మృతులు అంజి,అక్షయ్ (ఫైల్)
సాక్షి, ధర్మపురి(కరీంనగర్): అతివేగం, అజాగ్రత్త ఇద్దరు యువకుల నిండుప్రాణాల్ని బలితీసుకుంది. అసలే ఆదివారం, అందులోనూ అమావాస్య, ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దని తల్లిదండ్రులు వారించినా వినకుండా బయటకు వెళ్లిన ప్రాణస్నేహితులు అక్షయ్(17), అంజి(20) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వడ్డెరకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం బూరుగుపల్లెకు చెందిన అలకుంట సాంబయ్య – తిరుపతమ్మ దంపతుల కుమారుడు అక్షయ్, సంపంగి లచ్చయ్య– పద్మ దంపతుల కుమారుడు అంజి ప్రాణ స్నేహితులు. మంచిర్యాలకు చెందిన మరో స్నేహితుడు ఓ ఆటోను అక్షయ్ ఇంటివద్ద ఉంచి వెళ్లాడు. దీంతో అక్షయ్ వారం రోజులుగా ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు.
ఆదివారం అక్షయ్ అంజితో కలిసి ఆటోలో ధర్మపురికి వెళ్లారు. ఆదివారం, అమావాస్య మంచిదికాదని తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినలేదు. దీంతో తిరుగు ప్రయాణంలో ధర్మపురి వడ్డెరకాలనీ వద్ద ఎదురుగా అతివేగంగా వస్తున్న మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో మూడు ఫల్టీలు కొట్టింది. ఆటో నడుపుతున్న అక్షయ్, అందులో కూర్చున్న అంజి తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో యువకుల మృతదేహాలు గుర్తుపట్టనంతగా ఛిద్రమయ్యాయి. సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటోను రోడ్డుపైనుంచి తొలగించారు. బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్షయ్ తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అమావాస్య వద్దని చెప్పినా వినలేదు
‘అమావాస్య.. ఆదివారం.. ఆటో బయటకు తీయకు బిడ్డా.. అని చెప్పిన. నా మాట వినకుండా ధర్మపురికి వెళ్లివస్తానని చెప్పిండు. తిరి గిరాని లోకానికి పోయిండు’ అని తిరుపతమ్మ కన్నీటి పర్యంతమైంది. మృతులిద్దరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారే. అక్షయ్ తండ్రి సాంబయ్య బతుకు దెరువు కోసం ముంబాయి వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కొ డుకు, కూతురు ఉంది. అంజి తండ్రి లచ్చయ్య కులవృత్తిలో భాగంగా బండరాళ్లు పగులగొడుతూ ఉంటాడు. వీరికి ఒక్కగానొక్క కొడుకు. – తిరుపతమ్మ, అక్షయ్ తల్లి
మరణంలోనూ వీడని స్నేహం
అక్షయ్, అంజి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. చిన్ననాటి నుంచి ప్రాణస్నేహితులు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. అక్షయ్ ఇంటర్ చదువుతుండగా అంజి బండరాళ్లు కొడుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment