యువకుడు దారుణహత్య
- ఇంటి ఎదుటే ఘాతుకం
- తండ్రే చంపాడంటూ తల్లి ఆరోపణ
- ఆస్తి తగాదాలే హత్యకు కారణమా..?
గుంతకల్లు పట్టణంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇంటి ఎదుటే ఈ ఘాతుకం జరిగింది. తండ్రే చంపి ఉంటాడని తల్లి ఆరోపించింది. ఈ హత్యకు ఆస్తి తగాదాలా.. లేక ఇంకేదైనా కారణమా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకెళితే.. హోటల్ అశోక ప్యారడైజ్ సమీపాన రంగా టీవీ హౌస్ వెనుక ప్రాంతంలో మంగళవారం ఉదయం రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అర్బన్ సీఐ రాజు, టూటౌన్ ఎస్‌ఐ వలిబాషా, ఐడీ పార్టీ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎవరో బండరాయితో తలపై మోది చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన యువకుడు నూర్ అహమ్మద్ (31) అని గుర్తించారు. ఇంటికి ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకెళ్లి పరిశీలించగా కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు.
పోలీసుల నుంచి సమాచారం అందుకున్న నూర్‌అహమ్మద్ తల్లి ముంతాజ్‌బేగం, సోదరులు అల్తాప్, అల్కమల్ వెంటనే స్వగృహానికి చేరుకుని బోరున విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తి కోసం కుటుంబ సభ్యులు నిత్యం గొడవపడుతుండేవారని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు.
కన్నతండ్రే కాటికి పంపాడు!
నూర్ అహమ్మద్ తండ్రి మహ్మద్‌బాషా అలియాస్ పహిల్వాన్ బాషా మ్యారేజ్ బ్యూరో. ఈయనకు ముగ్గురు సంతానం. ఆస్తి గొడవల నేపథ్యంలోనే నూర్‌అహమ్మద్‌ను తండ్రి హతమార్చి ఉండవచ్చని తల్లి ముంతాజ్‌బేగం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. మహ్మద్‌బాషాకు వారసత్వంగా రెండు ఇళ్లు వచ్చాయని, ఇందులో ఒకదాన్ని అమ్ముకున్నాడని పేర్కొంది. మిగిలిన ఇల్లు కూడా ఎక్కడా అమ్ముకుంటాడోనన్న భయంతో మామ (మహ్మద్‌బాషా తండ్రి) ఇంటి పత్రాలు తనకు ఇచ్చి భద్రపరచాలని చెప్పాడని ముంతాజ్‌బేగం తెలిపింది. ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ మహ్మద్‌బాషా కొన్ని నెలలుగా పిల్లలను, తనను వేధిస్తుండేవాడని వాపోయింది. వేధింపులను భరించలేక పట్టణంలోని బీఎస్‌ఎస్ కాలనీలో ఉన్న తన పుట్టింటికి వెళ్లానని చెప్పింది. పెద్దకుమారుడు అల్తాఫ్, రెండో కుమారుడు అల్కమల్‌లు వారి అత్తారింటికి వెళ్లారని తెలిపింది. చిన్నకుమారుడు నూర్ అహమ్మద్, భర్త మహ్మద్‌బాషా ఇద్దరే మూడు రోజులుగా ఇంట్లో ఉంటున్నారని వివరించింది. ఈ నేపధ్యంలోనే చిన్నకుమారుడు నూర్ అహ్మద్‌ను తన భర్త హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.
పోలీసుల అదుపులో నిందితుడు?
నూర్ అహమ్మద్ హత్య కేసులో నిందితుడైన తండ్రి మహ్మద్‌బాషాను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నూర్‌అహ్మద్‌ను కన్నతండ్రే హత్య చేశాడా? లేదా ఇతరులెవరైనా ఈ పని చేశారా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.