దయనీయం..మేదర జీవనం
అడవికెళ్లి కంకతెచ్చి.. నిలువునా చీల్చి.. ఎండకు ఆరబెట్టి.. ఓపికతో అల్లి.. మార్కెట్‌కు తీసుకెళ్లి.. అమ్మితే వచ్చే డబ్బులతో జీవనం సాగించే మహేంద్రులకు (మేదరులకు) ఉపాధి లేకుండా పోతోంది. వాళ్లు అల్లిన తట్టలకు, బుట్టలకు ఆదరణ తగ్గిపోతుండడంతో మేదరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్లాస్టిక్ దెబ్బకు మేదరుల అల్లికలకు ఆదరణ తగ్గుతోంది. వృత్తిని నమ్ముకుని దుర్భర స్థితిలో కుటుంబాలు వెళ్లదీస్తున్న మేదరి కుటుంబాలపై ‘సాక్షి’ ప్రేత్యేక కథనం..
కౌటాల(సిర్పూర్): కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుటుంబాలు ఉండగా వీటిలో 283 కుటుంబాలు వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుటుంబమంతా కష్టపడితే కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఖర్చులు పోను పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అడవి నుంచి అధికారులు వెదురును తీసుకెళ్లని వ్వకపోవడంతో చేతినిండా పనిదొరకక కొన్ని నెలలుగా మేదరులు ఆర్థికంగా ఇబ్బందులు ప డుతున్నారు. చాలా మంది మేదరి కులస్తులు వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్ర భుత్వం ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు.
వెదురుతో రూపు దిద్దుకునేవి ఇవే..
మేదరులు వెదురుతో తడకలు, వెదురు బుట్టలు, గొర్ల తడకలు, చాటలు, గంపలు, పెళ్లి పందిళ్లు, మొక్కల పెంపకానికి చిన్నచిన్న బుట్టలు తయారు చేస్తారు. గంపలు, నిచ్చెనలు, పూలతొట్టీలు, విసనకర్రలు, పొయ్యి గొట్టాలు, ఆటవస్తువులు, తరాజు, బుట్టలు, ధాన్యం నిల్వ చేసే గంపలు, వస్తువులను మేదరులు తయారు చేస్తారు.
దొరకని ముడిసరుకు..
గతంలో అడవులు ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడపడితే అక్కడ కంకబొంగు లభిస్తుండేది. దీని ద్వారా మేదరుల అల్లికలకు ముడి సరుకు విరివిగా లభించేది. అడవులు అంతరిస్తుండడంతో అధికారులు కంకబొంగును అడవి నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో మేదరులకు చేతినిండా పనిదొరకక కుటుంబం నడవని స్థితి. హరితహారంలో అధిక సంఖ్యలో వెదురు మొక్కలు నాటాలని మేదరులు కోరుతున్నారు.
వెదురుతో తయారు చేసిన తట్టలు, బుట్టలు
ముత్తంపేటలో తట్టలు అల్లుతున్న మేదరులు
అన్నింటా ప్లాస్టిక్..
ప్రస్తుతం అన్ని వస్తువులు ప్లాస్టిక్‌లో లభిస్తుండడంతో మేదరులకు ఉపాధి కరువవుతోంది. అడవి నుంచి వెదురును తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాలాని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందించి ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు.
మేదరి కులస్తులను ఆదుకోవాలి
కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుంటుబాలు ఉన్నాయి. వీటిలో 283 మేదరి కుటుంబాలు మేదరి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం మేదరుల అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించి వెదురు బొంగుతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలి. అడవుల్లో వెదురు మొక్కలను ఎక్కువగా నాటాలి. ప్రభుత్వం రుణాలు అందించాలి.
– సుల్వ కనకయ్య, మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు
కుటుంబ పోషణ భారంగా మారింది
నా పేరు రాచర్ల లక్ష్మి నారాయణ. మాది కౌటాల మండలం గురుడుపేట. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. 30 ఏళ్లుగా మేదరి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. అధికారులు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి మేదరులను ప్రోత్సాహించాలి. లేకుంటే కులవృత్తి కనిపించకుండాపోతుంది. ఆర్నెళ్ల నుంచి అటవీ అధికారులు వెదురును అడవిలో నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో పని లేక పస్తులుంటున్నాం. ఆరు నెలల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. మా తమ్ముడు అడవి నుంచి వెదురు తెస్తే నేను ఇంటి వద్దే ఉంటూ వెదురు వస్తువులు తయారు చేస్తాను. తయారు చేసిన వెదురు వస్తువులను మా తమ్ముడు గ్రామాల్లో, వార సంతల్లో అమ్ముతాడు. మేదరి వృత్తిపైనే నేను. నా భార్య, నా కూతురు, మా తమ్ముడు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఆదరణ తగ్గిపోవడంతో, అటవీ అధికారుల ఆంక్షలతో వృత్తిని వీడాల్సి వస్తోంది.