకోవడానికి ఏం చేయాలో తెలియజేయగలరు.– బి.సారిక, హైదరాబాద్‌
పీరియడ్స్‌ సక్రమంగా రావాలి. హార్మన్స్‌ సక్రమంగా విడుదల కావాలి. మొదట మెదడులోని హైపోథాలమస్‌ అనే భాగం నుంచి జీఎన్‌ఆర్‌హెచ్‌ అనే హార్మోన్‌ విడుదలై అది పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజపరచడం వల్ల పిట్యూటరీ నుంచి ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టీఎస్‌హెచ్‌ వంటి అనేక హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి అండాలు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గర్భాశయంపై ప్రభావం చూపి నెలసరి రావడానికి దోహద పడతాయి. కాబట్టి మొదట మెదడు సక్రమంగా ఉంటే, హార్మోన్స్‌ సక్రమంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి వాటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్‌ క్రమం తప్పి, నెలనెలా సక్రమంగా రాకపోవచ్చు. కాబట్టి క్రమంగా నడక, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటి జీవనశైలి మార్పులు, ఆహారంలో మార్పులు పాజిటివ్‌ దృక్పథం, ఆత్మస్థైర్యం వంటివి అలవరచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ ,హైదరాబాద్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement