![Young Man Suicide In Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/17/16ANG23A-110009.jpg.webp?itok=gLq1ulAM)
హేమంత్ వద్ద లభించిన ఆధార్‌కార్డు
అనంతపురం సెంట్రల్ : స్నేహితుడి మృతికి పరోక్షంగా తనే కారణమని మనస్తాపానికి గురైన యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే స్నేహితులిద్దరూ మృత్యువాత పడటం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పోలీసుల కథనం మేరకు... నగరంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన జయశేఖర్, శకుంతలమ్మ దంపతుల కుమారుడు ప్రశాంత్ (23), విశాఖపట్నంకు చెందిన కండక్టర్ హరిప్రసాద్ కుమారుడు హేమంత్ (23) స్నేహితులు. హేమంత్ పీవీసీ పైపులు, డ్రిప్ పరికరాలకు సంబంధించిన బిజినెస్‌ను అనంతపురంలోని బళ్లారిరోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ప్రారంభించానుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం నగరానికి వచ్చాడు.
స్నేహితులతో కలిసి సరదాగా గడిపి.. రాత్రికి ఎస్టేట్ సమీపంలోనే పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటాక (ఆదివారం వేకువజామున ఒంటి గంట)ద్విచక్రవాహనాల్లో ఇళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రశాంత్ వేగంగా వస్తూ పీటీసీ ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో మృతి చెందాడు. ప్రశాంత్ మృతికి పరోక్షంగా తానే కారణమనే భావనతో హేమంత్ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రాజీవ్‌కాలనీ సమీపాన రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని, మార్చురీకి తరలించారు. సోమవారం ఆధార్ కార్డ్ ఆధారంగా ప్రశాంత్ స్నేహితుడు హేమంత్ మృతదేహంగా గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment