స్పందోలిక మన్‌డోలిక
ఆటపాటలు తప్ప అన్యం ఎరుగని బాల్యం.. జీవితాంతం ఏదో రూపంలో తొంగి చూస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలో.. బుజ్జాయిగా అమ్మతో దిగిన ఫొటోనో కనిపిస్తే మనసు కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతుంది. ఆనాటి గుర్తులను తడిమి వర్తమానంలోకి వచ్చిన మనుషులు కాసేపు అవే జ్ఞాపకాలల్లో సేదతీరుతారు. కానీ కళను ఒంటబట్టించుకున్న ఈ మనిషి మాత్రం.. ఆనాటి జ్ఞాపకాలను అంతే ఫ్రెష్‌గా మళ్లీ ఆవిష్కరిస్తున్నాడు. రవికాంత్ ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ సాధించాడు. బొమ్మలు గీస్తాడు.. తయారు చేస్తాడు కూడా. తన జ్ఞాపకానికి కళను మేళవించి.. ఆ కళకు చరిత్రను రంగరించి బొమ్మల రూపంలో ప్రజెంట్ చేస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో థీమ్ తీసుకుని.. దాన్ని అన్ని కోణాల్లో నేటి తరానికి చూపుతున్నాడు.
రవికాంత్ తండ్రి టీచర్, ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్. ఆయన స్టూడియోలో పిల్లలు ఫొటో దిగడానికి ఊగే కీలుగుర్రం ఒకటి ఉండేది. చిన్నప్పుడు దానిపై సరదాగా స్వారీ చేసిన రవికాంత్‌కు ఈ మధ్య ఆ రోజులు గుర్తొచ్చాయి. వింతగా తోచిన ఆనాటి జ్ఞాపకాన్ని.. గొప్పగా చూపాలనుకున్నాడు. కీలుగుర్రాల పుట్టపూర్వోత్తరాల కోసం చరిత్రలోకి తొంగి చూశాడు. వాటి పుట్టిల్లు బెంగళూరు, మైసూర్ మధ్య ఉన్న చెన్నపట్న అని తెలుసకున్నాడు. అక్కడికి వెళ్లి వాటి గురించి తెలుసుకుని రకరకాల కీలుగుర్రాల మినియేచర్ పెయింటింగ్స్ వేశాడు.
కొయ్యలతో కీలుగుర్రాల నమూనాలు తీర్చిదిద్దాడు. వీటన్నింటినీ వాటి చరిత్రతో సహా.. స్పందోలిక (ద రాకింగ్ హార్సెస్) పేరుతో బంజారాహిల్స్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. గుర్రాల ఐతిహాసక విశిష్టతను, చారిత్రాత్మక ప్రశస్తిని తెలియజేస్తూ కాన్వాస్‌పై రంగులద్దాడు. పోస్ట్ మాడర్నిజంతో గుర్రాల నేపథ్యాన్ని ఆవిష్కరించాడు. గురువారంతో ఈ ప్రదర్శన ముగుస్తుంది.
ఫొటోలు.. ఫోజులు..
తన మదిలో మెదిలిన ఆ పాత గుర్తులను కమనీయంగా చూపడం రవికాంత్‌కు కొత్తకాదు. 90వ దశకంలో ఫొటో స్టూడియోకు వెళ్లి ఫొటోలు దిగడం అంటే చాలామంది ఓ పండుగలా ఫీలయ్యేవాళ్లు. సెల్ఫీలు, రిల్ఫీలు దిగుతున్న ఈ స్మార్ట్ జమానాకు నాటి ఫొటో ఫోజుల సంగతి తెలియజేసేందుకు రవికాంత్ విభిన్న ప్రయోగం చేశాడు. ఆనాటి ఫొటోలు.. ఫోజులు ఎలా ఉండేవో.. తనకొచ్చిన కళతో కళ్లముందుంచాడు. ఆ తర్వాత మహారాజులకు రాచఠీవి తెచ్చే కాస్ట్యూమ్స్ గురించి ఆలోచన రాగానే.. ఆ థీమ్‌ను ఎంచుకుని వారి గెటప్స్‌పై ఓ ప్రదర్శన నిర్వహించాడు.