నా వయసు 29 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్. బాగా సన్నగా ఉంటాను. బరువు పెరగాలనుకుంటున్నాను. ఈ సమయంలో బరువు పెరగవచ్చా? ‘యావరేజ్ వెయిట్’ ఎంత ఉండాలి? ‘మార్నింగ్ సిక్‌నెస్’తో బాధపడుతున్నాను. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? – కె.శ్రీదేవి, రాజంపేట
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భం దాల్చినప్పుడు ఉండే బరువును బట్టి నెల నెలా ఎంత పెరగాలనేది సూచించడం జరుగుతుంది. సాధారణ బరువు ఉన్నవాళ్లకి నెలకు రెండు కిలోల వరకు బరువు పెరగవచ్చని చెప్పడం జరుగుతుంది. మీరు మరీ సన్నగా ఉన్నారంటున్నారు కాబట్టి నెలకు రెండున్నర నుంచి మూడు కిలోల వరకు బరువు పెరగవచ్చు. మొత్తం మీద తొమ్మిది నెలల వ్యవధిలో ఏవరేజ్‌గా పన్నెండు కిలోల వరకు పెరగవచ్చు. మీరైతే పదిహేను కిలోల వరకు పెరగవచ్చు. మొదటి మూడు నెలలు వాంతులు, వికారం వల్ల కొంతమంది సరిగా తినకపోవడం వల్ల కొందరు బరువు తగ్గిపోతారు కూడా. మార్నింగ్ సిక్‌నెస్ అంటే గర్భిణిలలో మొదటి మూడు నెలలో ఎక్కువగా విడుదలయ్యే హెచ్‌సీజీ హార్మోన్ వల్ల పొద్దున్నే లేచిన వెంటనే వికారం, నీరసం, వాంతులు, తలతిప్పడం వంటివి ఉండటం. వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, మజ్జిగ, పెరుగు, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో డాక్సినేట్, జన్‌డాన్‌సెట్రాన్ వంటి మాత్రలు వాడుకోవచ్చు. అవసరమైతే సెలైన్లు కూడా తీసుకోవలసి ఉంటుంది.
మెనోపాజ్ నలభై ఏళ్ల కంటే ముందు కూడా వచ్చే అవకాశం ఉందని విన్నాను. ఇలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు.
– బి.సునీత, సంగారెడ్డి
సాధారణంగా మెనోపాజ్ 45 నుంచి 55 సంవత్సరాల లోపు ఎప్పుడైనా రావచ్చు. కొందరిలో 40 ఏళ్ల లోపే రావచ్చు. దీనిని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. జన్యుపరమైన కారణాల వల్ల, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, పిల్లల కోసం ఎక్కువగా మందులు వాడటం, అండాశయాలపై ఆపరేషన్లు, కడుపులో కణితులకు, క్యాన్సర్‌కు రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి చికిత్సలు తీసుకోవడం, ఇంకా ఎన్నో తెలియని ఇతర కారణాల వల్ల ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రావచ్చు. ఇది రాకుండా ఉండటానికి మనం ఏమీ చెయ్యలేం. కాకపోతే మరీ 40 సంవత్సరాలకే మెనోపాజ్ రావడం అంటే, అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల తొందరగా అలసిపోవడం, క్యాల్షియం తగ్గిపోయి ఒళ్లు, నడుము, మోకాళ్ల నొప్పులు, కలయిక మీద ఆసక్తి లేకపోవడం, మూత్ర సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీనికి ఆహారంలో ఎక్కువగా సోయాబీన్స్, ఆకుకూరలు, పండ్లు, పాలు, వాటి ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, గైనకాలజిస్టును సంప్రదించి ఫైటో ఈస్ట్రోజెన్ మాత్రలు, క్యాల్షియం, అవసరమైతే హార్మన్లు కూడా తీసుకోవలసి ఉంటుంది.
నా వయసు 27 సంవత్సరాలు. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి లేజర్ చికిత్స చేయించుకోవాలనుకుంటున్నాను. ఈ టైమ్‌లో మంచిది కాదు అంటున్నారు. వ్యాక్సింగ్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. అయితే వ్యాక్సింగ్ కూడా మంచిది కాదని కొందరు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? మెడ, పొట్ట భాగం నల్లగా మారకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – విబీ, హైదరాబాద్
అవాంఛిత రోమాలను తొలగించుకునే ముందే అవి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తున్నాయా, లేక పీసీఓడీ, అడ్రినల్ ట్యూమర్స్, ఒవేరియన్ ట్యూమర్స్ వంటి ఇతరేతర కారణాల వల్ల వస్తున్నాయా అనే విషయాన్ని పరీక్షలు చేయించుకుని కారణం తెలుసుకోవడం మంచిది. కారణం తెలుసుకోకుండా లేజర్ తీసుకున్నా, లోపల ఉన్న సమస్య వల్ల చికిత్సకు ఎక్కువ సిటింగ్స్ పట్టడం, కొంతకాలం తర్వాత మళ్లీ అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. వ్యాక్సింగ్ కేవలం తాత్కాలికమైనది. వ్యాక్సింగ్‌తో పోలిస్తే, లేజర్‌తో ప్రయోజనాలు ఎక్కువ. సమస్యకు తగిన చికిత్స తీసుకుంటూ లేజర్ చేయించుకోవడం మంచిది. మెడ మీద, పొట్ట మీద నలుపు చాలావరకు పీసీఓడీ సమస్యలో ఉంటుంది. దీనికి సంబంధించి డెర్మటాలజిస్టును సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది. వీటిలో ముఖ్యంగా బరువు తగ్గడం, జీవనశైలి మార్పులు, వ్యాయామం, ఆహార మార్పులు ముఖ్యమైనవి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment